విలీనం వెనక వీరులెందరో

by Ravi |   ( Updated:2022-09-17 02:30:48.0  )
విలీనం వెనక వీరులెందరో
X

నిజాం సైన్యం ఆగడాలు ఆగలేదు. ప్రజలలో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఎదురు తిరిగారు. ఉద్యమం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. పటేల్‌ 'ఆపరేషన్ పోలో'కు ఆదేశించారు. జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం విజయవాడ, బీదర్, నాగ్‌పూర్, జాల్నా నుంచి ముట్టడికి ముందుకు సాగింది. చివరకు సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు నిర్ణయాన్ని ప్రకటించాడు. జేఎన్ చౌదరి, గవర్నర్‌గా, ఎంకే వెల్లోడి సీఎంగా నియమితులయ్యారు. 1956 అక్టోబర్ 31 వరకు నిజాం రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు.

స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. అవి ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం బ్రిటిష్ పాలకులు సదరు రాజులకే ఇచ్చారు. ఫలితంగా కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు ఇండియాలో కలవలేదు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి జునాగఢ్‌ను భారత్‌లో కలిసేలా చేశారు.

నిజాం మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. రజాకారుల సేనను తయారు చేసిన ఖాసిం రజ్వీ మారణకాండకు తెగబడ్డాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 13 నెలలపాటు తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు.

అనేక అరాచకాలు

సుదీర్ఘ పోరాటాలు, మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా, తెలంగాణ స్వతంత్రం కావడానికి మరో యేడాది పట్టింది. 1724 నుంచి 1948 వరకు 224 యేండ్లు ఎనిమిది తెలంగాణ జిల్లాలు, ఐదు మరఠ్వాడా జిల్లాలు, మూడు కన్నడ జిల్లాలతో కలిపి పదహారు జిల్లాల హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషలతో కొనసాగింది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలన చివరి అంకంలో రజాకారులు దురాగతాలకు దిగారు. ఉద్యమకారులను అమానుష చిత్రహింసలకు గురిచేశారు. 90 రకాల పన్నులను విధించారు. ప్రజలను బానిసలుగా చూశారు. వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేశారు. ఎదిరిస్తే కాల్చి చంపారు. బలవంతంగా మత మార్పిడులు చేశారు.

స్వామీ రామానంద తీర్థ నాయకత్వంలో ఆర్యసమాజ్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరు కొనసాగాయి. కవులు, రచయితలు నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచారు. రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వర్‌రావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, దాశరథి, షోయబుల్లాఖాన్, అనభేరి ప్రభాకర్‌రావు, జమలాపురం కేశవరావు, లక్ష్మీనర్సయ్య, బద్ధం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, దొడ్డి కొమురయ్య, కోదాడ నారాయణరావు, బెల్లం నాగయ్య, సింగిరెడ్డి భూపతిరెడ్డి, రాంజీ గోండు, కొమురం భీమ్, రఘునాధరావు కాచే, అలుగు వీరమ్మ, కిషన్ మోదాని, లక్క కిష్టయ్య, బత్తిని మొగిలయ్య, కాటం లక్ష్మీనారాయణ, మర్రి చెన్నారెడ్డి, వందేమాతరం రాంచందర్‌రావు , కర్నె వెంకట కేశవులు ఇలా ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు.

నిజాం మీద బాంబు దాడి

నారాయణరావు పవార్ శంషాబాద్ గంగారామ్‌తో కలిసి ఏకంగా నిజాంపైనే బాంబులు విసిరి సంచలనం సృష్టించారు. దాశరథి కారాగారం గోడల మీద నిజాం వ్యతిరేక కవితలు రాశారు. కాళోజీ, సుద్దాల హనుమంతు, యాదగిరి లక్ష్మీనారాయణ లాంటివారు జన బాహుళ్య కవితలల్లారు. ఇలా నిజాం వ్యతిరేక పోరాటాలు వివిధ రూపాలలో ఉధృతం అయిన వేళ భారత ప్రభుత్వానికీ, నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. విలీనానికి నిజాం అంగీకరించలేదు. రజాకారుల ఆగడాలు మితిమీరిపోయాయి. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం సాగుతోంది. 1946-1948 మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదును ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు.

1947 నవంబర్‌ 29న యథాతథ ఒప్పందంపై గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌‌బాటన్‌, నిజాం సంతకాలు చేశారు. హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కేఎం మున్షీ నియమితులయ్యారు. అయినా నిజాం సైన్యం ఆగడాలు ఆగలేదు. ప్రజలలో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఎదురు తిరిగారు. ఉద్యమం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. పటేల్‌ 'ఆపరేషన్ పోలో'కు ఆదేశించారు. జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం విజయవాడ, బీదర్, నాగ్‌పూర్, జాల్నా నుంచి ముట్టడికి ముందుకు సాగింది. చివరకు సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు నిర్ణయాన్ని ప్రకటించాడు. జేఎన్ చౌదరి, గవర్నర్‌గా, ఎంకే వెల్లోడి సీఎంగా నియమితులయ్యారు. 1956 అక్టోబర్ 31 వరకు నిజాం రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు.


రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

Advertisement

Next Story

Most Viewed