- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేం మారం.. మీరు మారండి
'ఈ మధ్యనే ఇంటర్నేషనల్ మీడియాలో ఓ వార్త వచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటించలేదని నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్‌బెర్గ్‌కు ఆ దేశ పోలీస్ చీఫ్ 2352 డాలర్ల (సుమారు లక్షా 76 వేల రూపాయలు) ఫైన్ విధించారని ఆ వార్త సారాంశం. ఆమె ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు విందులో హాజరైనవాళ్లు మాస్క్ ధరించలేదని, సోషల్ డిస్టెన్స్ పాటించలేదని ఈ చర్య తీసుకున్నారు. పోలీస్ చీఫ్ చర్యను వ్యతిరేకించకుండా ఆ జరిమానా చెల్లించడమే కాకుండా సోల్‌బెర్గ్ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కొవిడ్ నిబంధనలను ఇకముందు తు.చ. తప్పకుండా పాటిస్తానని, ప్రజలందరూ పాటించాలని ఆమె పిలుపునిచ్చారు'
ప్రపంచంలోనే అత్యధిక ప్రజాస్వామిక విలువలను కలిగిన దేశంగా నార్వే గుర్తింపు పొందింది. మన భారతదేశాన్ని కూడా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వ్యవహరిస్తుంటారు. కానీ, ఇక్కడ జరుగుతున్నదేమిటి? కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి తీవ్రరూపం దాల్చిన అనంతరం ఇక్కడ కూడా లాక్‌డౌన్, కర్ఫ్యూ, అంటూ రకరకాల ఆంక్షలు విధించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద పలు నిబంధనలు జారీ చేసారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించకపోవడాన్ని, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడాన్ని, ఎక్కువ మంది గుమికూడడాన్ని ఐపీసీ 269, 270 ప్రకారం శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు. అయితే, ఈ నిబంధనల అమలును మాత్రం పాలకులు ఏ రోజూ చిత్తశుద్ధితో పర్యవేక్షించలేదు. నియమాలను తామూ పాటించలేదు. జనంతో పాటింపజేయలేదు. ఫలితంగా ఫస్ట్ వేవ్‌లో కేసులు, మరణాల సంఖ్య బాగా పెరిగింది. చివరకు కొన్ని ఇతర కారణాల మూలంగా 2020 అక్టోబర్ తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టింది.
అలర్ట్ కాని పాలకులు
అయితే, వ్యాధి వ్యాప్తి తగ్గడం తాత్కాలికమేనని, పలు దేశాలలో సెకండ్ వేవ్ వస్తున్నదని తెలిసినప్పటికీ మన పాలకులు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించలేదు. పౌరులను అలర్ట్ గా ఉంచలేదు. పైగా, ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం కోసమని, జనాల బతుకుదెరువు కోసమని చెప్పి ఆంక్షల సడలింపునకు తెరలేపారు. వైన్ షాపులు, బార్లు, సినిమాహాళ్లు, హోటళ్లు, పార్కులు, ఫంక్షన్ హాళ్లు.. ఒకటేమిటి, ప్రజలు గుమికూడే అన్ని చోట్లను ఓపెన్ చేసారు. పన్నుల వసూలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. మాస్కులు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడంపై అసలు దృష్టి పెట్టలేదు. అప్రమత్తంగా ఉండాలని మాటలు వల్లె వేస్తున్నా.. కరోనా అంతమైపోయిందని, ఇక భయపడనక్కరలేదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు. ప్రజలు కూడా పాలకుల మాటల కంటే చేతలనే ఎక్కువ పట్టించుకున్నారు. కరోనా మహమ్మారి మళ్లీ ప్రబలుతోందన్న విషయం మరిచి నిర్లక్ష్యంగా ఉండడాన్ని అలవాటు చేసుకున్నారు.
రూల్స్ పాటించని నేతలు
ఇప్పడు సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. ఈ సమయంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ప్రస్తుతం బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాలలో దశలవారీగా పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్ర సహా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలోనే నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమత, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు తాము నిర్వహించే సభలలో కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం ఇక్కడ గమనించాలి. సభలలో మాట్లాడే నేతలు, ఏర్పాట్లు చేసే అనుచరులు, హాజరయ్యే జనం.. ఎవరూ కూడా మాస్కులు పెట్టుకోవడంలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. అయినా, ఎన్నికల కమిషన్ పల్లెత్తు మాట అనదు. సామాన్యజనం మాస్కులు పెట్టుకోకపోతే వేయి రూపాయల ఫైన్ ముక్కుపిండి వసూలు చేసే పోలీసులు కూడా ఆ పని తమది కానట్టు చోద్యం చూస్తుంటారు.
మొక్కుబడిగానే నిబంధనలు
మరోవైపు ఆ నేతలే కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ మాటలు వల్లె వేస్తుంటారు. సెకండ్ వేవ్ వచ్చిందంటూ కేంద్ర హోం, ఆరోగ్య శాఖలు ఎప్పటికప్పుడు నిబంధనలు జారీ చేస్తుంటాయి. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ లాంటి అధికారులు పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, చివరి హెచ్చరిక జారీ చేస్తున్నామని, గాలి ద్వారా సైతం కరోనా వ్యాపిస్తుందని ప్రజలను భయపెడుతుంటారు. స్వీయనియంత్రణ పాటించడమే మార్గమంటారు. ఈ మాటలు ఎవరికి కావాలి? మోడీ, కేసీఆర్ నుంచి మొదలుకొని గల్లీ లీడర్ల వరకు అందరు నేతలు నియమాల ఉల్లంఘన విచ్ఛలవిడిగా చేస్తుంటే, బార్లపై, సినిమాహాళ్లపై, గుమికూడడంపై ఆంక్షల జోలికే వెళ్లకపోతే, ఇక తామెందుకు పాటించాలనే నిర్లక్ష్యధోరణి వారి ఆచరణలో ప్రస్ఫుటం కాకతప్పదు. ఫలితంగా రోజురోజుకు కేసులు వేగంగా పెరుగక ఏమవుతుంది?
వారికి కూడా జరిమానా విధించి ఉంటే
ప్రజలు నియమాలను చిత్తశుద్ధితో పాటించాలంటే మొదట నేతలు, అధికారులు ఆ పనిచేయాలి. అలా కాకుండా 'మేం మారం.. మీరు మాత్రం మారండి'అంటూ ఉపన్యాసాలు దంచినన్ని రోజులు పరిస్థితులలో మార్పు రాదు. బెంగాల్ సభలో మాస్కు లేకుండా ప్రసంగించినందుకు ప్రధాని మోడీకి జరిమానా విధించగలిగినప్పుడు, నియమాలను ఉల్లంఘించి వేలాది మందిని సభకు రప్పించినందుకు సీఎం కేసీఆర్‌కు తగిన శిక్ష విధించగలిగినప్పడు, లీడరైనా, క్యాడరైనా, సామాన్యుడైనా, పలుకుబడి కలవాడైనా ఒకే రీతిలో చర్యలు చేపట్టగలిగినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. పరిస్థితులలో తీవ్రతను గుర్తిస్తారు. అంతేకాని జనాన్ని తిట్టి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. నార్వే ప్రధానికి వేసిన శిక్షలాగా ఇక్కడ కూడా న్యాయం అమలైనప్పుడే ఈ దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోవడానికి అర్హత సాధిస్తుంది.
- Tags
- marokonam