రాజ్యాంగాన్ని మోసం చేసేది.. రాజకీయ నాయకులే..!

by Ravi |   ( Updated:2024-11-29 00:45:40.0  )
రాజ్యాంగాన్ని మోసం చేసేది.. రాజకీయ నాయకులే..!
X

హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారు హిందూ మతం కింద ఇవ్వబడే రిజర్వేషన్లు తీసుకోవడానికి అర్హత లేదని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని విషయాలను దేశ ప్రజలు విస్తృతంగా చర్చించాలి. ఇదే సందర్భంలో మతం మార్చుకొని, తాను పూర్వ మతంలోనే ఉన్నట్లు చెప్పడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించడం కూడా ఆలోచనాత్మకమే. బాప్టిజం తీసుకొని హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారినప్పుడు, హిందూ మతం కింద ఉండే కులం గుర్తింపు కూడా పోతుందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దళిత ముసుగు వేసుకొని, అంతర్జాతీయ క్రైస్తవ సంస్థల ఏజెంట్లుగా పనిచేస్తూ, ఈ దేశాన్ని క్రైస్తవీకరించాలని ప్రయత్నించే భారతీయులకు ఇబ్బంది కలిగించే విషయమే. క్రైస్తవ మతంలో కొనసాగే వారందరూ కూడా జనాభా లెక్కల్లో హిందూ మతస్తులుగానే నమోదు అవుతున్నారు. చట్టం ప్రకారం వారంతా కూడా హిందూ సమాజంలో భాగంగానే పరిగణించబడుతున్నారు.

తమిళనాడుకు చెందిన క్రిస్టియన్ యువతి' సెల్వ రాణి' తాను ఎస్సీ వర్గానికి చెందిన యువతినని తనకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయాలని మద్రాసు హైకోర్టును కోరినప్పుడు మద్రాస్ హైకోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించడంతో, ఈ విషయంపై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లడం, సుప్రీంకోర్టులో ఈ కేసును విచారణ చేసిన జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మతం మారిన వారికి హిందూ మతం కింద ఇవ్వబడుతున్న ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని చెప్పడం జరిగింది. ఈ విషయం పైన గతంలో అనేక రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేశాయి. కానీ ఈ దేశంలో కుట్రపూరితమైన పరిపాలన విధానాలు, హిందూ సమాజాన్ని బలహీనపరిచే ఆలోచనలు, హిందువులను సామూహికంగా మతం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నందున కోర్టు నిర్ణయాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది.

సగం పాపం హిందూ మఠాధిపతులదీ...!

ఈ ఉదంతానికంతా కర్త, కర్మ, క్రియ స్వార్థపరులైన హిందూ వ్యతిరేక హిందూ రాజకీయ నాయకులు కారణమని చెబితే సత్యాన్ని వెల్లడించినట్లే! మతం మారితే రిజర్వేషన్లు వర్తించవనే విషయం రాజ్యాంగంలో స్పష్టం గా లిఖించబడింది. స్వాతంత్రానంతరం ఈ దేశ పరిపాలన పగ్గాలన్నీ అగ్రవర్ణ హిందూ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయినేది వాస్తవం కాదా? గ్రామాలకు గ్రామాలు క్రైస్తవీకరించబడుతూ ఉంటే హిందూ రాజకీ య నాయకులకు ఈ పర్యావసానం తెలియదా? ఈ తప్పిదంలో హిందూ రాజకీయ నాయకుల పాపం సగమైతే, హిందూ సమాజానికి తాము ప్రతినిధులమని, తాము గొప్ప ఆధ్యాత్మిక సంపన్నులమని చెప్పుకునే హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలకు మిగతా సగం పాపం అంటగట్టాల్సిందే!

మతం మారుతుంటే ప్రేక్షక పాత్ర!

హిందూ రాజకీయ నాయకుల్లో కొంతమంది వామ పక్షాల నేతలను మినహాయిస్తే, మిగతా వారందరూ దేవు డు ఉన్నారని నమ్ముతారు. వీరందరి పాపాలకు గాను దేవుడు శిక్షలు వేస్తాడు అనేది మాత్రం ఖాయం. ఇదే సమయంలో ఈ దేశంలో పీఠాధిపతులు హిందు వులు మతం మారుతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ, హిందూ మతానికి జరిగే అన్యాయాల పైన నోరు ఎత్తకపోవడం, అదే సమయంలో నిమ్న వర్గాల ప్రజల కష్టాలు, నష్టాలు, అవమానాలు, వివక్షలపై ఆధ్యాత్మిక కోణంలో ప్రతి స్పందించకపోవడం పాప ప్రవర్తన కిందికే వస్తుంది. ఈ విషయంలో కొంతమంది స్వామీజీలు, పీఠాధిపతులు సానుకూల ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు లభించడం లేదు. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుంది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ విషయంలో భారతీయ ఇస్లామిక్ సమాజమే కాకుండా, ప్రపంచ దేశాలలోని ఇస్లాం సమాజమంతా ఆమె వ్యాఖ్యలపై నిరసన తెలియజేసింది. హిందూ దేవీ దేవతలను నగ్నంగా గీసి, తన పైశాచిక ఆనందాన్ని వెలిబుచ్చిన ఎం.ఎఫ్ హుస్సేన్ విషయంలో మన దేశంలోని స్వామీజీల, పీఠాధిపతుల, మతా చార్యుల డొల్లతనం ఈ దేశంలోని హిందువులకు స్పష్టంగా తెలిసింది. సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులంతా డెంగ్యూ, మలేరియా లాంటి రోగకారక జీవులని తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ చెప్పిన మాటలు ప్రజలకు గుర్తే ఉంటాయి! ఈ విషయంలో మన దేశంలోని స్వామీజీల, పీఠాధిపతుల మతాచార్యుల ప్రతిస్పందన ఏమిటి?

సుప్రీం తీర్పు.. దళితులకే నష్టం!

ఇక మతం మార్చుకుంటే రిజర్వేషన్లకు అర్హులు కాదు అని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వల్ల నష్టపోయేది ఈ దేశంలోని సామాన్య ప్రజలే. అందులో ముఖ్యంగా నిమ్న వర్గాలకు సంబంధించిన దళిత జనమే. అనాదిగా ఈ దేశంలో వారు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. పైగా మతం మారినంత మాత్రాన వారు వివక్ష నుండి బయట పడతారనే భ్రమల గురించి వివరించే ప్రయత్నం చేయడం అత్యంత అవసరం. పైగా చట్టాల ద్వారా వివక్ష తొలగిపోతుందని, మతం మారితే వివక్ష పోతుందని, వాదించే వారి సంఖ్య ఈ దేశంలో చాలానే ఉంది. సాటి మనిషిని మనిషిగా చూడాలంటే అది చట్టం ద్వారా సాధ్యం కాదు. ఇదంతా మానసిక పరివర్తన ద్వారానే జరగాలి. ఈ ప్రయత్నానికి ఈ దేశంలోని స్వామీజీలు, పీఠాధిపతులు, మతాచార్యులు తమ తమ భేషజాలను, ఇగోలను పక్కనపెట్టి ఆధ్యాత్మిక పరివర్తనతో ముందుకు రావాలి. అదే సమయంలో దళిత ముసుగు వేసుకొని, విదేశీ క్రైస్తవ సంస్థల ఏజెంటుగా కొనసాగే వ్యక్తుల మోసపూరిత కుట్రలను ఎక్కడికక్కడ బయట పెట్టాలి. రిజర్వేషన్లు ఇస్తేనే పైకి వస్తారు అనే భ్రమల నుండి ఈ దేశ ప్రజలు బయటపడాలి. కష్టపడి పైకి రావాలి అనే భావాన్ని ఈ దేశ ప్రజలకు నూరిపోయకుండా ఎటువంటి ప్రయత్నం చేసినా, ఫలితాలు ఆశించిన రీతిలో ఉండవనేది అక్షర సత్యం.

- ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Advertisement

Next Story

Most Viewed