- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM modi: హంగామా ఫుల్... వరాలు నిల్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ నగరంలో పర్యటన కోసం కోసం అధికారిక ఏర్పాట్లు సహా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ మధ్య కాలంలో ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పర్యటన ఇదే. ప్రధాని మోడీకే కాదు, భారతీయ జనతా పార్టీకి కూడా ఈ పర్యటన అత్యంత కీలకం. మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వాస్తవానికి ఈ రెండు ఎన్నికలకు ఈ పర్యటన ఎంతో ప్రతిష్ఠాత్మకం.2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం.. అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తూ తమకు తిరుగేలేదని చాటిచెప్పుకుంటున్న బీజేపీకి.. దక్షిణాది మాత్రం చిక్కడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కనీవిని ఎరుగని విజయం సాధించినప్పటికీ దక్షిణం నుంచి వచ్చిన మద్దతు మాత్రం అంతంత మాత్రమే. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దక్షిణాదిలో ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. అందుకు దక్షిణాదిలో బీజేపీకి తెలంగాణ ఎంతో కీలకంగా మారింది.ఇక దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభావం చూపలేదు.
తెలంగాణపై ఆశలు
కాకపోతే తెలంగాణ మాత్రం ఆ పార్టీకి కాస్త ఊరటగా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుపొందడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడం, ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం లాంటి పరిణామాలు బీజేపీకి దక్షిణాదిలో తెలంగాణ కొత్త ఊపిరినిస్తున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో పార్టీ ఇప్పటికీ బలంగానే ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో అక్కడ కాలుమోపేలా కనిపించడం లేదు. అలా అని దక్షిణాదిని వదిలేస్తే 130 స్థానాలను పైగా వదులుకున్నట్లే. అందుకే అంతో ఇంతో బలం ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకే వరంగల్ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణం చేతనే ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరంలో 26 కిలోమీటర్ల భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ వంటి వాటికి శంకుస్థాపనకు పూనుకున్నారు. 6,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను స్వయంగా ప్రారంభిస్తున్నారు. ఇత్యాది కారణాల చేత వరంగల్ సభను భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ కేంద్రంగానే దక్షిణాదిలో బీజేపీ ప్రచారం ఉండనున్నట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కర్ణాటక నష్టాన్ని తెలంగాణలో భర్తీ చేసుకోవాలని కమలం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో మార్పులు సభా స్దలి వద్ద నాయకులకు ఆవకాశం కల్పించలేక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనిస్తే క్షేత్రస్థాయిలో సైతం కమలదళం కలకలం ఉందన్నది స్పష్టమవుతోంది.
వివక్షపై ఆత్మావలోకనం ఎక్కడ?
రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన. 6,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతీయ రహదారి విస్తరణ వంటివి అభివృద్ధి కార్యక్రమాలే. కాదనలేం. 'ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం' అన్న చందంగా ఫెడరల్ వ్యవస్దలో కేంద్ర ప్రభుత్వం చేయవలసిన, చేపట్టవలసిన పనులలో ఇవి భాగం మాత్రమే. ఉత్తర దక్షిణ భారతం అంటూ వివక్ష చూపిస్తూనే సమైఖ్య భారతావని అభివృద్ది మా లక్ష్యం అని చాటుకునే బి.జె.పి ఒక్క సారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ప్రత్యేక రాష్ట్ర విభజన హామీలను గాలికి వదిలేసి, జిల్లాకి కేటాయించాల్సిన గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, నవోదయ విద్యాలయాల ఊసును మరచి, పసుపు బోర్డుపై స్పష్టమైన హామీలు ఇవ్వకుండా రామగుండం ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసి పదే పదే చెప్పటం. పాత మూసలోనే మోదీ ప్రసంగం సాగటం ఒక్కింత ఆశ్చర్యకరమే. ఎన్నికల ముందు భారీ ప్రాజెక్టులను రంగంపైకి తేవడం తంతుగా వాటికి శంకుస్థాపన చేయడం ఆ తరువాత నిధుల కేటాయింపులో అలసత్వం చూపటం కేంద్ర ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. వివక్షను పక్కన పెట్టి బేషజాలను విడిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసిన నాడు పాలన సార్థకం అవుతుంది. డబుల్ ఇంజన్ సర్కారుకే డబ్బులు అన్న చందంగా కాకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధి పై దృష్టి పెడితే దేశంలో ఎక్కడైనా విజయాన్ని సాధిస్తుంది బీజేపీ ఆ దిశగా ఆలోచించి పక్షపాత వైఖరితో కాకుండా వివక్ష చూపకుండా ప్రాంతీయ అసమానతలను తొలగించి ఆ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రానున్న మోదీ పర్యటనలో ఈ సారి ఆ మార్పు గోచరించాలి.
వాడవల్లి శ్రీధర్
99898 55445