- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇది ఇండియా.. రూల్స్ వర్తించవు
డిగ్రీ చదివే రోజులలో మా రూమ్మేట్ ఒకడుండేవాడు. ఏదైనా పద్ధతిని పాటించే విషయంలో చర్చ వచ్చినప్పడల్లా 'ఇది ఇండియా.. ఇక్కడ రూల్స్ గీల్స్ నై చల్తా'అనేవాడు. అదేంటని అడిగితే 'ఇక్కడ రూల్స్ తోపాటే వాటిని బ్రేక్ చేసే మార్గాలు కూడా తయారవుతాయి. అందుకే ఎవరూ పాటించరు'అనేవాడు. అందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు చూపించేవాడు. ఎవరు ఎంత వాదించినా చివరకు ప్రతిసారీ అతనే గెలిచేవాడు. సుమారు ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు కరోనా కాలంలో ఆయన మాటలు ఎంతటి అక్షరసత్యాలోనని అనిపిస్తుంది. వాహనదారులు హెల్మెట్ ధరించాలనే నియమం ఉంటుంది. దాన్ని ఎవరూ పాటించరు. సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై నిషేధం ఉంటుంది. కానీ, కార్లను, బైక్‌లను నడుపుతూ కాల్స్ మాట్లాడుతుంటారు. రెడ్‌లైట్ పడినా సిగ్నల్ జంపింగ్ చేస్తారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌కు హద్దులే ఉండవు. ట్రిపుల్ రైడింగ్ కామనైపోతుంది. ఫుట్‌బోర్డు ట్రావెలింగ్ వద్దన్న కండక్టర్‌ను ఎవరూ పట్టించుకోరు. స్కూలు పరిసరాలలో 'నో హారన్ ప్లీజ్'అని ఉన్నచోటే హారన్ మోగిస్తారు. రోడ్లపై వేగపరిమితిని పాటించాలన్న ధ్యాస ఎవరికీ ఉండదు. ఇచ్చట మూత్రవిసర్జన చేయకూడదు అని రాసివుంటుంది. అక్కడే నిలబడి నిర్భయంగా ఆ పని చేస్తారు. చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదని, కుండీలలోనే వేయాలని తెలిసినా పాటించరు. రోడ్లపైన, డ్రైనేజీలలో వేస్తుంటారు. పోస్టర్లు అంటించరాదని ఉన్నచోటనే అంటిస్తారు. పొగ తాగరాదు అని వుంటే తమకేమీ పట్టనట్టు ఆ పనీ చేస్తారు. ఉమ్మి వేయద్దని రాసివుంటుంది. పాన్, గుట్కా తిని ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తుంటారు. క్యూ పద్ధతి పాటించమని రాసివుంటుంది. గుంపులుగుంపులుగా ఎగబడుతుంటారు.
నేరమని తెలిసినా
లంచం తీసుకోవడం నేరమనే చట్టం ఉంటుంది. ఏ ఆఫీసుకు వెళ్లినా పైసలు ఇవ్వనిదే పని జరగదు. దళారుల వ్యవస్థ లేదంటారు. ఆ బోర్డు కిందే దళారీ కూర్చుంటాడు. ఓటును కొనకూడదని చట్టం తెచ్చినవాళ్లే ఓటు వేయడానికి డబ్బులు, బహుమతులు ఆఫర్ చేస్తుంటారు. కోట్ల రూపాయలు కుమ్మరిస్తూవుంటారు. నోటు తీసుకుని ఓటు వేయడం కరెక్ట్ కాదని తెలిసి కూడా నోట్లు తీసుకుంటారు. క్వార్టర్లు తాగుతుంటారు. బిర్యానీలు తింటుంటారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటారు. కరోనా మహమ్మారి విరుచుకుపడింది. కోట్లాది మందికి వైరస్ అంటుకుంది. లక్షలాది మంది మంచం పట్టారు. వేలాది మంది మరణించారు. ముట్టుకున్నా, పట్టుకున్నా, చివరకు గాలి పీల్చినా కరోనా సోకుతుందని డాక్టర్లు మొత్తుకున్నారు. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడమే మనిషి ప్రాణాలకు శ్రీరామరక్ష అని హెచ్చరించారు. ప్రభుత్వాలు కూడా తమ ధర్మంగా చట్టాలు తెచ్చాయి. నియమాలను ప్రకటించాయి. మార్గదర్శకాలను విడుదల చేసాయి. లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్, ఇతర ఆంక్షలను దశలవారీగా అమలుచేసాయి. క్రమంగా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టింది.
నిపుణులు హెచ్చరిస్తున్నా
ఇప్పుడు సెకండ్ వేవ్ మళ్లీ విజృంభిస్తోంది. ఈసారి వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉందని, రోగతీవ్రత, మరణాలు కూడా ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో రోజుకు నాలుగు లక్షల కేసులు వస్తున్నాయి. తెలంగాణలో పదివేలు ఇప్పటికే దాటాయి. త్వరలోనే ఈ ఫిగర్స్ నాలుగింతలు పెరుగుతాయని అంటున్నారు. ఇంటికో కేసు, గల్లీకో మరణం అన్నట్లు తయారైంది పరిస్థితి. ప్రతి ఐదు కేసులకు ఒక్క కేసునే తాము అధికారికంగా చూపిస్తున్నామని, రోజువారీ బులెటిన్‌లో వచ్చే సంఖ్యను ఐదుతో గుణిస్తే అసలు కేసుల సంఖ్య తెలుస్తుందని తెలంగాణకు చెందిన ఓ సీనియర్ వైద్యాధికారి ఆఫ్ ద రికార్డ్ చెప్పారంటే పరిస్థితి ఎంత దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా, ప్రజలు డోంట్ కేర్ అన్నట్లుగానే ఉంటున్నారు. ఇప్పటికీ చాలామంది మాస్క్ పెట్టుకోవడంలేదు. వేయి రూపాయల ఫైన్ అన్న తర్వాత పేరుకు పెట్టుకున్నా ముక్కు, నోరు బయటే ఉంటున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. వైన్ షాపుల వద్ద, హోటళ్ల వద్ద, మాల్స్‌లో.. ఎక్కడంటే అక్కడ గుంపులుగా ఉంటున్నారు. నాగార్జునసాగర్‌లో, ఇప్పుడు వరంగల్, ఖమ్మం తదితర చోట్ల మున్సిపల్ ఎన్నికల్లో ఉల్లంఘన విచ్ఛలవిడిగా జరిగింది. ప్రచారసభల్లో వేలాదిగా, రోడ్‌షోల్లో వందలాదిగా గుమికూడారు. టీకా, టెస్ట్ సెంటర్ల వద్ద సైతం దూరం పాటించడంలేదు.
ఈ తత్వం ఎక్కడిది?
అసలు ఈ తత్వం భారతీయులకు ఎలా వచ్చింది? ఇది ఇండియా.. ఇక్కడ రూల్స్ వర్తించవనే నానుడి ఎలా పుట్టింది? 200 ఏళ్లు బ్రిటిషర్లకు బానిసలుగా బతికినందువల్ల వచ్చిందా? పశ్చిమదేశాల్లోలాగా భూస్వామ్యంలో పారిశ్రామిక విప్లవం బద్దలు కాకుండా అరువు తెచ్చుకున్న పెట్టుబడిదారీ విధానం మూలంగా కార్మికవర్గ క్రమశిక్షణ అలవడలేదా? టైం సెన్స్ లేకుండా తన వీలును బట్టి పొలానికి వెళ్లే రైతు మనస్తత్వం కారణమా? రూల్స్ ప్రజల కోసమే తప్ప తమకు కాదన్న రీతిలో వ్యవహరించే పాలకులు అలవాటు చేసారా? క్లాజుల రూపంలో నియమాలను చెప్పే ప్రతి చట్టంలోనూ ఉల్లంఘనలకు, వెసులుబాట్లకు వీలు కల్పించే సబ్‌క్లాజులు కారణమయ్యాయా? మితిమీరిన జనాభా, కటిక దారిద్ర్యం ఈ పరిస్థితిని తీసుకొచ్చాయా? నిజంగా ఆలోచించాల్సిన విషయమే.
-డి మార్కండేయ
- Tags
- marokonam