- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైతాళికుడు..
తెలుగునాట కాకతీయుల కాలంలో సాగునీటి పారుదల వ్యవస్థ, గుళ్లు, గోపురాల నిర్మాణం, ప్రజా పాలన, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ విశేషంగా జరిగింది. వారి విశేషాంశాల వారసత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుణికిపుచ్చుకున్నారు. స్వయంగా ఆయన కవి, రచయిత, సాహిత్యవేత్త, అంతకు మించి పరమభక్తుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు. కాకతీయుల గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి సాగునీటికి రంధి లేకుండా చేసి సామాజిక సంక్షేమానికి పాటుపడిన సీఎం కేసీఆర్.. సమాజంలో శాంతి స్థాపనకు, మానసిక ఉల్లాసానికి, దైవ చింతన కోసం ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మిక వైభవానికీ అదే స్థాయిలో కృషి చేస్తున్నారు. వలస పాలనలో ఆదరణకు నోచుకోని పురాతన, మహిమాన్వితమైన ప్రముఖ దేవాలయాలను స్వరాష్ట్రంలో ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి చేస్తున్నారు. నిరాదరణకు గురైన మన పండుగలు, మన దేవాలయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
గోదావరి ఇక్కడ పారనట్టు వ్యవహరించి..
నాసిక్‌లో పుట్టి మహారాష్ట్ర మీదుగా, తెలంగాణలో అడుగు పెట్టే గోదావరి తల్లి బాసరలో సరస్వతిని పలుకరించి, ధర్మపురి క్షేత్రంలో నర్సన్నకు నమస్తే చెప్పి, కాళేశ్వరంలో ముక్కంటిని స్పర్శించి, భద్రాదిలో రామన్నను దర్శిస్తుంది. అలాంటి పుణ్యక్షేత్రాల వద్ద గోదావరి పుష్కరాలే లేవన్నట్లుగా సీమాంధ్ర వలస పాలకులు వ్యవహరించారు. పుష్కరాల సమయంలో తెలంగాణలోని పవిత్ర క్షేత్రాల వద్ద కనీసం స్నానాలకు ఘాట్లు సైతం నిర్మించలేదు. 2003లో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభమై అప్పటికి మూడేండ్లు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ గోదావరి పుష్కరాల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చారు. గోదావరి పుష్కరాలంటే, రాజమండ్రిలో జరిగేవే అన్నట్లుగా సీమాంధ్ర ప్రభుత్వాలు వ్యవహరించేవని, ఈ పుష్కరాల నిర్వహణలో వివక్షపై తొలిసారిగా గొంతెత్తారు. తెలంగాణ పవిత్ర క్షేత్రాల గుండా గోదావరి పారుతున్నా, సీమాంధ్ర పాలకులు బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదని, తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, ఆలయాలను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాల్లో పుణ్యస్నానాల కోసం సరైన వసతులు కల్పించలేదని మండిపడ్డారు. దీంతో అప్పటి పాలకులు మేలుకున్నారు. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపురిలో గోదావరి స్నానం చేయనున్నట్లు ప్రకటించారు.
ఆసమయానికే ధర్మపురికి చేరుకున్న ఉద్యమనేత కేసీఆర్, వేదపండితులతో సమావేశమయ్యారు. పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన ఉద్యమ సారథి కేసీఆర్‌కు అప్పటి జిల్లాకు చెందిన మంత్రులు అనేక ఇబ్బందులు కలిగించారు. చాలాచోట్ల పికెటింగులు ఏర్పాటు చేయించారు. సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సాకుతో అడ్డుకున్నారు. దీంతో 2015లో జరిగే పుష్కరాలు తెలంగాణలోనే జరుగుతాయని, నర్సన్న ఆశీస్సులతో ఉత్తర దక్షిణ వాహినిగా ఉన్న ధర్మపురి క్షేత్రంలోనే పుష్కర స్నానం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఏ క్షణాన ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో గాని తథాస్తు దేవతలు ఆయన మాటలను దీవించారు. 2015 గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నాటి ఉద్యమ నాయకుడైన కేసీఆర్ సీఎం హోదాలో గోదావరి పుష్కరస్నానాలకు అంకురార్పణ చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా వేలాది కోట్ల రూపాయలను గోదావరి పుష్కరాల కోసం కేటాయించారు. రాత్రిపూట ధర్మపురిలో బస చేసిన సీఎం దంపతులు, జూలై 14వ తేదీన ఉదయం 6.31 గంటలకు గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించి, సమస్త విశ్వానికి మేలు జరగాలని, పవిత్ర పుష్కర స్నానం ప్రజలకు అంతులేని సుఖ సంతోషాలను, ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను ఇవ్వాలని అభిలషించారు. ఇది చరిత్రలో లఖించిన మహోన్నత ఘటన.
ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా..
పుష్కరాలే కాదు... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, పండుగలకు మునుపెన్నడూ లేని ప్రభ తీసుకొచ్చారు. స్వరాష్ట్రంలో సాగుకు నీళ్లొచ్చినయి వ్యవసాయం మంచిగైంది. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలతో సామాజిక సంక్షేమం పరిఢవిల్లుతోంది. తెలంగాణ మట్టి బిడ్డల ఇలవేల్పు బతుకమ్మ పండుగకు ఇవాళ విశ్వఖ్యాతి లభించడానికి కారణం సీఎం కేసీఆరే అనడంలో సందేహం లేదు. బతుకమ్మతో పాటు బోనాలు, గ్రామ దేవతల పండుగలకూ స్వరాష్ట్రంలో ఎంతో ఆదరణ పెరిగింది. గోల్కొండ జగదాంబికా, లాల్ దర్వాజా, సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, కొండపోచమ్మ, బద్దిపోశమ్మ అమ్మవార్ల ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి అధికారికంగా నిర్వహిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో నిజంగా సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. ఇక ఆలయాల విషయానికొస్తే.. కాకతీయులు కట్టిన ఎన్నో గుడుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా భద్రాద్రి రాముడిని తీసుకునేందుకు ఏపీ నాయకులు ఎంత ప్రయత్నించినా.. ససేమిరా ఒప్పుకోలేదు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ఎములాడ రాజన్న, జోగులాంబ అమ్మవారి ఆలయం, బాసర సరస్వతి ఆలయం అభివృద్ధికి కృషి చేయడంతోపాటు, అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్కల ఉత్సవాల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారు. కాళేశ్వరం జలాలు తెచ్చి కొమురవెల్లి మల్లన్న కాళ్లు కడుగుతా.. అని ప్రకటించిన కేసీఆర్.. అన్నట్టే మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్న కాళ్లు కడిగి అభిషేకం చేశారు. తెలంగాణ చరిత్రలోనే యాదాద్రి నిర్మాణం ఓ ఆధ్యాత్మిక అద్భుతం. పవిత్ర కార్యదీక్షకు ప్రకృతి శక్తులన్నీ ఒకటై విజయాన్ని చేకూర్చుతాయన్నట్లుగా యాదాద్రిని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అనతి కాలంలోనే ఆ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కాకతీయ పాలకులలో గణపతిదేవ మహారాజు ‘నృసింహతత్త్వం’ వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా కాలంలో పునఃనిర్మాణమైన యాదాద్రి నృసింహతత్త్వాన్ని శిఖరాయ మానంగా ప్రతిష్ఠిస్తుంది, అందులో సందేహమే లేదు. ఆగమ, వాస్తు శాస్త్రాలు, ఆధునిక నిర్మాణ సాంకేతికతలు ఆలంబనగా దాదాపు రూ.1200 కోట్లతో ఈ మహా నిర్మాణం రూపుదిద్దుకున్నది.
నిజమైన సెక్యూలరిస్ట్..
తెలంగాణలోనే ఉన్న మరో దివ్య క్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం. ఇక్కడికి తెలంగాణతోపాటు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్, ఎములాడ రాజన్న క్షేత్రాన్ని, కొండగట్టు అంజన్న ఆలయాన్నీ అదే తరహాలో అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు 25 ఏళ్ల తర్వాత సీఎం కేసీఆర్ తాజాగా కొండగట్టుకు వెళ్లారు. 1998లో కేసీఆర్ ఆలయానికి వెళ్లగా..తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల సందర్శించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా, దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించారు. హనుమాన్ జయంతి వేడుకలు దేశంలోనే అత్యంత వైభవంగా కొండగట్టులో జరుపుతామని సీఎం చెప్పారు. దాదాపు 50 వేల మంది ఒకేసారి దీక్ష ధారణ, విరమణ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. ఆలయ అభివృద్ధి ఓ బృహత్తర ప్రాజెక్ట్ అన్న కేసీఆర్.. వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా అన్ని హంగులతో తీర్చిదిద్దడంతో పాటు, భక్తులకు సకల వసతులు కల్పించేలా కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. నిజమైన హిందువుకు, సెక్యులరిస్ట్కు సీఎం కేసీఆరే ప్రత్యక్ష ఉదాహరణ. మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్ల కోసం, ప్రజల మెప్పు కోసం ఇతర పార్టీల్లా ఆయన ఎన్నడూ పాకులాడలేదు. తెలంగాణలో మత సామరస్యాన్ని, పరమత సహనాన్ని గొప్పగా పాటిస్తున్నారు. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ముస్లిం, క్రైస్తవ సోదరీ సోదరులకు ప్రభుత్వం భారీ ఎత్తున విందును ఏర్పాటు చేయడమే గాక బట్టలు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఆధ్యాత్మిక చింతన, సమాజంలో శాంతి స్థాపన, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నిజంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైతాళికుడే.
(నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం)
బచ్చు శ్రీనివాస్,
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
93483 11117