- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కఠిన శిక్షలుంటేనే.. కల్తీని అరికట్టగలం!
ఇటీవల నిర్మల్‌లోని ఓ హోటల్‌లో నాన్ వెజ్ తిన్న యువతి ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందింది. హైదరాబాద్‌లో మోమోస్ తిని మరో మహిళ తనువు చాలించింది. కాగజ్ నగర్‌లోని మరో హోటల్‌లో చికెన్ మండి తిన్న పలువురు తీవ్ర కడుపు, తలనొప్పి, వాంతులతో ఆస్పత్రిలో చేరారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయినా వీటిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలతో ఫుడ్ బిజినెస్ చేసే వారి ఇష్టారాజ్యం కొనసాగుతున్నది. వారం, రెండు వారాల పాటు ఆ హోటల్‌ను మూసివేసి.. ఆ తర్వాత మళ్లీ ప్రారంభించుకోవడం కామన్ అయిపోయింది. చేసిన తప్పునకు అనుగుణంగా కఠిన శిక్షలు ఉంటే తప్ప, ఈ ఘటనలు ఆగవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
హోటళ్లు, ఫుట్ పాత్‌లపై నోరూరించే, ఘుమఘుమలాడే వంటకాల వెనక అనేక నాసిరకం ఆహార పదార్థాలు దాగి ఉన్నాయి. వాటి యజమానులు కనీస ప్రమాణాలు పాటించకుండా మాంసాహారాన్ని నిల్వ ఉంచుతున్నారు. వాటికే రంగులద్ది మళ్లీమళ్లీ నూనెలో వేయించి.. వేడివేడిగా పొగలు కక్కిస్తూ వడ్డిస్తున్నారు. పలు చోట్ల రోగాల బారిన పడిన జంతువుల మాంసాన్ని సైతం వినియోగించిన ఘటనలు వెలుగుచూశాయి. నాసిరకం నూనె లు, అనుమతిలేని రంగులు మితిమీరి వాడుతున్నారు.
తీవ్ర అనారోగ్యం బారిన..
కలుషిత ఆహారం కారణంగా ప్రతిరోజూ ఎంతో మంది తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. పరిస్థితి చేయి దాటి ప్రాణాలు కోల్పోతున్న సంద ర్భాలు సైతం ఉన్నాయి. కలుషిత, కల్తీ ఆహారం తినడం వల్ల అతిసారం నుంచి కేన్సర్ల వరకు దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు, నరాలు, ఎముకలు, మూత్రపిండాలు, మెదడు, చర్మ సంబంధిత సమ స్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ఆహార పదా ర్థాల తయారీలో రుచి, రంగు కోసం హానికరమైన రసాయనాలు, రంగులను కలుపుతుండడంతో దేశంలో సుమారు 10కోట్ల మంది వివిధ వ్యాధు లతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
తనిఖీలు నిర్వహిస్తున్నా..
గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందలాది హోటళ్లపై అధికారులు వరుస దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన, బూజుపట్టిన మాంసం, నెలల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, నిషేధిత రంగుల వాడకాన్ని గుర్తించారు. వంటశాలల్లో అపరిశుభ్ర వాతావరణం, చచ్చిన బొద్దింకలు దర్శనమిచ్చాయి. పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంట శాలలు ఉన్నట్లు నిర్ధారించారు. పదుల సంఖ్యలో హోటళ్లపై కేసులు నమోదు చేశారు.
కఠిన శిక్షలు అమలైతేనే ఫలితం!
వంట నూనెల నియంత్రణ చట్టం-1947, నిత్యావసర సరకుల నియంత్రణ చట్టం-1955, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం-1992, వంటివి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. ఆహారం కల్తీ చేయటం, నాసిరకం పదార్థా లు అమ్మటం నేరమని ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 చెబుతున్నది. ఆహార కల్తీ నిరోధక చట్టం-1954 కఠిన శిక్షలను నిర్దేశించింది. ఆహార, పానియాలను కల్తీ చేసి అమ్మేవారికి ఆరు నెలల తప్పనిసరి జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధించాలని పార్లమెంటరీ ప్యానెల్ సైతం ఏడాది క్రితం సిఫారసు చేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ.. కలుషిత ఆహారాన్ని గుర్తిస్తున్నా.. వారికి శిక్షలు మాత్రం పడడం లేదు. జరిమానాలతో బయటికొచ్చి మళ్లీ అదే వ్యాపా రాన్ని కొనసాగిస్తున్నారు.
చట్టంలో సెక్షన్లు ఉన్నప్పటికీ..
ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, నాసిరకం (సబ్ స్టాండర్డ్) ఆహారం అని తేలితే జాయింట్ కలెక్టర్ వద్ద నేరస్తుడిని ప్రవేశపెట్టి జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. సబ్ స్టాండర్డ్ కేసుల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా చెల్లించి నేరస్తులు బయటపడుతున్నారు. కల్తీ ఆహారం అని తేలితే క్రిమినల్ కేసు బుక్ చేయాలి. వారికి గరిష్టంగా రెండేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఒకవేళ కల్తీ ఆహారం తిని ఎవరైనా చనిపోయినట్లు నిరూపించగలిగితే గరిష్టంగా ఏడేండ్ల శిక్ష విధించేందుకు చట్టంలో సెక్షన్లున్నాయి. అయితే, కేసులు నిరూపితమై శిక్షలు పడ్డ ఘటనలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అందుకే పూర్తిస్థాయిలో కఠిన శిక్షలు అమలైతేనే హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్‌లో కల్తీ కాకుండా అరికట్టగలమనే అభి ప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. కల్తీ ఆహారం తిని ఎవరైనా మరణిస్తే వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జీవితఖైదు విధించే అంశాన్నీ ప్రభుత్వాలు పరిశీలించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిస్తాయా?
కల్తీ ఆహారానికి సంబంధించి వరుస ఘటనలు వెలుగుచూస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తున్నది. మోమోస్ తిని మహిళ మృతి చెందిన తర్వాత.. మయోనీస్‌తో ఫుడ్ పాయిజన్ అయినట్లు భావించి.. రాష్ట్ర ప్రభుత్వం మయోనీస్ వినియోగంపై ఏడాదిపాటు నిషేధం విధించింది. అంతేకాకుండా మంత్రి దామోదర రాజనర్సింహ వరుస సమీక్షలు నిర్వహి స్తూ అధికారులకు సూచనలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి కలెక్టరేట్లలోనే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మరిన్ని మొబైల్ టెస్టిం గ్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇచ్చే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. అ యితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. కఠిన చర్యలు లేకుంటే మాత్రం హోటళ్లు, రెస్టా రెంట్ల నిర్వాహకుల్లో మార్పు రాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఫిరోజ్ ఖాన్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464