- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమ్యూనిస్టులు కనుమరుగేనా!
రాష్ట్రం వచ్చిన ఏడేళ్లలో ఈ దిశగా కూడా వాళ్లు చేసింది ఏమీలేదు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై, అభివృద్ధి పథకాలలో అవినీతిపై గళమెత్తిందీ లేదు. ఈ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న కార్మిక సంఘాలు కూడా నిస్తేజంగానే ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మీడియాకు ప్రెస్‌నోట్లు ఇవ్వడం, అరుదుగా ప్రెస్‌మీట్లు నిర్వహించడం తప్ప చేస్తున్నది ఏమీలేదు. గ్రామ, మండల స్థాయిలో కూడా ఈ పార్టీల శ్రేణులు నిర్వీర్యమయ్యాయనే చెప్పవచ్చు. డజనుకు మించని సంఖ్యలో అప్పడప్పుడు ధర్నాలో, రాస్తారోకోలో నిర్వహించినా జనాలు ఈ పార్టీలను దాదాపుగా మరిచిపోయారని చెప్పవచ్చు.
ఇప్పటికైనా కమ్యూనిస్టు అగ్ర నాయకత్వం మేల్కోవాలి. కనుమరుగవుతున్న పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలి. 'సమస్యలున్నంత కాలం కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయన్న' విశ్వజనీన సూత్రాన్ని నిజం చేయాలి. తమలో ఉన్న పిడివాద, అవకాశవాద అవగాహనలను వదిలించుకోవాలి. చెల్లాచెదురుగా ఉన్న చీలిక పార్టీలనన్నింటినీ ఒక్కటి చేయాలి. పార్లమెంటరీ పంథాను అనుసరించే నక్సలైట్ పార్టీలను సైతం కలుపుకుని ఒకే పార్టీగా ఏర్పడాలి. నాయకత్వ కమిటీలలో యువతీయువకులకు అవకాశమివ్వాలి. గ్రామాలకు, బస్తీలకు తరలాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేయాలి. వారి విశ్వాసం పొందాలి. అప్పుడే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలకు వచ్చే ఎన్నికలలో చోటు దొరుకుతుంది. లేదంటే రష్యా, చైనా విప్లవాల గురించి చదువుకున్నట్లుగా, చరిత్ర పుస్తకాలలోనే ఈ పార్టీలు మిగిలిపోక తప్పదు.
తెలంగాణ అంటేనే బయటి ప్రపంచానికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు గుర్తొస్తారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మేం తెలంగాణ నుంచి వచ్చామని చెప్తే, కాస్త అనుమానపు చూపులు చూడడం చాలా మందికి అనుభవమే. మనది పోరాటగడ్డ అని, జనాలలో తిరుగుబాటు మనస్తత్వం ఉంటుందని భావించడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 1946-51 మధ్య ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేతృత్వంలో కొనసాగిన రైతాంగ సాయుధపోరాటం చరిత్ర పుటలలో నిలిచిపోయింది. వేలాది రైతాంగ గెరిల్లాలు ఆయుధాలు చేబూని 41 వేల చ.కి.మీ. పరిధిలో మూడు వేల గ్రామాలను విముక్తి చేసి ఎర్రరాజ్యాన్ని స్థాపించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన ఈ తిరుగుబాటు ఫలితంగా నైజాం పాలన అంతమైంది. ఆ తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రజాసమస్యలపై పలు ఉద్యమాలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. గ్రామగ్రామాన ఎర్రజెండాలు వెలిసాయి. 1980-2000 మధ్యలో ఇక్కడ నక్సలైట్ల హవా నడిచింది. దాదాపు తెలంగాణ అంతటా విస్తరించి భూస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్లు సాయుధ ఉద్యమం నడిపారు. నక్సలైట్ల ఎన్‌కౌంటర్లు, పోలీసులపై దాడులతో ఈ ప్రాంతం నిత్యం వార్తలలో నిలిచింది. నక్సలైట్ పార్టీల సిద్ధాంతానికి, సీపీఐ-సీపీఐ (ఎం) సిద్ధాంతానికి హస్తిమశకాంతరం ఉన్నా వాళ్లూ కమ్యూనిస్టులే కనుక ఇక్కడ చెప్పాల్సివస్తున్నది. మొత్తంగా చూస్తే, ఇక్కడి పల్లెల్లో, పట్టణాల్లో కమ్యూనిస్టు అన్న పదం తెలియని వాళ్లు కాని, వాళ్ల ఉద్యమాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేనివాళ్లు కాని తటస్థపడడం చాలా అరుదు.
ఏం సాధించారు?
అలాంటి తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల బరిలో సాధించింది మాత్రం అంతంత మాత్రమే. 1951 అక్టోబర్‌లో సాయుధపోరాట విరమణ ప్రకటించాక, సీపీఐ ఎన్నికలలో పాల్గొనాలని నిశ్చయించుకుంది. అప్పటికి హైదరాబాదు రాష్ట్రంలో పార్టీపై నిషేధం ఉంది కనుక ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరున పోటీ చేసింది. 1951-52 మొదటి లోక్‌సభ ఎన్నికలలో ఏడు ఎంపీ సీట్లను, 1952 మార్చి హైదరాబాదు అసెంబ్లీ ఎన్నికలలో 42 ఎమ్మెల్యే స్థానాలను సాధించింది. 1957 లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాలను, అసెంబ్లీ ఎన్నికలలో 22 స్థానాలను ఈ ఫ్రంట్ గెలిచింది. ఇక, 1962 ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీల చరిత్రలోనే అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సీపీఐ ఏడు ఎంపీ సీట్లను, 51 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా రెండు ఎంపీ, 18 అసెంబ్లీ స్థానాలు పొందింది. 1964లో సీపీఐ నుంచి చీలిపోయి సీపీఐ(ఎం) ఏర్పడగా, 1967లో జరిగిన ఎంపీ ఎన్నికలలో ఏ పార్టీ కూడా ఖాతా తెరవలేదు. అసెంబ్లీలో రెండు పార్టీలు చెరో నాలుగు స్థానాలు సాధించాయి. ఇక, అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలూ లోక్‌సభకు ఒకటీ అరా, అసెంబ్లీకి సింగిల్ డిజిట్ స్థానాలనే సాధిస్తూవస్తున్నాయి. ఒక్క 1994లో మాత్రమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని సీపీఐ 13, సీపీఎం 9 స్థానాలను గెలువగలిగాయి. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీల పనితీరుకు సంబంధించి ఇదే ఆల్ టైం బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఎన్నికలలో పాల్గొనే సీపీఐ (ఎంఎల్) గ్రూపులు ఇల్లందు స్థానాన్ని ఐదుసార్లు, సిరిసిల్ల స్థానాన్ని ఒకసారి గెల్చుకున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కమ్యూనిస్టు పార్టీలు మరింత ఢీలాపడ్డాయి. 2014 ఎన్నికలలో చెరొక సీటు గెలిచినా, 2019లో మాత్రం గుండుసున్నాయే మిగిలింది.
చేసిందేమీ లేదు
కమ్యూనిస్టు పార్టీల బలాన్ని ఒక్క ఎన్నికల ఫలితాలతోనే అంచనా వేయలేమని ఎవరైనా వాదించవచ్చు. ప్రజలలో ఉంటూ వివిధ సమస్యలపై ఉద్యమాలు చేయడమే వారి నైజం అనుకున్నా, రాష్ట్రం వచ్చిన ఈ ఏడేళ్లలో ఈ దిశగా కూడా వాళ్లు చేసింది ఏమీలేదు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై, అభివృద్ధి పథకాలలో అవినీతిపై గళమెత్తిందీ లేదు. ఈ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న కార్మిక సంఘాలు కూడా నిస్తేజంగానే ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మీడియాకు ప్రెస్‌నోట్లు ఇవ్వడం, అరుదుగా ప్రెస్‌మీట్లు నిర్వహించడం తప్ప చేస్తున్నది ఏమీలేదు. గ్రామ, మండలస్థాయిలో కూడా ఈ పార్టీల శ్రేణులు నిర్వీర్యమయ్యాయనే చెప్పవచ్చు. డజనుకు మించని సంఖ్యలో అప్పడప్పుడు ధర్నాలో, రాస్తారోకోలో నిర్వహించినా జనాలు ఈ పార్టీలను దాదాపుగా మరిచిపోయారని చెప్పవచ్చు. స్థానిక ఎన్నికలలో ఏ ఉమ్మడి జిల్లాలోనూ ఈ పార్టీల తరఫున ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సింగిల్ డిజిట్ దాటకపోవడమే ఇందుకు ప్రబల సాక్ష్యం. ఒకప్పుడు ఈ పార్టీలకు పెట్టని కోటలుగా ఉన్న నల్లగొండ, ఖమ్మం జిల్లాలు.. పలుమార్లు ఎమ్మెల్యేలను గెలిపించిన హుస్నాబాద్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం వంటి నియోజకవర్గాలలో సైతం ఈ పార్టీల పరిస్థితి దయనీయంగా ఉంది.
కదలిక లేదు
పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా, ఈ రెండు పార్టీల అగ్రనేతల్లో ఇసుమంతైనా కదలిక లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో అనేక కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నా, సీఎం కేసీఆర్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా, దళితబంధు హంగామా నడిపిస్తున్నా, హుజూరాబాద్‌లో రణరంగం మొదలైనా, చివరకు పెట్రోలు-డీజిల్ ధరలు ఘోరంగా పెరుగుతున్నా వీళ్లు సీరియస్‌గా తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రజలను కన్విన్స్ చేయడంలో విఫలమవుతున్నామని పలు సందర్భాల్లో ఈ నాయకులు ఒప్పుకుంటున్నప్పటికీ, ఆచరణలో చేస్తున్నది మాత్రం శూన్యం. ఈ రెండింటిలో ఒక పార్టీకి ఆర్థిక వనరులు కరువైన స్థితిలో ప్రగతిభవన్ మెట్లెక్కారని కూడా మీడియా కోడై కూసింది. మరో పార్టీ అలాంటి పరిస్థితిలో లేకున్నా, రాజకీయంగా ఏమీ చేయలేక సైలెంటయిపోయింది.
దేశమంతా ఇంతే
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఇలాగే ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బెంగాల్‌లో సైతం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఏ ఒక్క పార్టీ కూడా ఖాతా తెరువలేక చతికిలపడ్డాయి. ఒక్క కేరళలోనే పినరయి విజయన్ నేతృత్వం వామపక్ష కూటమిని గట్టెక్కించగలిగింది. జాతీయస్థాయిలో కూడా వామపక్షాల అగ్రనేతలు దాదాపుగా తెలంగాణ నేతల్లాగానే స్తబ్ధుగా ఉండిపోతున్నారు. నెగెటివ్ లెస్సన్‌గా బెంగాల్‌ను, పాజిటివ్ లెస్సన్‌గా కేరళను తీసుకుని అధ్యయనం చేయాలన్న ఆసక్తి, ఉత్సాహం వారిలో కరువయ్యాయి. ప్రకాశ్ కరత్-సీతారాం ఏచూరిల మధ్య పొడసూపిన సైద్ధాంతిక విభేదాలు సీపీఐ (ఎం)ను నిర్వీర్యం చేస్తే, బర్దన్ మరణించాక సీపీఐ పరిస్థితి కూడా అలాగే తయారైంది. జాతీయ పార్టీని పునరుత్తేజపర్చే స్థితిలో లేని ఈ అగ్రనేతగణం ఇక తెలంగాణ రాష్ట్ర విభాగాలను పునర్వ్యవస్థీకరిస్తారనే ఆశలు పెట్టుకోవడం కూడా కష్టమే.
హోరాహోరీ పోరు
తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం మూడే ప్రధాన పార్టీలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలువడానికి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. తెలంగాణ టీడీపీ, పవన్‌కల్యాణ్ జనసేన, మంద క్రిష్ణ మహాజన సోషలిస్టు పార్టీ పేరుకు మాత్రమే అస్తిత్వంలో ఉండగా, ఈ మధ్యనే రెండు పార్టీలు కొత్తగా రంగంలోకి అడుగుపెట్టాయి. వైఎస్ తనయ వైఎస్సార్‌టీపీని ఏర్పాటుచేయగా, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరి క్రియాశీలమయ్యారు. పరిస్థితి చూస్తుంటే ఇప్పటి వరకు వామపక్షాలు పోషించిన చిన్నపార్టీల పాత్రను, ఓట్లను చీల్చే పనిని ఇప్పుడు ఈ కొత్త పార్టీలు చేయగలవనిపిస్తుంది.
ఇకనైనా మేల్కొంటారా?
ఇప్పటికైనా కమ్యూనిస్టు అగ్ర నాయకత్వం మేల్కోవాలి. దినదినం కనుమరుగవుతున్న పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలి. ''సమస్యలున్నంత కాలం కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయన్న' విశ్వజనీన సూత్రాన్ని నిజం చేయాలి. తమలో ఉన్న పిడివాద, అవకాశవాద అవగాహనలను వదిలించుకోవాలి. చెల్లాచెదురుగా ఉన్న చీలిక పార్టీలనన్నింటినీ ఒక్కటి చేయాలి. పార్లమెంటరీ పంథాను అనుసరించే నక్సలైట్ పార్టీలను సైతం కలుపుకుని ఒకే పార్టీగా ఏర్పడాలి. నాయకత్వ కమిటీలలో యువతీ యువకులకు అవకాశమివ్వాలి. గ్రామాలకు, బస్తీలకు తరలాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేయాలి. వారి విశ్వాసం పొందాలి. అప్పుడే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో చోటు దొరుకుతుంది. లేదంటే రష్యా, చైనా విప్లవాల గురించి చదువుకున్నట్లుగా, చరిత్ర పుస్తకాల్లోనే ఈ పార్టీలు మిగిలిపోకతప్పదు.
డి. మార్కండేయ
- Tags
- marokonam