ఓటరంటే ఒక్కరోజు మహారాజేనా?

by Ravi |   ( Updated:2024-10-19 01:15:28.0  )
ఓటరంటే ఒక్కరోజు మహారాజేనా?
X

సామాన్యుడా.. నీవు ఒకే ఒక్కరోజు మహారాజువి! ఆ ఒక్క రోజులో నువు తారాజువ్వలా వెలిగిపోతావ్. ఆ రోజునే నువ్వు రారాజులా మెరిసిపోతావ్. ఆ రోజునే వందేళ్ల సంతోషానికి శ్రీమంతుడివి. ఆ అనుభూతితో మురిసిపోతావ్. తన్మయత్వంతో నిన్ను నీవు మైమరిచిపోతావ్. అదే నువ్వు ఓటు వేసే రోజు. ఓటుకు నిన్ను నీవు అమ్ముకునే రోజు. తలకు మించి తట్టెడు బాధల్లో వుండే నీవు హక్కులన్నీ పోగొట్టుకున్నావ్. ప్రశ్నించే హక్కు ఎక్కడా లేదు. పొరపాటున కూడా ఎన్నికల్లో కనీసంగా, కనిష్టంగా పంచాయితీ బోర్డు మెంబర్‌గా కూడా పోటీ చేయలేవు. ఎందుకంటే నీ దగ్గర ఓట్లుకొనే సొమ్ముల్లేవ్. ఆ సొమ్ములున్న ఆసామీ నిలబెట్టే బొమ్మ నీవు. నిలబెట్టే హక్కు వారిది, గెలిపించే హక్కు వారిది. కూర్చునే హక్కు మాత్రం నీకు లేదు, కేవలం నిలుచునే హక్కుకే నువ్వు పరిమితం. పరిధులు దాటి మాట బయట వదిలావో తోకలు కత్తిరిస్తార్రోయ్.

లిక్కర్ షాపుకు దరఖాస్తు చేయాలంటే రెండు లక్షలుండాలి... డిప్ దక్కకుంటే ఆ లక్షలు వదులుకోవాల్సిందే.. ఇది సామాన్యుడికి సాధ్యమయ్యేదేనా? దరఖాస్తు సొమ్ము వెనక్కి ఇచ్చేది లేదనడం ప్రజాస్వామ్యమా? అంటే మామూలు ప్రజలెవ్వరూ బ్రాందీ షాపుకు యజమాని కావాలనుకోవడం దుస్సాహసమే! వేలమంది ఒక్కటై దరఖాస్తు చేసినా చీటీ నిన్ను వరించదు. అదొక గారడీ. ఆ చీటీలన్నింటిలో అధికార బ్రహ్మలచే కలిమిగల వాళ్ల పేర్లు, కావల్సినోళ్ల పేర్లు రాసి పెట్టపెడతాయ్. లాటరీ తీసిన చేతుల్లో ఏమీ వుండదు, త్రిశంకు స్వర్గం నుంచి వచ్చిన పేర్లవి. అరే నాయనా... నువ్వు తాగుబోతువు కావడానికే, కిక్కు ఎక్కించుకోవడానికే నీకు హక్కు. తాగి తల తిరిగి మెదడు మొద్దుబారి పిచ్చోడిలా రోడ్ల వెంట తిరిగేందుకే నీకు హక్కు. ఆదమరిచి అర్ధరాత్రి దాకా తిరక్కురోయ్! పోలీసులకు తిక్కరేగితే కేసు పెట్టి తెల్లవారే దాకా లోపలేస్తారు జాగ్రత్త.

సేవకుడివి... నీకెందుకు కుటుంబం?

సామాన్యుడా! నువ్వు ఈ మట్టి నుంచి వచ్చావ్. తిరిగే మట్టిలోకే వెళ్తావ్. నువ్వు పుట్టింది మాన్యులకు సేవలు చేయడానికే. నీకు ఆలోచనలుండకూడదు. ఈ దేశంలో నీవొక భౌతిక వస్తువు. నీ గురించి గానీ నీ కుటుంబం గురించి కానీ ఆలోచించే హక్కు నీకు లేదు. ఈ ప్రకృతిలో నీవు పుట్టింది ధనికులకు దాస్యం చేయడానికే! నీ బిడ్డల జీతాలు, జీవితాలు కూడా అందుకే. నీకు సొమ్ములేందుకు? అసహజమైన సోకులెందుకు? నిలువ నీడలేని నీకు ఊహలెందుకు? విలాసాలపై మోజులెందుకు? నిర్జనాకాశంలో షికార్ల కోరికలెందుకు? నీవు ఒకే ఒక్కరోజు మహారాజువి! ఆ ఒక్కరోజులో నువు తారాజువ్వలా వెలిగిపోతావ్. ఆ రోజునే నువు రారాజులా మెరిసిపోతావ్. ఆ రోజునే వందేళ్ల సంతోషానికి శ్రీమంతుడివి. ఆ అనుభూతితో మురిసిపోతావ్. తన్మయత్వంతో నిన్ను నీవు మైమరిచిపోతావ్. అదే నువు ఓటు వేసే రోజు. ఓటుకు నిను నీవు అమ్ముకునే రోజు. తలకు మించి తట్టడు బాధల్లో ఉండే నీవు హక్కులన్నీ పోగొట్టుకున్నావ్. కనీసం నువ్వు అందంగా పుట్టి సినిమా యాక్టరువై వున్నా నీ చుట్టూ వుండే పిచ్చి జనం నీకు ఓట్లేసే వారేమో? నువ్వు టికెట్ తీసుకొని రెండు గంటల సేపు అనిర్వచనీయ ఆనందాన్ని, మధ్యలో విషాదపు గుళికలకు నాలుగు కన్నీటి చుక్కలు విడిచేందుకే తప్ప మరెందుకూ యజమానిని కావు.

భాగ్యం కలవాడిదే భోగం!

అయినా నీకు అందమెలా వస్తుంది? ఈ దేశపు మూలవాసులకు, దాస్య మూకలకు అందచందాలెలా అంటుతాయ్. నాసిరకం అంగడి సరుకులతో, మూసీ నదుల్లాంటి మురికి కాలవల సందు గొందుల్లో తిరుగాడే నీకు సహజ సౌందర్యమే తప్ప సినిమా యాక్టర్ వయ్యే అంగాంగ సౌందర్య సౌష్టవాలు నీకెలా సంక్రమిస్తాయి? నీవేమైనా దివ్యౌషధం సేవించే మహామనిషివా? కాబట్టి నువ్వు దాసి కొడుకువైనా పర్వాలేదు, కాసులు కలవాడే అయ్యుండాలి. నీ సంపాదన కార్పొరేట్ ఉత్పత్తులను కొనడానికే. నీ అర్జన జబ్బొస్తే ఆస్పత్రులకు ఫీజులు కట్టడానికి. నీ బిడ్డల ఇంగ్లీషు చదువులకు మూల్యం చెల్లించడానికి. నువ్వు పుట్టింది బిల్లులు కట్టడానికి. నువు పెరిగేది జీఎస్టీ కట్టడానికి. నీ కన్నుల్లో కారే నీరు, నీ శరీరం నుంచి జారే స్వేదం ఈ భూమ్మీదకు జాలువారేదే. కాబట్టి కనీసం నీ కన్నీరు, నీ స్వేదం ఇంకి ఆవిరి కావాల్సిందే. అది కూడా నీకు సొంతం కాదు.

ఊహల్లోనూ యజమాని కాలేవ్!

కొండల మీద ఎత్తులు, అక్కడి నుంచి దిగజారే జలపాతాలు, అక్కడి చెట్ల సంపద, అడవి కాచిన వెన్నెల అన్నీ సోయగాలకు చిరునామాలే! ఆ భూతల స్వర్గానికి నువ్వే ఒకప్పుడు రాజువి, మంత్రివి, సామంతుడివి. కానీ ఇప్పుడు వాటికి నువు యజమానిని కావు. కావాలని వూహల్లో కూడా ఎప్పుడూ అనుకోకు. నాగరికత, చట్టాలు, పెరిగే ధరలూ, కొత్తరోగాలతో వచ్చే చావులూ, నిబద్ధత లేని పాలన నీ హక్కులను ఎప్పుడో ఊచకోత కోశాయి. పరాయి పాలన నుంచి బయటపడిన నువు విముక్తం కానీ ఓటున్న మనిషివి. అసలుసిసలు పరాన్న జీవిని. కూలీన సంస్కృతిలో అలంకృత ప్రాణివి. పుట్టుకే నీ చేతుల్లో ఉంటుంది. నీ బ్రతుకు, నీ చావు అన్యాక్రాంతం. తెల్ల, నల్ల కోట్ల సమాగమంతో సాగుతున్న విశృంఖల దోపిడీ సమాజంలో నువ్వెక్కడ ఎదుర్కొంటావ్? విశ్వరూపం దాల్చిన అవినీతిని ఢీకొని నిలబడగలవా?

కళ్లు తెరిచే ముందే జీవితం ముగింపు

కులాలు, మతాలు, జాతులు, వర్ణాలు, దేవుళ్ళూ, సైతాన్లు వంటి కొందరు సృష్టించిన అధ్యాయంలో నువు అ....ఆ...లు నేర్చుకునే నిత్య విద్యార్థివి. గాండ్రించి ఉమ్మేసినా పీఠాలు వదలని నేతలు, వారికి కవచంలా కాపాడే మతాల డేరాలు, విభూది బాబాలు, దేశాలు... సరిహద్దులు ...ప్రహసనంగా సాగే ఎన్నికల బ్యాలెట్లు, అక్రమార్జిత డొనేషన్లతో పునీతమయ్యే పాలకులు... బ్యాంక్ బ్యాలెన్సులు... వంటి వైకుంఠపాళీలో నిన్ను కుబుసం విడవని మిన్నాగులు మింగేస్తాయ్. సిద్ధాంత నిబద్ధత లేని రాజకీయ దుర్వాసనను నువ్వెప్పటికీ పసిగడతావో. నువ్వు ఎప్పటికో కళ్లు తెరుస్తావ్? ఈలోపు వందేళ్లనుకునే నీ జీవితం అర్ధ శతకంలోపే ముగిసిపోతుంది. నీ కలలు, కన్నీళ్లు, నీ ఊహలు, నీ ఊసుల చిత్రాలు చిద్రమై చరిత్ర రాయని అక్షరాలుగా మాయమవుతాయి.

- మోహన్ దాస్

94908 09909

Advertisement

Next Story

Most Viewed