- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి సినిమాలు సమాజానికి హానికరం!
వినోద మాధ్యమాల్లో అత్యంత కీలకమైన సినిమాల వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏమిటని ఆలోచిస్తున్నారా? లేక ప్రజలకు సినిమాలు తప్ప వినోదం ఏముంటుందని సీనియర్ నటుడు మోహన్‌బాబులా నిలదీస్తారా? అది మీ ఇష్టం. కానీ, ఒకసారి మీరే ఆలోచించండి.. ఇటీవల మీరు చూసిన లేదా కొత్తగా వస్తున్న సినిమాల్లో కథలు ఎలా ఉంటున్నాయి?
ఆ మధ్య వచ్చిన బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో హీరో మాఫియాను ఓ వ్యాపారంలా మార్చి దేశ రాజకీయాలనే మార్చాలని చూస్తాడు. ఇందుకు గూండాయిజాన్ని వైట్ కాలర్ జాబ్‌లా కలరింగ్ ఇస్తాడు. ఇక సలార్ అనే సినిమాలో హీరో ముద్ర ఉన్న లారీలను ఆపేందుకు కస్టమ్స్ ఆఫీసర్లు, పోలీసులు వణికిపోతారు. కేజీఎఫ్‌లో హీరో కేంద్రప్రభుత్వాన్నే గడగడలాడిస్తాడు. నేరం చేయడంలోనూ స్టైల్ ఉంటుందని యువతలో క్రేజ్ నింపుతాడు. పుష్ప సినిమాల్లో ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేయాలో కొత్త వాళ్లకు క్లాసులు చెప్పినట్టుగానే ఉంటుంది. కొత్తగా వస్తున్న డ్రింకర్ సాయి అనే సినిమా ట్యాగ్ లైన్.. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్. ఇందులో బూతులు మాట్లాడటం.. ఎప్పుడూ తాగుతూ ఉండటం.. అమ్మాయిల వెంటపడటమే యువకుల లక్షణం అన్నట్టుగా చూపించారు. అంతి మంగా అన్ని సినిమాల్లోనూ కష్టపడకుండానే డబ్బు గుట్టలుగా వచ్చి మీద పడిపోవాలి.. హీరో అనుకున్న అమ్మాయి అతడికి దక్కాలి. అందుకు ఏం చేయడానికైనా వెనుకాడొద్దు అన్న ఒకే ఒక సిద్ధాంతం కనిపిస్తుంది. మరి ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం..? సినిమాలతో సమాజంలో పాజివిటివీని పెంచకపోయినా ఫర్వాలేదు కానీ, నెగిటివిటీని పెంచుతుండటమే ప్రస్తుతం వచ్చిన సమస్య.
పన్నులు పెంచితే తప్పేమి..?
సినిమా అంటే వ్యాపారం అవును.. అది ఎవరూ కాదనలేని సత్యం. సినిమాలు తీసేందుకు కోట్లలో ఖర్చు అవుతుంది. దానిని రాబట్టుకునేందుకు ఎన్నోరకాల మ్యాజిక్కులు చేయాల్సి ఉంటుంది. అందు కని నరుక్కోవడాలు.. చంపుకోవడాలతో హింసను మాత్రమే హైలైట్ చేయడం వల్ల సమాజానికి జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కొంతమంది సినిమా పెద్దలు, ముఖ్యంగా మూవీ ఫిలాసఫర్ రామ్ గోపాల్ వర్మ అనేక మాధ్యమాల్లో మాట్లాడుతూ ‘సినిమా నచ్చితే చూడండి.. లేకపోతే మానేయండి. అంతేకానీ, ఇలా తీయవద్దు.. అలా తీయవద్దు. అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. సినిమా అనేది నిర్మాత, దర్శకుడు తయారుచేసిన ప్రొడక్టు. దాని ధర నిర్ణయించే అధికారం వారికే ఉంటుంది తప్ప మరెవరికీ ఉండదు. అందుకే సినిమా టికెట్ ధర రూ.10వేలు పెట్టినా నష్టం లేదు. ఇష్టమున్న వాళ్లే చూస్తారు.’ అని కూడా సెలవిచ్చారు. నిజమే ఆ ఆర్గ్యుమెంట్‌లో వాస్తవం ఉన్నది. మరి సమాజానికి నష్టం కలిగిస్తున్న అనేక వస్తువులపై ప్రభుత్వాలు భారీగా పన్నులు విధి స్తాయి. మరి వయలెన్స్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఎందుకు రెండింతలు, మూడింతల పన్ను విధించవద్దు? అప్పుడు ఆ పన్ను కట్టేందుకు సిద్ధమైనవాళ్లే వయలెన్స్ సినిమాలు తీస్తారు.
చెడు విషయంలోనూ మానవీయ కోణమేనా?
నిజానికి ప్రభుత్వాలు.. సినిమాలను కేవలం వందల కోట్లతో నిర్మించారు అన్న కోణంలోనో.. లేక ఆ పరిశ్రమలో వేలమంది పనిచేస్తున్నారు అన్న మానవీయ కోణంలోనో చూస్తుంటాయి. కానీ, సిగరెట్లు, మద్యం మనుషుల ప్రాణాలు తీస్తాయి కదా.. వాటిపై ఎక్కువగా భారీగా పన్నులు వేసినట్టే వయలెన్స్ సినిమాలకు కూడా దాన్ని వర్తింపజేయాలి. సినిమాలో ఉన్న స్టాండర్డ్స్ ఆధారంగా సెన్సార్ బోర్డు వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చినట్టుగానే ప్రభుత్వం కూడా వయలెన్స్ ఆధారంగా పన్ను శ్లాబులు అమలు చేయాలి. అలా చేయడం వల్ల సినీ పరిశ్రమ మూసివేయాల్సి వస్తుందని వాదనలు వస్తే.. సిగరెట్, మద్యం తయారీ పరిశ్రమలపై సైతం ఆంక్షలు తొలగించాలి. ఎందుకంటే ఆ పరిశ్రమల్లోనూ వేల మంది కార్మి కులు పనిచేస్తుంటారని మరిచిపోవద్దు. సినిమాల ప్రభావంతో నేరాలు పెరగడం.. గ్యాంగ్‌స్టర్ అనిపించుకునేందుకు యువకులు బహిరంగంగా హత్యలు చేయడం.. మారణాయుధాలతో వీడియోలు పోస్టు చేస్తున్న ఘటనలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.
నేరాన్ని ప్రోత్సహించినా.. నేరమే!
భారత రాజ్యాంగం ప్రకారం, నేరం చేయడమే కాదు.. నేరాన్ని ప్రోత్సహించినా నేరంగానే పరిగణిస్తారు. ఆ కోణంలో చూస్తే సినిమాల్లో నేరాలు చేయడాన్ని హీరోయిజంగా చూపించడం ముమ్మా టికీ తప్పే. అలాంటి సినిమాలపై నిషేధం విధించడం చట్టపరిధిలో లేకపోతే.. కనీసం అధిక పన్నులు విధించడం ద్వారా సమాజానికి కొంతైనా మేలు చేయవచ్చు. సిగరెట్, మద్యం ధరలు భారీగా పెంచడం వల్ల కనీసం కొంతమందైనా వాటికి దూరంగా ఉంటారు. అలాగే పన్ను భయంతో సినిమాల్లో కనీసం హింస కంటెంట్ తగ్గించే అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో పాజిటివిటీ పెంచే సినిమాలకు అనేక రిబేట్లు ఇవ్వాలి. దీనివల్ల నిర్మాతల ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉన్నది.
సినిమాల్లో నెగిటివిటీని తగ్గించాల్సిందే!
నిజానికి ఎన్నో సినిమాలు ఫీల్ గుడ్ ఆంబియెన్స్‌తో ఉంటాయి. వాటిని చూసి సినిమా థియేటర్ నుండి బయటికి వచ్చినా మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే, మానసిక పరిశోధనల ప్రకారం మానవులు తాము చేయలేని అతీంద్రియ చర్యలను సినిమాల్లో చూసి మానసికంగా సంతోషపడతాడు. అందుకే ఫాంటసీ, సాధ్యం కాని ఫైటింగ్ సీక్వెన్స్‌లకు ఎప్పు డూ ప్రేక్షకాదరణ ఉంటుంది. అయితే, సినిమాల్లో చూపించే ఘటనలు నిజజీవితంలోనూ చేయాలి అనిపించేంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల యువత నేరాల బాట పట్టే అవకాశం ఉన్నది. సినిమాల ప్రభావంతో రియాలిటీకి, ఫాంటసీకి మధ్య ఉన్న తారతమ్యాన్ని యువత గుర్తించలేకపోతున్నది. కొన్ని సినిమాల్లో హీరో చేసే వయలెన్స్‌కి హీరోయిన్ పడిపోవడం చూపిస్తుంటారు. దాన్ని కొందరు మానసిక పరిపక్వత యువకులు కాపీ కొడుతూ అమ్మాయిల భద్రతకు ప్రశ్నార్థకంగా మారుతున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో సినిమాలు యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సిగ రెట్, మద్యాన్ని తాగడాన్ని అరికట్టినట్టే సిని మాల్లో నెగిటివిటీని తగ్గించేందుకు కూడా ప్రభుత్వాలు చొరవ చూపాలి.
హరీశ్ ఎస్పీ