సింగరేణికి కాలుష్యం కాటు

by Ravi |   ( Updated:2022-09-03 18:08:59.0  )
సింగరేణికి కాలుష్యం కాటు
X

నీరు జీవరాశికి ప్రాణాధారం. అవసరమైన పోషకం శరీర సామర్థ్యానికి నీరు అవసరం. అన్ని జీవ రసాయన చర్యలు నీటితోనే జరుగుతాయి. జీర్ణక్రియ, శోషణం, రవాణా, పోషకాలు కరిగించడం వ్యర్థ ఉత్పత్తుల తొలగింపు థర్మోగ్రూలేషన్ కోసం నీరు అవసరం. శరీర బరువులో 50 నుంచి 80 శాతం నీరు ఉంటుంది. భూమిపై సముద్ర నీరు 97.2 శాతం, హిమానీ నదులు మంచుగా 2.15 శాతం, భూగర్భ జలాలు 0.61 శాతం, నీటి సరస్సులు 0.009 శాతం ఉంటాయి. అందులో 1.2 శాతం మాత్రమే తాగునీరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకం దగ్గర గోదావరి నది జన్మించింది. ఇది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. దాదాపు 1,465 కిలోమీటర్లు ప్రవహించి దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద నదిగా వాసికెక్కింది. దీని మీదనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, వరద కాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిళ్ల (పార్వతీ), అన్నారం (సరస్వతీ), మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, దమ్ము గూడెం, దేవాదుల ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుని సాగు నీరు,తాగు నీరు ఉపయోగించుకోవడం జరుగుతుంది.

కలుషిత నీటితో ఇబ్బందులు

గోదావరి నది పరీవాహకంగా ఉన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 2,52,308 మంది ప్రజలు ఉన్నారు. వీరందరూ సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్, కొత్తగా నిర్మితమవుతున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, రామగుండం ఫర్టిలైజర్స్‌లో పనిచేసేవారు లేదా వాటి మీద ఆధారపడినవారే. అయితే వీటన్నింటి పారిశ్రామిక వ్యర్థాలు రోజుకు 40 మిలియన్ లీటర్లు నేరుగా సుందిళ్ల బ్యారేజీలో కలుస్తున్నాయి. డ్రైనేజీ వాటర్ కూడా కలుస్తున్నది. వ్యర్థాలు, మురుగునీరు కలవడంతో బీఓడీ (బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్) ప్రమాదకర స్థాయికి చేరింది. బ్యారేజీ నీరు తాగడానికి, వంట చేసుకోవడానికి, కనీసం పాత్రలు కడగటానికి కూడా పనికి రావడం లేదు.

ఇది ఇంకా కొద్ది కాలం కొనసాగితే జీవులకు, నిర్జీవులకు హాని కలిగించే స్థాయికి పెరిగి నీటిలో పైటో ప్లాంక్టన్ విస్తరణను ప్రేరేపిస్తుంది. సింగరేణి యాజమాన్యం గోదావరిఖని సెక్టార్-1, సెక్టార్-2 ఏరియాలలో యైటింక్లైన్ కాలనీ, సెంటినరీ కాలనీలో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు సుందిళ్ల బ్యారేజీ నుంచే రక్షిత మంచినీటిని సరఫరా చేస్తుంది. కలుషిత నీటితో కార్మిక కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నా, కార్మిక సంఘాలు ధర్నాలు చేసినా, ఎన్నో విజ్ఞాపన పత్రాలను ఇచ్చినా కూడా సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి బొగ్గు గనుల ప్రమాదాలలో 67 మంది కార్మికులు చనిపోయారు. ప్రాణాలను పణంగా పెట్టి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తికి పాటుపడుతున్న కార్మికులకు కనీసం రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయడానికి శ్రద్ధ చూపలేదు. కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలలో గవర్నమెంటుకు కొంత చేర్చి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంతో చేసిన సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం మంచినీటిని సరఫరా చేయలేకపోవడం దురదృష్టకరం.

చర్యలు తీసుకోలేరా?

భారత ప్రభుత్వం నీటి పరిరక్షణకు 'నీటి కాలుష్య నివారణ అండ్ నియంత్రణ చట్టం-1974' తీసుకువచ్చింది. చట్టంలోని సెక్షన్-3 ప్రకారం సెంట్రల్ బోర్డ్ కు, సెక్షన్ 4 ప్రకారం స్టేట్ బోర్డ్‌లకు అధికారాలను ఇవ్వడం జరిగింది. సెక్షన్ 3(3) ప్రకారంగా నీటి కాలుష్యానికి పాల్పడిన వ్యక్తి మీద గానీ, సంస్థల మీద గానీ చర్యలు తీసుకునే అధికారం ఉన్నది. సెక్షన్ 20 లోని సబ్ సెక్షన్ 2 మరియు 3 కింద కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను పాటించడంలో విఫలమైన వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించి నీటి కాలుష్యం నియంత్రణ, నివారణకు తోడ్పడవచ్చును.

కానీ, గోదావరి నదిలో, సుందిళ్ల బ్యారేజీ మంచినీళ్లలో కలుస్తున్న డ్రైనేజీ నీళ్లను, పరిశ్రమల వ్యర్థాల నీళ్లను నిరోధించడానికి చేసిన కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. గోదావరి నది నీళ్లను పరిరక్షించడానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, రామగుండం మండల ప్రజా పరిషత్, పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, భారత పార్లమెంటులో కూడా కనీస చర్చ కూడా జరగలేదు. నది నీటి కాలుష్యంపై చట్ట సభలు మౌనంగా ఉండటం ప్రజాస్వామిక విధానానికి వ్యతిరేక మవుతుంది. కాబట్టి ప్రజలు చట్ట సభలను ప్రశ్నించక ముందే మేల్కొని గోదావరి నది నీటి కాలుష్యాన్ని నివారించాలని కోరుకుంటున్నారు.

మేరుగు రాజయ్య

కేంద్ర కార్యదర్శి, సింగరేణి ఏఐటీయూసీ

94414 40791

Advertisement

Next Story

Most Viewed