- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనికరించండి చాలు..! క్రమబద్ధీకరణకై జేపీఎస్‌ల వేడుకోలు
హోప్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఫియర్ అని అంటుంటారు. నిజమే.. భయం కంటే ఆశ గొప్పది. ఏదో ఒకరోజు మంచి జరుగుతుందన్న ఆశ ఉంటే, ఆ మంచి జరిగినా జరగకపోయినా ప్రయత్నం మాత్రం ఆపాలని అనిపించదు. ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. పెద్ద చదువులు చదివినప్పటికీ ప్రభుత్వోద్యోగం మీద ప్రేమతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, బాధలను పంటి కింద అణిచిపెట్టుకొని, భయాన్ని పైకి కనపడనీయకుండా, బాధ్యతలను నిర్వర్తించడంలో వాళ్లు ఎల్లప్పుడూ ముందున్నారు. చాలీచాలని జీతంతో సమయానికి తిన్నా తినకపోయినా సామర్థ్యానికి మించిన పనులన్నింటినీ నాలుగేళ్లపాటు నిరాటంకంగా చేసుకుంటూ వచ్చారు. వాళ్లు చేసిన పనిని వారి పై అధికారులు, ప్రభుత్వం గుర్తించిందో లేదో కానీ, వారి కారణంగా అద్భుతంగా అభివృద్ధి చెందిన గ్రామాలు మాత్రం గుర్తుపెట్టుకుంటాయనే ఆశ వారికి ఉంది. కానీ గత నాలుగు రోజులుగా వారు చేస్తున్న నిరవధిక సమ్మెను మాత్రం ఇంకా ఎవరూ గుర్తించినట్లు అనిపించడం లేదు. ఈ క్రమంలో వారు చేసిన సేవలను, పడిన కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం మనకు ఉంది.
డిగ్రీ అర్హత పెట్టి, నెగెటివ్ మార్కులతో నిర్వహించిన పోటీ పరీక్షలో విజయం సాధించి 2019 ఏప్రిల్ 12న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌లు) విధుల్లో చేరారు. అపాయింట్‌మెంట్ అందుకున్న అరగంటకే అరడజను పనులను వారికి ముట్టజెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే టార్గెట్‌ను వారికి అందించారు. 'కొత్త జీతగాడు పొద్దు ఎరుగడు' అన్న చందంగా ఉరిమే ఉత్సాహంతో జేపీఎస్‌లు కష్టపడి పనిచేసి, దాదాపుగా వారి టార్గెట్‌ను జులై వరకు పూర్తి చేయగలిగారు. కేవలం మరుగుదొడ్లు కట్టించడమే కాదు, ఆ మరుగుదొడ్లను ఉపయోగించేలా అన్ని రకాల ఉపాయాలను ప్రయోగించడం ఇక్కడ గొప్ప విషయం. గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చి, ఆగస్ట్ నెలలో స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులను సాధించగలిగారు. ఇది వారు సాధించిన విజయాల్లో ఒక తునక మాత్రమే.
ఉపాధి హామీ వారధులు..
ఉపాధి హామీ పనుల్లో వారు చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పనికి వచ్చే కూలీలు ఉదయం పదకొండు వరకు పనిచేస్తే, జేపీఎస్‌లు మాత్రం నడి ఎండలో, భుజానికి బ్యాగ్ తగిలించుకొని, చెమటలు కక్కుతూ వివిధ పని ప్రాంతాలు తిరుగుతూ హాజరు వేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేసేవారు. ఎలాంటి ట్రైనింగ్ లేకపోయినా, వారు చదివిన చదువుతో, వారి తెలివితో ఉపాధి హామీ పనుల్లో ఎదురయ్యే సమస్యలను అలవోకగా పరిష్కరించారు. జాబ్ కార్డ్ లేని వాళ్లకు కార్డ్ ఇప్పించడం, డబ్బులు ఆగిపోయిన వాళ్లకు ఇప్పించడం లాంటి చిన్న చిన్న సమస్యలను తీర్చేశారు. ఇక పని ప్రాంతంలో జరిగే గొడవల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒకానొక సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు సమ్మెకు దిగితే, అన్ని బాధ్యతలను వీరే మోసి, పనులకు అంతరాయం కలగకుండా చూసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పల్లెలు పట్టుగొమ్మలు అని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ పల్లెలు పట్టుగొమ్మలుగా మారడంలో పల్లెప్రగతి కార్యక్రమం ప్రధాన పాత్ర పోషించిందన్నది తెలిసిన విషయమే. అయితే పల్లెప్రగతి కార్యక్రమాన్ని 5 విడతల్లో అత్యద్భుతంగా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పంచాయతీ సెక్రటరీ పనిని ఈ సందర్భంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్‌ల నిర్మాణం కోసం పెద్ద పెద్ద గొడవల్లో ఇరుక్కున్న జేపీఎస్‌లు చాలా మంది ఉన్నారు. కొందరు జేపీఎస్‌లు తమ తెలివితేటలతో భూమిని విరాళంగా కూడా పొందగలిగినప్పటికీ తర్వాత సమస్యలు ఎదుర్కొని మానసిక క్షోభ అనుభవించారు. పల్లెప్రగతి జరుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు, మీటింగ్‌లు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో, అందరినీ ఏకతాటిపై తీసుకురావడంలో వీళ్లు పడిన కష్టం అంతా ఇంతా కాదు.
లాక్‌డౌన్‌లోనూ పని అపలేదు..
2020 మార్చిలో కరోనా మహమ్మారి ప్రపంచ స్థితిగతులను మార్చి వేసింది. కానీ పంచాయతీ కార్యదర్శుల జీవితాలను మాత్రం ఏ రకంగానూ మార్చలేకపోయింది. కఠిన లాక్‌డౌన్‌లోనూ వాళ్లు గ్రామానికి వచ్చి తమ ప్రాణాలను పనంగా పెట్టి, పీపీఈ కిట్లు ధరించి మరీ సేవలు చేశారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, మెడిసిన్ అందివ్వడం, ఫీవర్ సర్వేలు చేయడం, కరోనా సోకిన వారిని ఐసోలేట్ చేయడం, లాక్‌డౌన్ నియమాలను అతిక్రమించకుండా చూసుకోవడం లాంటి ప్రమాదకర పనులను కూడా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా చేశారు. ఇంట్లో వాళ్లు పోరుపెట్టినా సరే, మానవసేవే మాధవసేవ అన్నట్లుగా పనిచేశారు.
2021 జులై నాటికి జేపీఎస్‌ల మూడేళ్ల ప్రొబేషన్ కాలం ముగిసింది. అయితే ఆ మూడేళ్ల పాటు వారు తీసుకున్న జీతం నెలకు రూ. 15వేలు మాత్రమే. మూడేళ్లు పూర్తయింది కదా ఇక రెగ్యులరైజ్ అవుతాం, మన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశ పడే లోపే, ప్రొబేషన్‌ను మరో సంవత్సరానికి పెంచేశారు. అయితే ఇక్కడ జీతాన్ని రూ. 28,719 చేయడం కొసమెరుపు. సరేలే.. 'సమ్‌థింగ్ ఈజ్ బెటర్ థాన్ నథింగ్' అనుకొని వాళ్ల రోజువారీ పనులను మరింత ఉత్సాహంతో చేయడం మొదలుపెట్టారే, తప్ప మరో సంవత్సరం ఎందుకు పెంచారని ఎదురు తిరగలేదు. కానీ పెరిగిన జీతంతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. అయినప్పటికీ వాళ్లు వెనక్కి తగ్గకుండా పనిచేసి, గ్రామంలో పంచాయతీ సెక్రటరీ లేకపోతే ఏ పనీ జరగదు అనే స్థాయికి ఎదిగారు. మరి ఇప్పుడు సమ్మె ఎందుకు చేస్తున్నారు?
దయచేసి రెగ్యులరైజ్ చేయండి..
ఇంత కష్టపడి పనిచేసిన జేపీఎస్‌ల కష్టాన్ని నోటి మాటగా గుర్తించి, శాలువలు కప్పి సత్కరిస్తే సరిపోదు కదా వాళ్లు కూడా మనుషులే. వారికి అదనంగా పెంచిన నాలుగో సంవత్సర ప్రొబేషన్ కూడా గత నెలలో పూర్తయింది. ఇక ఇప్పటికైనా తమను క్రమబద్ధీకరించి, వాళ్లకు రావాల్సిన బెనిఫిట్‌లను కల్పించాలని వారు కోరుతున్నారు. నాలుగేళ్లు వాళ్లు కష్టపడి గ్రామాల్లో తీసుకువచ్చిన గుణాత్మక మార్పును దృష్టిలో పెట్టుకొని వారి రెగ్యులరైజేషన్ విషయంలో జాప్యం చేయవద్దని కోరుకుంటున్నారు. అలాగే తమ విధి నిర్వహణలో భాగంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన తమ జేపీఎస్ మిత్రుల కుటుంబాలకు న్యాయం, పరిహారం, కారుణ్య నియామకం లాంటి సదుపాయాలు కల్పించాలని, గ్రామాలను కళ్లలో పెట్టుకొని చూసుకున్న తమ కళ్ల వెంట కన్నీరు రాకుండా చేయాలని వేడుకుంటున్నారు.
ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా మండల స్థాయిలో టెంట్లు వేసుకొని, ఎండలో కష్టపడుతున్నారు. కష్టం వాళ్లకు కొత్తేమీ కాదు, కానీ జాప్యాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అన్యమార్గాలను ఆశ్రయించకుండా, శాంతియుతంగా సమ్మె చేస్తూ, మాకు ప్రభుత్వ ప్రకటన మాత్రం చాలు అని ప్రాధేయపడుతున్నారు. ఒక ప్రాణ స్నేహితుడిగా గ్రామాలను దగ్గరుండి చూసుకున్న వారి శ్రమను, ప్రేమను గుర్తించకుండా వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదు. అందుకే వారు కోరుకున్నట్లుగా ఏదో ఒకరోజు వారి ఆశ గెలవాలని, ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుకుందాం.
(పంచాయితీ సెక్రటరీల సమ్మె సందర్భంగా)
- ప్రగత్ దోమల, మాజీ జేపీఎస్, 6300105472