ఈ రంగాలు సఖ్యతగా ఉండాలి!

by Ravi |   ( Updated:2024-12-19 01:00:35.0  )
ఈ రంగాలు సఖ్యతగా ఉండాలి!
X

సమాజంలో రాజకీయ రంగం, సినిమా రంగం ఈ రెండు వ్యవస్థలు ప్రజలపై మంచైనా, చెడైనా చాలా బలమైన ప్రభావాన్ని సమాజంపై వేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ రెండు రంగాలు ఒకే బంతిలో సహపంక్తి భోజనం చేసినంతసేపు అందరికీ ప్రశాంతతే. అది లేనప్పుడే అసలు చిక్కంతా.. ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు గానీ, సినీ రంగంలో ఉన్న ప్రముఖులు గానీ వారి ప్రమేయం ద్వారా జటిలమయ్యే సమస్యల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే తలెత్తే వైరుధ్యాలు వ్యవస్థలకు హితకరం కాదు.

సినిమా నటులనే కాదు... సెలబ్రెటీల విషయంలో ఏది జరిగినా మీడియా ద్వారా జరిగే చర్చ మామూలుగా ఉండదనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వాలు, సినీ ప్రముఖుల మధ్య ఒక చిన్న ఇష్యూ జరిగినా దాని ప్రభావం ఈ రెండు రంగాలపై ఎంత ఉంటుందో గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించడానికి కారణం అప్పట్లో నాటి ముఖ్యమంత్రి ఒక సందర్భంలో ఆయనను అవమానించే విధంగా మాట్లాడటమే.. అదే పార్టీ ఆవిర్భావానికి అసలు కారణమైందనే విషయం మరిచిపోలేం.

పుష్ప లేపిన చర్చ

అల్లు అర్జున్ అరెస్ట్‌కు కారణమైన దురదృష్టకర సంఘటన బాధాకరమైనది. సినిమా చూడడానికి వచ్చి తొక్కిసలాటలో రేవతి అనే గృహిణి మృతి చెందడం, ఆమె కుమారుడు ఇంకా చావుబతుకుల మధ్య ఉండటం విషాదకరం. దీనికి కారణం థియేటర్ యాజమాన్యంతో పాటు నిర్వాహకులు, చిత్ర యూనిట్, హీరో బాధ్యులని పోలీసులు ప్రకటించారు. అయితే వీరితో పాటు రక్షణ కల్పించాల్సిన పోలీస్ యంత్రాంగానిది కూడా బాధ్యతే. చట్టప్రకారం ఎవరైతే సంఘటనకు బాధ్యులుగా ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం చట్టం తాను చేసే పనే. కానీ ఈ ఎపిసోడ్‌లో అనేక అంశాలు ప్రజాబాహుళ్యంలోకి చర్చకు వచ్చాయి.. థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనపై హీరోతో సహ చిత్ర యూనిట్, యాజమాన్యం సరైన రీతిలో సకాలంలో స్పందించకపోవడం, సక్సెస్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పలకడంలో అల్లు అర్జున్ తడబాటు, అరెస్ట్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు, సినీరంగం తనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే ఒక రకంగా లేకుంటే అంటీముట్ట నట్టుగా వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, ప్రభుత్వాధినేతలు తమకు అనుకూలంగా హీరోలుంటే ఒక రకంగా లేకుంటే మరోరకంగా ‘ట్రీట్’ చేస్తున్న విధానాలు అన్ని ఇప్పుడు మరింతగా చర్చనీయాంశంగా మారిపోయాయి.

సినీరంగం వైఖరి ఇలాగుంటే ఎలా?

మన దేశంలో సినీ హీరోలు, కొంతమంది అగ్ర నటీ నటులు వారికొస్తున్న స్టార్ డమ్‌తో సమాజానికి అతీతమైన వ్యక్తులుగా, శక్తులుగా ఊహించుకోవడం కూడా కొన్ని విపరీత పరిణామాలకు దారితీస్తోంది. వ్యక్తిగత ఆపేక్షతో తమకు అనుకూలమైన ప్రభుత్వాలకు ఏక పక్షంగా ఉండటం, తమకు అనుకూలంగా పాలకులు లేకపోతే ఏహ్యభావంతో ఉండటం గత నాలుగు దశాబ్దాల కాలంలో చూస్తూవస్తున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్ జగన్ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు అంతర్గతంగా జరిగిన ఘర్షణ కూడా మనం మర్చిపోలేం. ఇపుడు పుష్ప-2 తొక్కిసలాట సంఘటనను పక్కకు పెడితే.. రేవంత్ సర్కార్‌తో కూడా తెలుగు సినీ పరిశ్రమ సంబంధాలు అంత మెరుగ్గా లేవనేది జగమెరిగిన సత్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో బలమైన సంబంధాలతో హంగామా చేసిన హీరోలు, పరిశ్రమ పెద్దలు ఇపుడు ఎక్కడా కానరావడం లేదు. ప్రస్తుతం ఈ రెండు రంగాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం సినిమాల టికెట్ల పెంపు విషయంలో తప్ప ఎక్కడ సఖ్యత కనబడటం లేదు. మనకిష్టమున్నా లేకపోయినా వ్యవస్థల్లో కీలకంగా ఉన్నపుడు సందర్భం వచ్చినపుడు ఆయా ప్రభుత్వాలు గానీ, ప్రభుత్వ పెద్దలను గానీ గౌరవించడం మంచి సంప్రదాయం. కానీ సినీరంగ పెద్దలు, హీరోలు ఇక్కడ తడబడుతున్నారు. ఆ ఫోబియో నుండి వచ్చిందే ఒక పంక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు పలకడంలో అల్లు అర్జున్ తటబాటు కావచ్చు. ఆ సంఘటన కూడా అతనిని అర్జెంట్‌గా అరెస్ట్ చేయడానికి ఒక కారణమైందనే ప్రచారమో, వాస్తవమో మొత్తానికి సమాజంలో చర్చకు దారితీసింది. మోహన్ బాబు కుటుంబ వ్యవహారం కూడా ఒక రకంగా ప్రభుత్వానికి చికాకు తెప్పించింది. కుటుంబ వ్యవహారం ఆఖరికి మీడియాపై దాడి, శాంతిభద్రతల సమస్యగా మారింది.

ప్రభుత్వ పెద్దల తీరు కాస్త మారాలి

సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే సినీరంగం పట్ల ప్రభుత్వ పెద్దల వైఖరి కూడా వివాదాస్పదం అవుతోంది. పెద్దన్న పాత్రలో ఉన్న ప్రభుత్వాధినేతలు జఠిలమైన సమ స్యల పట్ల ఆచితూచి వ్యవహరించమే కాదు, సంయమనం తో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశ స్వాతంత్ర్య సాధనకు దోహదమైన రంగాల్లో కళారంగం అనిర్వచనీయమైన పాత్ర పోషించింది. అనాటి కళారంగం మరో రూపంలో సినీరంగంగా మారింది. సమాజాన్ని చైతన్యవంతం చేసిన సినిమాలు, కళాకారులు ఉన్నారు. సినీరంగం వ్యాపార రంగమే కాదు కళాత్మక రంగం. సాంస్కృతిక జీవనంలో ఒక భాగం. ఈనాడు కొన్ని లక్షల మందికి ఈ సినీరంగం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. దీనిమీద ఆధారపడి ఒక్క హీరోనే కాదు సంపాదించేది.. కొన్ని వందల కుటుం బాలు డబ్బులు సంపాదించుకుంటాయి. అలాంటి సినీ రంగాన్ని కించపరిచేలా మాట్లాడకూడదు. ప్రభుత్వాధినేతగా చట్టప్రకారం చర్యలు తీసుకొనేలా చేయడం మంచి పరిణామమే. కానీ విమర్శకులకు, అనుమానాలకు తావు లేకుండా చేయడమే అధినేతల కర్తవ్యం. తెలుగు రాష్ట్రాల లో ప్రభుత్వాలు, సినీరంగం సఖ్యతగా ఉన్నంతసేపు సహపంక్తి భోజనం మాదిరిగా అందంగా కనిపిస్తోంది. తేడా వచ్చినపుడు సహపంక్తి కాస్త సమాజంలో అనేక చర్చలకు తావిస్తుంది.. అయా వర్గాల్లో చిచ్చు రేపుతుంది. అటు ప్రభుత్వం, ఇటు సినీరంగం కాస్త సంయమనంతో వ్యవహరిస్తే బాగుంటుంది జనాభిప్రాయం.

-అడపా దుర్గ

సీనియర్ జర్నలిస్ట్

90007 25566

Advertisement

Next Story

Most Viewed