- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడీ వాంట్స్ తెలంగాణ!
'ఈ రెండూ కాకుండా మధ్యేమార్గాన్ని, చాలా తెలివైన వ్యూహాన్ని బీజేపీ అధిష్టానం ఎంచుకుందని చెప్పవచ్చు. ఓ వైపు కేసీఆర్ పాలనపై విమర్శనాస్ర్తాలు సంధించడం ద్వారా రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలు పంపిస్తూ, మరోవైపు ఎన్నికల తదనంతరం టీఆర్ఎస్ సీట్లు కూడా ఎన్డీయే ఖాతాలో పడేవిధంగా ప్లాన్ చేస్తున్నది. ఆ మేరకు సీఎం కేసీఆర్‌తో సందేహాస్పద సంబంధాలను కొనసాగిస్తున్నది. గత కొన్నేళ్లుగా అటు మోడీ-షా ద్వయం, ఇటు కేసీఆర్ వైఖరి ఈ విషయాన్నే రుజువు చేస్తున్నది. ఇలా చేయడం ద్వారా రెండు పార్టీలూ లాభపడడమే కాకుండా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ను దెబ్బతీసి, వచ్చే ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకుండా చేయాలన్నది వారి ఉద్దేశం. ఈ ప్లాను పనిచేస్తుందా? లేక బెడిసికొడుతుందా? అన్నది రెండు పార్టీలు ఈ ఆటను ఎంత రసవత్తరంగా ఆడతాయి? ప్రజలను ఏ మేరకు నమ్మించగలుగుతాయనే విషయం పైన ఆధారపడివుంటుంది'
'2024 సాధారణ ఎన్నికలలో ఉత్తరాదిలో తాము గెలిచే స్థానాలు ఏ మేరకు తగ్గుతాయో ఆ మేరకు దక్షిణాదిలో పెంచుకోవాలన్నది ప్రస్తుతం బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా, వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచి సీట్లు తగ్గుతాయనే భావన ఉంది. కేరళ సీట్లు ఎలాగూ వామపక్షాలు, కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయి. తమిళనాడులో ఇటీవలే గెలిచిన డీఎంకేను ఎన్డీయేలో కలుపుకోవడానికి ఇప్పటికే అమిత్ షా పావులు కదుపుతున్నారు. కనిమొళి సహా డీఎంకే నేతలపై ఉన్న కేసుల విషయంలో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ కమలం కంట్రోలులోనే కొనసాగడం జగన్‌పై ఉన్న కేసుల రీత్యా తప్పనిసరి. ఇక మిగిలింది తెలంగాణ. ఇక్కడ ఉన్న 17 సీట్లలో అత్యధికం తమ కోటాలో పడేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నది'
తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహానికి బీజేపీ పదును పెట్టింది. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలివిగా పావులు కదిపింది. అధికార మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వ్యతిరేక రాగం అందుకున్న ఈటల.. మంత్రివర్గం నుంచి డిస్మిస్ అయిన వెంటనే స్వరం పెంచారు. ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతానంటూ పలు ఇంటర్వ్యూలలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలతో మంతనాలు సాగించారు. కొద్దిరోజుల మౌనం అనంతరం గత వారం అకస్మాత్తుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు నేతలను కలిసారు. చివరకు, శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. త్వరలో తాను కాషాయ దళంలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
భిన్న వాదనలు
రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుపై రెండు భిన్నవాదనలున్నాయి. అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి దూసుకుపోయిందన్నది మొదటి వాదన. అమిత్ షా తెలంగాణపై దృష్టి పెట్టడం, యువకుడు, ఉత్సాహవంతుడు, అంకితభావం కలిగిన సంఘ్ సైనికుడు అయిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం, పార్టీలో ధర్మపురి అరవింద్, వివేక్, రఘునందన్‌రావు వంటి యంగ్ టర్క్‌ల ప్రాబల్యం పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమన్నది వీరి విశ్వాసం. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ చతికిలపడిపోవడం అంతిమంగా బీజేపీకే లాభిస్తుందని, టీఆర్ఎస్ అసంతృప్తులెవరైనా చివరకు కమలదళంలో చేరక తప్పదని, ప్రజలు కూడా ఈ పార్టీనే ప్రత్యామ్నాయంగా ఎంచి ఓట్లు వేస్తారని వీరు భావిస్తున్నారు.
మోడీ, కేసీఆర్ మైత్రీబంధం
మోడీ-కేసీఆర్ మధ్య ఉన్న మైత్రీబంధాన్ని చూపుతూ బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని, అది టీఆర్ఎస్‌కు లోపాయికారిగా సహకరించగలదే కానీ, ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాబోదన్నది రెండవ వాదన. కేసీఆర్ మొదటి దఫా 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య లవ్-హేట్ రిలేషన్‌ఫిప్ కొనసాగుతోందన్నది వీరి భావన. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, కీలక నిర్ణయాల విషయంలో మద్దతు ప్రకటించడం వరసగా జరుగుతున్నదని వీరంటారు. కేటీఆర్ సహా రెండవ శ్రేణి నేతలే కమలనాథులపై విరుచుకుపడుతున్నారని, అధినేత మాత్రం ఈ ఏడేళ్లలో మోడీ పాలనను దుయ్యబట్టింది చాలా తక్కువ సందర్భాలలోనేనని వీరు గుర్తుచేస్తారు. రైతు ఉద్యమం విషయంలో కేసీఆర్ వారం రోజులలోనే ప్లేట్ ఫిరాయించిన విషయాన్ని ఉదాహరణగా చూపిస్తారు. ఇక, బీజేపీ వైపు నుంచి కూడా గులాబీ పాలనపై రాష్ట్ర స్థాయి నేతలు విరుచుకుపడడం తప్ప కేంద్ర నాయకత్వం విమర్శించిన సందర్భాలు చాలా తక్కువని, కేంద్రమంత్రులెందరో తెలంగాణకు వచ్చి ఇక్కడ చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన విషయం మర్చిపోకూడదంటారు. కాంగ్రెస్‌ను ఈ రాష్ట్రంలో ఎదగకుండా చేయడమే ఈ రెండు పార్టీల రహస్య ఎజెండా అని కూడా వాదిస్తారు. ఈ కారణాల రీత్యా ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టడం జరగదని తేల్చేస్తారు.
వాస్తవాలు ఏమిటి?
ఈ రెండు వాదనలలోని వాస్తవాలను ఒకసారి పరిశీలిద్దాం. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం రెండవ దఫా పాలన కొనసాగిస్తున్నది. మొదటి దఫా పాలనలో కొనసాగిన అనుకూలతలు రెండవ దఫాలో కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా గత రెండు మూడేళ్లుగా ఒక్కో రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోతున్నది. గెలిచిన చోట కూడా కాంగ్రెసో లేక మరో పార్టీయో బలాన్ని పుంజుకుంటున్నాయి. బీహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను ఇందుకు ఉదహరణగా చూపవచ్చు. ముఖ్యంగా కాషాయానికి ఆయువుపట్టయిన ఉత్తరాదిలో రోజురోజుకు బలహీనపడుతుండడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనలో పడేస్తున్నది. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ ప్రతిష్ఠ బాగా దిగజారుతున్నది. మోడీ, అమిత్ షా సహా అగ్రనేతలందరూ ప్రస్తుతం ఆ రాష్ట్రం పైననే ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కమలనాథులు మొత్తం 352 సీట్లు గెలవగా, ఇందులో కేవలం ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే 258 సీట్లు రావడం ఇక్కడ గమనార్హం. ఈ 8 రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదు.
ఇదీ బీజేపీ వ్యూహం
2024 సాధారణ ఎన్నికలలో ఉత్తరాదిలో తాము గెలిచే స్థానాలు ఏ మేరకు తగ్గుతాయో ఆ మేరకు దక్షిణాదిలో పెంచుకోవాలన్నది ప్రస్తుతం బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా, వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచి సీట్లు తగ్గుతాయనే భావన ఉంది. కేరళ సీట్లు ఎలాగూ వామపక్షాలు, కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయి. తమిళనాడులో ఇటీవలే గెలిచిన డీఎంకేను ఎన్డీయేలో కలుపుకోవడానికి ఇప్పటికే అమిత్ షా పావులు కదుపుతున్నారు. కనిమొళి సహా డీఎంకే నేతలపై ఉన్న కేసుల విషయంలో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ కమలం కంట్రోలులోనే కొనసాగడం జగన్‌పై ఉన్న కేసుల రీత్యా తప్పనిసరి. ఇక మిగిలింది తెలంగాణ. ఇక్కడ ఉన్న 17 సీట్లలో అత్యధికం తమ కోటాలో పడేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నది. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా కేంపెయిన్ చేసి ఎన్నికలకు వెళితే ఎక్కువ సీట్లు వస్తాయా? లేక కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటే వస్తాయా? అన్నది ఆ పార్టీ ముందున్న సమస్య. వ్యతిరేకంగా వెళితేనే ప్రయోజనముంటుందని తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం వాదిస్తుంటే మరో వర్గం మాత్రం ఆ వాదనను తిరస్కరిస్తూ టీఆర్ఎస్ పట్ల పాజిటివ్ వైఖరిని ప్రతిపాదిస్తున్నది.
సందేహాస్పద సంబంధాలు
ఈ రెండూ కాకుండా మధ్యేమార్గాన్ని, చాలా తెలివైన వ్యూహాన్ని బీజేపీ అధిష్టానం ఎంచుకుందని చెప్పవచ్చు. ఓ వైపు కేసీఆర్ పాలనపై విమర్శనాస్ర్తాలు సంధించడం ద్వారా రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలు పంపిస్తూ, మరోవైపు ఎన్నికల తదనంతరం టీఆర్ఎస్ సీట్లు కూడా ఎన్డీయే ఖాతాలో పడేవిధంగా ప్లాన్ చేస్తున్నది. ఆ మేరకు సీఎం కేసీఆర్‌తో సందేహాస్పద సంబంధాలను కొనసాగిస్తున్నది. గత కొన్నేళ్లుగా అటు మోడీ-షా ద్వయం, ఇటు కేసీఆర్‌ల వైఖరి ఈ విషయాన్నే రుజువు చేస్తున్నది. ఇలా చేయడం ద్వారా రెండు పార్టీలూ లాభపడడమే కాకుండా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ను దెబ్బతీసి, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా చేయాలన్నది వారి ఉద్దేశం. ఈ ప్లాను పనిచేస్తుందా? లేక బెడిసికొడుతుందా? అన్నది రెండు పార్టీలు ఈ ఆటను ఎంత రసవత్తరంగా ఆడతాయి? ప్రజలను ఏ మేరకు నమ్మించగలుగుతాయనే విషయం పైన ఆధారపడివుంటుంది. అంతేకాకుండా, ఈ రెండు పార్టీల మధ్య కుమ్మక్కును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్లగలుగుతుందనే అంశం కూడా ముఖ్యమైనదే. ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న దయనీయ స్థితిని పరిగణిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో తెలంగాణ మోడీ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. 2023లో జమిలి ఎన్నికలు వచ్చినా, 2024లో సాధారణ ఎన్నికలు జరిగినా ఇంకా రెండు మూడేళ్ల సమయం ఉంది కనుక, ఈలోపు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయన్నది పరిశీలకులకు ఆసక్తికరం. విశ్లేషకులకు అధ్యయనాంశం.
డి. మార్కండేయ
- Tags
- marokonam