ఒక్క చాన్స్ మాత్రమేనా..?

by Ravi |   ( Updated:2024-07-11 01:01:19.0  )
ఒక్క చాన్స్ మాత్రమేనా..?
X

"ఒక్క ఛాన్స్" ఇస్తే తన తండ్రి వై ఎస్ రాజశేఖర రెడ్డిని మరపించే అద్భుతమైన పాలన అందిస్తానని నాటి ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలను ప్రజలు నమ్మి 2019 ఎన్నికల్లో 49.95% ఓట్లతో 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించారు. అయితే కేవలం ఐదేళ్లలో 11 సీట్లకే పరిమితమై చరిత్రలో మరెవ్వరు ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. ఇరవై ఐదుగురు మంత్రులు ఓడిపోయారు. మరి జగన్ మీద ప్రజలు పెంచుకున్న నమ్మకం ఏమైంది? విశ్వాసం ఎందుకు పోయింది?

మాట తప్పి - మడుమ తిప్పి

అసలు జగన్ ట్రేడ్ మార్క్ మాట తప్పడు.. మడమ తిప్పడు అని. మాట ఇచ్చి తప్పడం నా విధానం కాదు కాబట్టి 2014 ఎన్నికల్లో నష్టపోతామని తెలిసినా చేయలేని రైతు రుణమాఫీ హామీ ఇవ్వలేదని పదేపదే 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు. కానీ అదే ఎన్నికల మేనిఫెస్టోలో తాను హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, మధ్య నిషేధం. సీపీఎస్ రద్దుపై మాట తప్పారు. ఇవన్నీ కష్టసాధ్యమైన వైతే ఎన్నికల వేళ హామీ ఎందుకు ఇచ్చినట్టు? ప్రభుత్వమే నాసిరకం మద్యం బ్రాండ్లను అధిక ధరలకు అమ్మడంతో సంపాదన మొత్తం మద్యం దుకాణం పాలై సామాన్యుని ఇల్లు,ఒళ్లు కూడా గుల్లయిన పరిస్థితి. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం 1,631 రోజుల పాటు అక్కడి ప్రజలు, రైతులు చేసిన చారిత్రాత్మక ఉద్యమం వైసీపీ ప్రభుత్వానికి ఎనలేని నష్టం కలిగించిందనేది కాదనలేని సత్యం. ఇక వివేకానంద రెడ్డి హత్య విషయంలో నేరస్తులను జగన్ రక్షిస్తున్నాడంటూ సోదరిలు షర్మిల, సునీత చేసిన విమర్శలు బలంగా వెళ్లాయి. అత్యంత ముఖ్యమైన విషయాలలో జగన్ మాట తప్పడం వలన ప్రజల దృష్టిలో ఆయన ఇమేజ్ దెబ్బతింది.

పాలనపై ప్రజలలో ప్రతికూలత

ఎవరైనా పరిపాలన నిర్మాణాత్మకంగా ప్రారంభిస్తారు. కానీ ప్రజా వేదిక విధ్వంసంతో మొదలైన పాలన ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం విధ్వంసంతో పరాకాష్టకు చేరింది. పులిచింతల గేట్లు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం, దారుణమైన రహదారులు, పాలనాపరంగా జగన్ నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ చేతకానితనాన్ని తేటతెల్లం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలను సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆయా వర్గాల్లో వ్యతిరేకతను తెచ్చింది. జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం జరిగినా దీనివల్ల అధికార పార్టీకి ప్రజలకు మధ్య ఉండే బంధం తెగిపోయింది. పార్టీ నాయకులు ప్రజలలో పట్టు కోల్పోయారు. ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను వెలిబుచ్చే హక్కును ప్రజా ప్రతినిధులు, స్థానిక వైసీపీ నాయకులు వమ్ముచేసారు. ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా తమ రాజకీయ, సామాజిక సంబంధాలు అధికార పక్షానికి తెలుస్తుందేమోననే భయం సామాన్య ప్రజలను వెంటాడింది.

రోత విమర్శలు ..

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వైసీపీ విషయంలో ఎవరైనా విమర్శ చేస్తే మంత్రుల స్థాయి నుండి సోషల్ మీడియా కార్యకర్తల వరకు దారుణంగా దూషించడం చేశారు. సిఐడి వ్యవస్థను ప్రైవేటు సైన్యంలా వాడుకుని సోషల్ మీడియాలో చిన్న వ్యతిరేక పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేశారు. బయట పడిన కొందరు మంత్రుల సంభాషణలు, ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో, వైసీపీ ప్రజాప్రతినిధుల భాష, అహంకార ధోరణి ప్రజలకు సహించలేదు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులే లక్ష్యంగా అసహ్యకరమైన దూషణలు చేశారు. తెలుగుదేశం, జనసేన లను లక్ష్యంగా చేసుకుని కొన్ని సామాజికవర్గాలపై చేసిన అనైతిక విమర్శలు ఆయా సామాజిక వర్గాలు ఏకతాటిపై నిలచి తనపై పోరాడే పరిస్థితి తెచ్చుకోవడం జగన్ స్వయంకృతం.

ఈ అరెస్ట్ .. ఆత్మహత్యా సదృశం

2023 సెప్టెంబర్‌లో అవినీతి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం నాటి ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశ్యంగా మారింది. అరెస్టును ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుగానే ప్రజలు పరిగణించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు అండగా నిలవడం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబును కలిశాక పవన్ చేసిన ప్రకటన, తరువాత బీజేపీని కలుపుకుని ఎన్డీఏలో చేరడంతో రాష్ట్ర ప్రజల అలోచన కూడా పూర్తిగా మారిపోయింది. ఇక అక్కడ నుంచి ఒక నిశ్శబ్ద ప్రజాస్వామ్యయుత విప్లవ విస్పోటనం జరిగింది.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం

ఈ ఎన్నికల్లో వైసీపీకి బాగా డామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే వైసీపీ ప్రభుత్వం భూములను లాగేసుకుంటుందని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి. ఎన్నికల సమయంలో సీఎం జగన్ సతీమణి పులివెందులలో ప్రచారం నిర్వహిస్తుండగా స్వంత పార్టీ నాయకుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ గురించి ఆమెను ప్రశ్నించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయ్యి వైసీపీకి మైనస్ అయ్యింది. కూటమి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం కాగా, వైసీపీ సరిగా వివరణ కూడా ఇవ్వలేకపోయింది.

ఇన్ని వ్యతిరేకతల మధ్య

విపక్ష నాయకులు వివిధ పర్యటనల ద్వారా ప్రజలతో మమేకం కాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉన్న జగన్ అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు, పార్టీ నాయకులకు పూర్తిగా దూరం అయ్యారు. వ్యూహకర్తలను, సలహాదారులను, వాలంటీర్ వ్యవస్థను నమ్ముకుని పార్టీ పటిష్టతపై దృష్టి సారించకుండా నిర్వీర్యం చేయడం ఎన్నికల సమయంలో కార్యకర్తల నిర్లిప్త ధోరణికి దోహద పడింది. ఇన్ని వ్యతిరేకతల మధ్యలో కూడా వైసీపీకి 39.37 శాతం ఓట్లు రావడం గమనార్హం. ప్రభుత్వ పనితీరును బట్టి స్పందిస్తున్న సుమారు 15 శాతం మంది తటస్థ ఓటర్లు గెలుపోటములలో కీలక పాత్ర వహిస్తున్నారు, ప్రజాస్వామ్య పాలన చేయకపోతే గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు. దీన్ని గమనించుకుని సరిదిద్దుకోవడం విజ్ఞుల లక్షణం.

లింగమనేని శివరామ ప్రసాద్

79713 20543

Advertisement

Next Story

Most Viewed