- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్మార్ట్ ఫోన్‌ను నమ్మకండి!
ఈటల ఎపిసోడ్‌పై మాట్లాడుదామని బాగా పరిచయం ఉన్న ఓ రాజకీయ నాయకుని నెంబరుకు నాలుగు రోజుల కిందట కాల్ చేసాను. అతను కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసాడు. అంతలోనే అతని నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ''ఈ మధ్య అందరి ఫోన్లూ ట్యాప్ అవుతున్నాయట. ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది. వాట్సాప్ అయితేనే కొంతలో కొంత సేఫ్'' అంటూ సంభాషణ స్టార్ట్ చేసాడు. అతనే కాదు.. చాలా మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూనుకునేవారు, చివరకు పోలీసు అధికారులు.. ఒక్కరేమిటి? అందరూ వాట్సాప్‌లో ఆడియో లేదా వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు. ఐఫోన్ ఉన్నవాళ్లయితే, ఫేస్‌టైమ్ ఉపయోగిస్తున్నారు. ఇంకొంతమంది టెలిగ్రామ్, సిగ్నల్, బోటిమ్‌లాంటి యాప్స్ వాడుతున్నారు. ఇలా చేస్తే తమ ప్రైవసీకి రక్షణ ఉంటుందని, తను, అవతలి వ్యక్తి తప్ప సంభాషణలను మరెవరూ వినే అవకాశం ఉండదని, దుర్వినియోగం జరగదని నమ్ముతున్నారు.
ప్రైవసీ ప్రాథమిక హక్కు
నిజానికి, మన దేశంలో ప్రైవసీని కలిగియుండడం పౌరుల ప్రాథమిక హక్కు. ఉనికిలో ఉన్న చట్టాలకు భంగం కలిగించని రీతిలో ఎవరైనా తనకు ఇష్టం ఉన్నట్లు ఉండచ్చు. నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. నచ్చిన తిండి తినచ్చు. నచ్చినచోట తిరగచ్చు. నచ్చిన మనుషులను కలువచ్చు. నచ్చిన విషయాలు మాట్లాడుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనందరికీ ఈ స్వేచ్ఛను ప్రసాదించింది. అడ్డుకునే హక్కు, అధికారం ఎవరికీ లేదు. ఫోన్ సంభాషణలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే, దురదృష్టవశాత్తూ మన దగ్గర ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సాధారణమైంది. నేరపూరిత చర్యలను, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునే పేరుతో మొదలైన ఈ చర్య చివరకు రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే అస్త్రంగా మారింది. ఇందిరాగాంధీ కాలం నుంచి ఇప్పటివరకు అనేక సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడం, కొద్ది రోజులు చర్చ జరిగి దాన్ని మర్చిపోవడం కామనైంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలకు నిరంతరం అనేక మంది ఫోన్ సంభాషణలపై నిఘా వేయడం నిత్యకృత్యంగా మారింది. ఫలితంగా జనంలో వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్‌టైమ్, సిగ్నల్ వంటి యాప్స్ వాడకంతోపాటు ఆపిల్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగింది.
ఇవి కూడా సేఫ్ కాదు
అయితే, ఇప్పుడు ఈ వాట్సాప్, ఫేస్‌టైమ్, సిగ్నల్, ఐమెసేజ్ వంటివి కూడా సేఫ్ కాదని తేలిపోయింది. వీటిని ఉపయోగించి కాల్స్ మాట్లాడుతున్న, మెసేజ్ చేస్తున్న సమయంలో ఇవి ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కనుక ఎవరూ వినడం, చూడడం జరగకపోవచ్చు. కానీ, ఆ వెంటనే వివిధ చోట్ల నిక్షిప్తమై ఉన్న ఆ డాటాను సంగ్రహించవచ్చు. సాధారణంగా మన వీడియో, ఆడియో కాల్స్, మెసేజెస్‌కు సంబంధించిన డాటా నాలుగు చోట్ల నిల్వ చేయబడుతుంది. మన ఫోన్ మెమొరీలో, అవతలి వారి ఫోన్ మెమొరీలో, సర్వీస్ ప్రొవైడర్ల (వాట్సాప్, టెలిగ్రాం, ఐఫోన్ వగైరా) సర్వర్లలో, చివరగా సెట్టింగ్స్ లో బ్యాకప్‌కు మనం అనుమతిస్తే క్లౌడ్ (గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్)లో. గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇలా నిల్వ చేసిన డాటా ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉండదు. నేరుగానే చదువచ్చు.. వినచ్చు..
సులభంగా హ్యాక్ చేయవచ్చు
మన ఫోన్ మెమొరీలో, మనం మాట్లాడిన అవతలివారి ఫోన్ మెమొరీలో నిల్వ ఉన్న డాటాను ఈ రెండు ఫోన్లను భౌతికంగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా లేదా హ్యాక్ చేయడం ద్వారా పొందవచ్చు. ఇజ్రాయిలీ సైబర్‌టెక్ సంస్థ ఎన్ఎస్ఓ తయారుచేసిన పెగాసస్ (pegasus) స్పైవేర్‌ను ఉపయోగించి ఏ మొబైల్‌లోని వాట్సాప్ అకౌంట్స్ నైనా సులభంగానే హ్యాక్ చేయవచ్చు. ప్రస్తుతం ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ ఈ స్పైవేర్‌నే వాడుతున్నాయి. ఒక్క వాట్సాప్ మిస్డ్ కాల్‌తో ఏ మొబైల్‌ను అయినా హ్యాక్ చేయవచ్చునని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. మనం వాడిన, అవతలివారు వాడిన మొబైల్ నుంచి ఎన్నేళ్ల తర్వాత అయినా డిలీట్ చేసిన డాటాను బయటకు తీయవచ్చునని, ఆ ఫోన్‌ను ధ్వసం చేయడమొక్కటే మార్గమని కూడా వాళ్లంటున్నారు. ఇక గూగుల్ డ్రైవ్‌లో ఉన్న కాల్స్, మెసేజెస్ బ్యాకప్‌ను బయటకు తీయడానికి నిపుణులే అవసరం లేదు. టెక్నాలజీపై అవగాహన ఉన్నవాళ్లెవరైనా ఈ పని చేయవచ్చు. జీ-మెయిల్ అకౌంట్ వివరాలు కాని, ఫోన్ నెంబరు కాని తెలిస్తే ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఓ పది పేజీల ప్రింటవుట్ తీయవచ్చునని డిజిటల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న ఓ మిత్రుడు చెప్పారు. ఐక్లౌడ్ విషయంలో మాత్రం ఇలా చేయడం దాదాపు అసాధ్యమన్నారు.
డాటా దుర్వినియోగం
వాట్సాప్, ఐక్లౌడ్, టెలిగ్రాం వంటి సర్వర్లలో నిక్షిప్తమైన డాటాను ఆయా కంపెనీలు అధికారికంగానో లేక అనధికారికంగానో ప్రభుత్వ సంస్థలకు అందజేయడం మామూలుగా జరుగుతున్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 సెక్షన్ 69 ప్రకారం ఏ సంస్థకు, ఏ వ్యక్తికి సంబంధించిన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇ-మెయిల్స్, చాట్స్, ఎస్సెమ్సెస్‌లను సంగ్రహించే, నిఘా పెట్టే, డీక్రిప్ట్ చేసే అధికారం ప్రభుత్వవర్గాలకు ఉంది. అందుకు చట్టపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తమ డాటా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కనుక ఎవరికీ ఇవ్వడం సాధ్యం కాదని వాట్సాప్ చెబుతోంది. అయితే ఆ సంస్థకు మన దేశంలో 40కోట్ల అకౌంట్లున్నాయి. దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు సైతం 35 కోట్ల మంది యూజర్లున్నారు. ఏటా వందలాది కోట్ల బిజినెస్ జరుగుతోంది. అలాంటి సంస్థ ఇక్కడి ప్రభుత్వ అభ్యర్థనలను కాదంటుందని భావించలేం. సుశాంత్‌సింగ్-రియా చక్రవర్తి కేసులో, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో, ఇంకా పలుకేసులలో వాట్సాప్ చాట్లు మీడియాలో ప్రసారం అవుతుండడం మనకు తెలిసిందే. రాజకీయ పార్టీలకు సైతం డాటాను అందుబాటులో ఉంచుతున్నారన్న ఆరోపణలు కూడా చాలాకాలంగా ఉన్నాయి.
రాజకీయ అవసరాల కోసం
ఇలాంటి పరిస్థితులలో పౌరులు తమ ప్రైవసీ పట్ల ఆందోళన చెందడం సహజం. ఉగ్రవాద, విచ్ఛిన్నకర, నేర కార్యకలాపాలకు సంబంధించి భద్రతాసంస్థలకు అధికారమిచ్చే పలు చట్టాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000, ఐటీ యాక్ట్ (భద్రతాసంస్థలు వ్యక్తుల పర్సనల్ డాటా సేకరణకు సంబంధించిన) సవరణ చట్టం-2011 ఇలాంటివే. వీటిని పాలకులు తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి, వారి వ్యూహ-ప్రతివ్యూహాలు తెలుసుకోవడానికి వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకు కారణం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలేవీ మన దేశంలో ఇప్పటివరకూ రూపొందలేదు. రెండేళ్ల కిందట కేంద్రం వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (పీడీపీ) బిల్-2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టినా అది ఇప్పటికీ చట్టరూపం సంతరించుకోలేదు. అప్పటివరకూ తమ ప్రైవసీని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఆండ్రాయిడ్, జీ-మెయిల్ వాడకుండా ఉండడం, వాట్సాప్ బ్యాకప్ ఎనేబుల్ చేయకపోవడం, ఇష్టమున్నట్లు లొకేషన్, కెమెరా, కాంటాక్ట్స్, జీమెయిల్ పర్మిషన్స్ ఇవ్వకపోవడం, విచ్ఛలవిడిగా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోవడం, ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, పాత కీప్యాడ్ ఫోన్లను వాడడం వంటివి అతని ముందున్న కొన్ని మార్గాలు. అయినప్పటికీ, తమ ఫోన్లు, చాట్లు ట్యాప్ అవుతున్నాయని అనుమానించిన ఏ పౌరుడైనా జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో లేదంటే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. కోర్టులో కేసు వేయవచ్చు. ఐటీ యాక్ట్-2000లోని సెక్షన్ 66 ప్రకారం తగిన అనుమతులు లేకుండా ఒకరి ఫోన్ సంభాషణలను, చాట్లను ట్యాప్ చేయడం నేరం అవుతుంది. 2018 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాచార హక్కు చట్టం కింద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు దరఖాస్తు చేసి ఎవరైనా తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో లేదో తెలుసుకోవచ్చు.
చివరగా ఒక మాట.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల మాట.. స్మార్ట్ ఫోన్‌ల ద్వారా డిజిటల్ మాధ్యమంలో జరిపే ఆడియో, వీడియో కాల్స్ ను, మెస్సేజింగ్‌ను ఇతరులు వినకుండా, చూడకుండా అడ్డుకునే పకడ్బందీ విధానమేదీ ప్రస్తుతం అందుబాటులో లేదు. సో.. బీ కాషియస్..
డి మార్కండేయ
- Tags
- marokonam