- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాతకు కేసీఆర్ ఆలంబన
రాష్ట్రంలో రైతుబంధు సంబురం ఇటీవల ముగిసింది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించిన డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమయ్యాయి. ఈ ఏడాది 65 లక్షల మంది రైతులకు రూ.7,508 కోట్లు పంట సాయం కింద అందుతున్నాయి. ఇప్పటివరకు తొమ్మిది విడతలలో రూ. 57,956 కోట్ల నిధులు రైతుబంధు కోసం ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇవి అంకెలు కాదు, రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ అంకితభావానికి సిసలైన నిదర్శనం. కేంద్రం అనేక ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వద్దనే ఉద్దేశంతో రైతుబంధు సమయానికి అందించారు కేసీఆర్.
కేంద్ర సాయం లేకున్నా
సీఎం కేసీఆర్ ముందుచూపుతో 1 కోటి 34 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగింది. 45 లక్షల టన్నులుగా ఉన్న దిగుబడి నేడు 3 కోట్లకు చేరింది. అలాగే, ఆయిల్ పామ్ సాగు 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల కోసం ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు. దేశంలో రైతుల గురించి ఇలా ఆలోచించే నాయకుడే లేడు. ఒక రైతుబిడ్డగా కేసీఆర్ రైతుల కోసం ఎన్ని లక్షల కోట్లు అయినా ఖర్చు చేయడానికి సిద్దపడే తత్వం. రైతు కోసం ఎంతకైనా తెగించి ముందడుగే వేస్తారు. నీళ్లు నిధులు, నియామకాలు, కరెంట్ ఇలా ప్రతి రంగంలో తెలంగాణ మహా విప్లవం సృష్టిస్తున్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం కనీస ఆలోచన కూడా చేయకుండానే నల్ల చట్టాలు తెచ్చి వందలాది మంది రైతుబిడ్డలను పొట్టన పెట్టుకుంది. మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి పీఎం కిసాన్ సమ్మాన్ ప్రవేశపెట్టారు మోడీ. రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉంటే 35 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ వస్తుంది. మిగితావారి పరిస్థితి ఏమిటి? ఇప్పటివరకు కేంద్రం దీనికి రూ.7,689 కోట్లు ఖర్చు చేస్తే రాష్టం రూ.57,956 కోట్లు ఖర్చుచేసింది. ఇంత సంక్షేమం ప్రజలకు అందిస్తున్నా, వారి మంత్రులు మెచ్చుకోవడమే తప్ప ఏ పథకానికి రూపాయి కూడా కేంద్రం మంజూరు చేయలేదు. తెలంగాణ గడ్డ మీదకు వచ్చి మీటింగులు పెట్టి మాటలెన్నో చెబుతున్నారు.
కుహానా రాజకీయాలతో
తెలంగాణ రాష్ట్రానికి ఏదో వెలగబెట్టినట్లు హైదరాబాద్‌లో విజయసంకల్ప సభ పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకున్నారు. వీటి ద్వారా దేశానికి ఏమైనా మార్గదర్శనం చేశారా? రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలు నెరవేర్చని మీరు తెలంగాణ గడ్డమీద విజయసంకల్ప సభ, జాతీయ సమావేశాలు నిర్వహించడంలో అర్థం ఉందా? తెలంగాణకు చేసింది ఏంది? చేయబోయేది ఏంది? అనేది చెప్పనే లేదు. సంక్షేమ పథకాలతో ప్రజలకు నిరంతరం సహాయం అందజేస్తున్న కేసీఆర్ రాష్ట్రానికి ఆదర్శం. మరి మీరు దేనికి ఆదర్శం? దేశంలో ఉన్నదంతా అమ్మడంలో ఆదర్శమా? దేశం నిలబడాలంటే రాష్ట్రాలు బలంగా ఉండాలి.
అభివృద్ధిలో, సంక్షేమంలో బలంగా గట్టి పిల్లర్లుగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. కానీ, నేడు రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని, హక్కులను కాలరాసే విధంగా, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోంది కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం చేతకాక కుహానా రాజకీయాలు చేస్తోంది. ప్రజల కోసం, రైతుల కోసం, ఉద్యోగాల కోసం, సైన్యం కోసం చేసేదేమి లేక ప్రభుత్వాలను కూల్చడమే పనిగా మోడీ పాలన సాగుతోంది. దేశాన్ని చీకటి రాజ్యంగా చేసి మతం అనే విషాన్ని నింపుతున్న మోడీ ప్రభుత్వానికి చీకటి రోజులు రాబోతున్నాయి. తెలంగాణ నుంచే బీజేపీ పతన రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడేలా దేశ రాజకీయాలలో పెను తుఫాను సృష్టించబోతున్నారు కేసీఆర్. దేశమంతా పరిమళాలు విరజిమ్మే కాంతి కిరణాల నవ భారతావనిని చూడబోతున్నాం. పది రోజులుగా కురుస్తున్న వానలతో నష్టపోయిన గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారు. బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇలాంటి విపత్తు సమయంలోనూ కేంద్రం తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు.
చిటుకుల మైసారెడ్డి
జర్నలిస్ట్, సిద్దిపేట
94905 24724