అనితరసాధ్యుడు ఎన్టీఆర్..

by Sumithra |   ( Updated:2023-05-28 01:41:59.0  )
అనితరసాధ్యుడు ఎన్టీఆర్..
X

ఒక మచ్చలేని ఆదర్శ రాజకీయవేత్తగా కూడా నందమూరి తారకరామారావు సాధించిన విజయాలు తక్కువేమీ కాదు! వాటిలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాను.

1) 1983లో ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఆయన తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ - కేజీ బియ్యం రెండు రూపాయలకే! అనేదాన్ని అమలు పరచారు.

2) 'ఓడిపోయిన రాజకీయులకు పునరావాసాన్ని కలిగించేందుకు మాత్రమే అంతవరకూ ఉపయోగపడుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయడంలో వారు ఎంతో సాహసాన్ని ప్రదర్శించారు.


3) హుసేన్ సాగర్ మధ్య బుద్ధవిగ్రహ ప్రతిష్ఠాపన, తెలుగువారిలో లబ్ధప్రతిష్ఠులైన కొందరు ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పడం వంటి చర్యలద్వారా వారు తెలుగువారి వైభవాన్ని పరోక్షంగా యావత్ప్రపంచానికి కూడా చాటారు.

4) మునసబు-కరణాల వ్యవస్థను రద్దు చేయడమనేది వారు చేపట్టిన మరొక సాహసోపేతమైన నిర్ణయం. అంతే గాక, తాలూకాల స్థానే మండలాలను ప్రవేశపెట్టడం ద్వారా వారు స్థానిక పరిపాలనలో ఎక్కువ వికేంద్రీకరణకు ఆస్కారం కల్పించగలిగారు.

5) తిరుమల-తిరుపతి క్షేత్రాల పవిత్రతను కాపాడడానికి, యాత్రికులకు మరిన్ని సౌకర్యాలను కల్పించడానికి వారెంతో కృషిచేశారు. నిజానికి ఆయన ఏలుబడిలో విఐపీల ప్రత్యేక దర్శనాల వ్యవధి చాలా తగ్గిపోయింది.‌ తిరుపతిని మరొక వాటికన్ సిటీగా తీర్చి దిద్దడం ఆయన కలలలో ఒకటి!


6) స్త్రీలకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరో గొప్ప విషయం. హిందూ వారసత్వపు చట్టాన్ని సవరించి స్త్రీలకు ఆస్తిహక్కు కల్పించడం, మహిళా రిజర్వేషన్లు మొదలైన చర్యల కారణంగా వారు స్త్రీల స్వాభిమానాన్ని, సాధికారతను ఎంతగానో పెంచడం ముదావహం! ఇక, సంప్రదాయాలను గౌరవించడంలోనూ, స్త్రీలను గౌరవించడంలోనూ వారి ప్రత్యేకత వారిదే!

7) ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల ఎంపికకు ఎంసెట్ పద్ధతిని ప్రవేశపెట్టి, అందులో పారదర్శకతను పెంచిన ఘనత వారిదే!

8) విద్యారంగానికి వారు కలుగజేసిన మరొక సౌలభ్యం - విజయవాడలో వైద్య విశ్వవిద్యాలయ స్థాపన. ఆంధ్రప్రదేశ్ లోని వైద్యశాలలను అన్నిటినీ దానికి అనుబంధంగా చేశారు.

9) బడుగు, బలహీనవర్గాలకు వారు చేసిన మేలు - ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను నెలకొల్పడం.


10) తెలుగు పిల్లలు పిన్న వయస్సులోనే మాతృభాషలో మన సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆసక్తితో నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడానికి వారు దృశ్యమాధ్యమంలో ఎన్నో ప్రయోగాలను ప్రవేశపెట్టారు.

11) మహిళల పాలిటి మహమ్మారి అయిన మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించిన ఘనత 'అన్నగారిదే!'

12) పీవీ ప్రధానమంత్రిగా ఎంపికై, నంద్యాలనుండీ పోటీచేయడానికి నామినేషన్ వేసినప్పుడు ‘ఇన్నాళ్ళకి ఒక తెలుగుబిడ్డ ప్రధానమంత్రయ్యాడు. మేము ఆయనకు అడ్డుపడకూడదు‘ అన్న రాజకీయవిజ్ఞతను నందమూరి తారకరామారావు చూపించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే 'రాజకీయాల్లో వారు సాధించిన విజయాలు ఇన్నీ, అన్నీ కావు!' అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలనే తాపత్రయం ఎన్టీ ఆర్ మాటల్లోను, చర్యల్లోను ఎల్లవేళలా ద్యోతకమౌతూనే ఉండేదన్న మాట అతిశయోక్తి కాదు!

మాలిన్యం లేని రాజకీయాధికారం ద్వారా దేశసేవ చేయదలచుకునే దేశభక్తులు నిస్సందేహంగా వారి ఒరవడిని పాటించడం అత్యంతావశ్యకం!

(నేడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా)

డాక్టర్ పద్మ వీరపనేని

ఫౌండర్, రైజ్ (RiSE) ఫౌండేషన్


Also Read: ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం..

Advertisement

Next Story

Most Viewed