- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటుకు నోటా.. నోటుకు ఓటా?
ఓటుకు నోటు కేసు గురించి వినని తెలుగువారుండరు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థికి ఓటు వేయడం కోసం టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షల నగదు ఇస్తూ అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 2015లో జరిగిన ఈ ఘటనపై నమోదైన కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవలే నిందితులపై అభియోగాలను నమోదు చేసిన ఏసీబీ కోర్టు త్వరలో సాక్షులను విచారించనుంది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 171(బీ) ప్రకారం ఓటు వేయడం కోసమని ఏ వ్యక్తికైనా డబ్బును, ఇతర వస్తువులను ఆశజూపడం, ఓటు వేస్తానని ఏ వ్యక్తి నుంచైనా డబ్బును, ఇతర వస్తువులను తీసుకోవడం అవినీతి కిందికి వస్తుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 123(1) కూడా ఓటు వేయడానికి నగదును స్వీకరించడం అవినీతేనని స్పష్టం చేస్తోంది. ఓటుకు నోటు కేసులో ఈ రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయలేదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12ను, ఐపీసీలోని సెక్షన్ 120(బీ)ని వాడారు. సెక్షన్ 171(బీ), సెక్షన్ 123(1) రెండూ కూడా గుర్తించదగిన(కాగ్నిజిబుల్) నేరాల పరిధిలోకి రాకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి నాన్‌కాగ్నిజిబుల్ నేరాలలో పోలీసులు నిందితులను వెంటనే అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగించడానికి వీలుండదు.
వారి వాదన నిజమే కదా!
రేవంత్ తదితరులు చేసింది నేరమా? కాదా? అనే విషయంపై తెలుగు రాష్ట్రాలలో చాలాకాలం తీవ్రచర్చ కొనసాగింది. ఓటును కొనడానికి డబ్బు ఎర వేయడం ముమ్మాటికీ తప్పేనని కొందరు అభిప్రాయపడ్డారు. ఓటు కోసం డబ్బులు ఆశజూపడం ఈ దేశంలో కొత్తకాదని, ఆ మాటకొస్తే సర్పంచు నుంచి ఎంపీ వరకు అన్ని పదవులకూ జరిగే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటర్లకు ఇచ్చే తాయిలాలను ఏమంటారని మరికొందరు ప్రశ్నించారు. వారందరి పైనా కేసులు ఎందుకు పెట్టకూడదని వాదించారు. వారి ప్రశ్నలు సమంజసమైనవి, తర్కబద్దమైనవి, న్యాయబద్దమైనవి కూడా. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమన్నది అతిసాధారణంగా జరుగుతున్నది. ఎంపీ ఎన్నికలలో రూ. వంద కోట్ల వరకు ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయి. ఎమ్మెల్యే కావాలంటే కనీసం పది కోట్లయినా పెట్టాల్సిందేనని రాజకీయవర్గాలలో టాక్. సర్పంచ్, కౌన్సిలర్ కావాలన్నా కోటి రూపాయల పైనే ఖర్చు పెడుతున్నారంటే అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
ఓటును కొనడమన్నది పలురూపాలలో జరుగుతున్నది. మద్యం, చీరలు, క్రికెట్ కిట్లు, మొబైళ్లు, టాబ్‌లు, టీవీలు మొదలైనవి పంపిణీ చేయడం వాటిలో ఒకటి. భారీస్థాయిలో విందులు, వినోదాలు ఏర్పాటుచేయడం మరొకటి. నేరుగా నోట్లనే పంపిణీ చేయడం ఇంకొకటి. ఏ రూపంలో ఇచ్చినా ఉద్దేశం మాత్రం ఒకటే. తమ పార్టీకి లేదా తమ అభ్యర్థికి ఓటేయమని ఆశజూపడమే.
ఓట్లను పెద్దయెత్తున రాబట్టడానికి ఈ మధ్య కొత్తగా ఉనికిలోకి వచ్చిన మరోరూపం పథకాలు. స్కీంల రూపంలో ఎన్నికల ముంగిట ఓటర్లను ప్రలోభపెట్టడం. తమ పార్టీ గెలిస్తే ఇంటింటికీ టీవీలు, ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేస్తామని, రుణమాఫీ చేస్తామని, పింఛన్లను పెంచుతామని, రైతుబంధు పేరిట నగదు ఇస్తామని.. ఇలా ఎన్నెన్నో.. అధికార పార్టీలైతే ఎన్నికలకు ముందే వీటిని అమలుచేస్తాయి. ప్రతిపక్షాలైతే హామీలిస్తాయి.
ప్రలోభపెట్టడమూ నేరమే
ఓటుకు నోటు కేసులో రేవంత్ తదితరులు చేసింది నేరమే అయితే, ఓట్లు రాబట్టడానికి ఓటర్లను నగదుతో, బహుమానాలతో, నేరుగా ప్రజల జేబులలో డబ్బులు నింపే సంక్షేమపథకాలతో ప్రలోభపెట్టడం కూడా కచ్చితంగా నేరమే అవుతుంది. ప్రభుత్వాలు పేదరికాన్ని పారదోలే అభివృద్ధి పథకాలపై దృష్టి పెట్టాలి కాని చౌకబారు ప్రజాకర్షక పథకాలపై కాదు. ప్రస్తుతం ఐపీసీ కింద ఇలాంటి నేరాలను నేరుగా విచారించే అధికారం పోలీసులకు లేదు. ఓటు కోసం నోటు ఇవ్వడాన్ని కాగ్నిజిబుల్ నేరంగా పరిగణించి నిందితులను తక్షణం అరెస్టు చేసే అధికారాన్ని పోలీసులకు ఇచ్చేలా ఐపీసీ 171(బీ)ని సవరించాలని 2012లోనే అప్పటి ఎన్నికల కమిషన్ ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. మోడీ అధికారంలోకి వచ్చాక 2018లో సైతం ఈ ఫైలు న్యాయశాఖ నుంచి హోంశాఖకు వచ్చింది. పలు కారణాల రీత్యా ఈ సవరణ చట్టరూపం సంతరించుకోవడంలేదు. ఇప్పటికైనా ఓటు కోసం నోటిచ్చిన వారిని, నోటు ఇస్తేనే ఓటేస్తామన్న వారిని నేరస్తులుగా పరిగణించి శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం భారత శిక్షాస్మృతిని, ఇతర చట్టాలను, అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి. ఈ డిమాండుపై ప్రజలు ఉద్యమించాలి. తమను లంచగొండులుగా, సోమరిపోతులుగా తయారుచేయడానికి పాలకవర్గాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి.
డి. మార్కండేయ
- Tags
- marokonam