ఉద్యమం.. రాజకీయం..

by D.Markandeya |   ( Updated:2022-12-16 11:40:13.0  )
ఉద్యమం.. రాజకీయం..
X

ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యమబంధాలు లేవని, కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయని అన్నారు. 2014 వరకే ఉద్యమమని, ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని వివరించారు. స్వయానా సీఎం కేసీఆర్ కూడా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా నొక్కి చెప్పారు. గొప్ప ఉద్యమం చేసిన టీఆర్ఎస్ తన ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాన్ని సాధించి, ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిందని, ఇక ఇప్పుడు అది పక్కా రాజకీయ పార్టీగా మారితేనే చిరకాల మనుగడ ఉంటుందని పలు సందర్భాలలో అభిప్రాయపడ్డారు.

ఇక్కడ 'ఈటల'మాటల ఉద్దేశం ఏమిటంటే ఉద్యమం చేసి గెలిచిన ఒక పార్టీ ఆ ఉద్యమస్ఫూర్తిని కోల్పోకూడదని, పాలనలో కూడా ఆ ముద్ర చూపించాలని. పోరాటక్రమంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుపరచాలని. అయితే, చరిత్రలో అలాంటి సందర్భాలు తక్కువే కనిపిస్తాయి. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున నిర్వహించి 1947 ఆగస్టు 15న అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్. బ్రిటిష్ వలస పాలనలో దేశం సర్వం కోల్పోయిన పరిస్థితులలో సర్కారు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమస్ఫూర్తిని ఎంతోకాలం నిలబెట్టకోలేకపోయింది. స్వదేశీ నినాదమే ప్రధానంగా పోరాడినా, విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. తన 54 ఏళ్ల పాలనలో ఆశించిన అభివృద్ధిని సాధించలేకపోయింది.

అసోం రక్షణ కోసం

ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చిన మరోపార్టీ అసోం గణ పరిషత్ (ఏజీపీ). ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్‌గా, ఆ పార్టీ 1970ల చివరలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను నిరోధించాలని, అప్పటికే ప్రవేశించిన చొరబాటుదారులను తిప్పి పంపాలని, అసోం జాతిని కాపాడాలని భారీ ఉద్యమం చేసింది. 1985లో కేంద్రంతో జరిగిన శాంతి ఒప్పందం తర్వాత ఎన్నికలలో గెలిచి పాలన చేబట్టింది. రెండు దఫాలుగా పదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించినా తన ఉద్యమ లక్ష్యాలను పరిపూర్తి చేయలేకపోయింది. ఇప్పటికీ పౌరసత్వ సమస్యపై అసోం రావణకాష్ఠంలా రగిలిపోతూనేవుంది. ఇక, సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఏర్పడిన వివిధ కమ్యూనిస్టు పార్టీలు కూటమిగా ఏర్పడి అనేక వర్గపోరాటాలు చేసి 1977లో పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి వచ్చాయి. జ్యోతిబసు ముఖ్యమంత్రిగా 24 ఏళ్లు, బుద్ధదేబ్ భట్టాచార్య సీఎంగా పదేళ్లు ఆ కూటమి రాష్ట్రాన్ని పాలించింది. అయితే, మార్క్స్ నుంచి లెనిన్ వరకు కమ్యూనిస్టు మహోపాధ్యాయులు ప్రవచించిన ఏ సిద్ధాంతాన్నీ ఆచరణలో పెట్టలేకపోయింది. పైగా, చివరకు పెట్టుబడిదారీ రూపాలలో ఒకటైన సెజ్(నందిగ్రాం స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు విషయంలో తీవ్ర ప్రజావ్యతిరేకతకు గురై కడు దయనీయ పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయింది.

మాతృభూమి నినాదంతో

'మా.. మాటీ.. మనుష్.. '(మాత.. మాతృభూమి.. మనుషులు..) నినాదంతో నందిగ్రాం పోరాటాన్ని విజయవంతంగా నడిపిన ఫలితంగానే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ 2011 ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టింది. రెండు దఫాలుగా ఆ రాష్ట్రాన్ని పాలించింది. అయినా, ప్రజల ఉద్యమ ఆకాంక్షలను తీర్చడంలో ఘోరంగా విఫలమైంది. లెఫ్ట్ ఫ్రంట్, తృణమూల్ రెండూ ప్రజల్లో తీవ్రవ్యతిరేకతను మూటగట్టుకున్న పరిస్థితుల్లో బీజేపీ అక్కడ పాగా వేయడానికి ప్లాన్ వేసింది. చివరకు, దీదీ రాజకీయ చతురత వల్లనో, బెంగాల్ ప్రజల్లో ఉండే సెక్యులర్ భావజాలం వల్లనో, పోస్ట్ కొవిడ్‌లో మోడీ అప్రతిష్ట వల్లనో తృణమూల్ మళ్లీ మెజారిటీ సాధించగలిగింది. ఇక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పదమూడేళ్ల పాటు నిర్విరామంగా పోరాడిన టీఆర్ఎస్ ఉద్యమక్రమంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చింది. బంగారు తెలంగాణ ఆశ చూపించింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు సాధిస్తామని చెప్పింది. దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని ఊరించింది. ఓపెన్‌కాస్టులు ఉండవంది. ప్రాజెక్టుల నిర్వాసితుల కష్టాలను కడతేర్చుతామని ప్రకటించింది. ఆ పార్టీకి అధికారమిచ్చి ఆరున్నరేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టుంది పరిస్థితి. ఉద్యమ క్రమంలో ఇచ్చిన హామీల స్థానంలో ఓట్లను రాబట్టే ప్రజాకర్షక కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు పక్కా రాజకీయపార్టీగా మారిన టీఃఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నది. కమీషన్ల కోసమే కాళేశ్వరం రీడిజైన్ చేసారని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను చేపట్టారనే ఆరోపణలుండడం ఇక్కడ గమనార్హం.

ప్రజాకర్షక నినాదాలు

ఉద్యమం చేస్తున్న క్రమంలో ప్రజాకర్షక నినాదాలివ్వడం.. అధికారంలోకి వచ్చిన వెంటనే తద్విరుద్ధంగా పాలించడం మన దేశంలో పార్టీలకు కామనైంది. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ప్రజలకు అనుకూలంగా మాట్లాడడం, అధికారంలోకి రాగానే ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం తరచూ జరుగుతున్నది. మావోయిస్టులతో కలిసి నందిగ్రాం పోరాటం చేసిన మమత సీఎం అయి ఏడాది తిరగకుండానే ఆ పార్టీపై యుద్ధం ప్రకటించడం, అగ్రనేత కిషన్‌జీని హతమార్చడం.. ప్రపంచీకరణకు వ్యతిరేకమన్న కమ్యూనిస్టులు అధికారం రాగానే బహుళజాతి కంపెనీలకు ద్వారాలు తెరవడం.. స్వదేశీ సిద్ధాంతం చెప్పే ఆర్‌ఎస్ఎస్-బీజేపీ పరివార్ గద్దెనెక్కగానే విదేశీ పెట్టుబడులను పెంచడం.. ఇలా ఎన్నెన్నో ఉదహరణలు చెప్పవచ్చు. ఇవాళ కేసీఆర్‌కు ఉద్యమబంధం లేదన్న ఈటల కూడా రేపు అధికారంలోకి వస్తే ఇంతకంటే భిన్నంగా ఉంటాడనుకోవడం అత్యాశే అవుతుందేమో! కాలమే సమాధానం చెప్పాలి.

-డి మార్కండేయ

Advertisement

Next Story