హైదరాబాద్‌లో పోలింగ్ తగ్గడానికి లోపం వ్యవస్థలోనా.. సమాజంలోనా..?

by Ravi |   ( Updated:2024-05-16 01:15:39.0  )
హైదరాబాద్‌లో పోలింగ్ తగ్గడానికి లోపం వ్యవస్థలోనా.. సమాజంలోనా..?
X

రాజకీయాల్లో ప్రజాభీష్టం వ్యక్తం కావడం కోసం భారత రాజ్యాంగం మేరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంటుంది. ఈ ఎన్నికల కోసం వివిధ పార్టీలు ఖర్చుకు వెనుకాడకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటాయి. అధికారమే పరమావధిగా అన్ని యుక్తులు ప్రదర్శించి తమ పార్టీని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తుంటాయి.

అయితే, పార్టీల బాధలు పార్టీలకుంటే.. నగరాల్లో ఉండే ఓటరు ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం విస్మయం గొలుపుతుంది. పల్లెలు, కుగ్రామాల్లో ప్రజలు ఓటు వేసేందుకు బారులు తీరుతుంటే.. మహానగరాల్లో మాత్రం పోల్ డేను హాలీడేగా ఎంజాయ్ చేయడం మారుతున్న జీవనశైలికి, అక్కడి వారి మనోభావాలకు అద్దం పడుతుంది. వారికి పార్టీల పట్ల వ్యతిరేకతో.. ఓటు వేయడానికి నిరాసక్తతో తెలియదు కానీ.. ప్రశ్నించే తత్వం మాత్రం కోల్పోతున్నామన్నది జగమెరిగిన సత్యం.

ఓటేయడం కష్టం కాదు..

కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు ఓటు వేయాలంటే కిలోమీటర్ల కొద్ది నడిచి, తాము ఓటేయాల్సిన కేంద్రాన్ని వెతుక్కుని, భారీ క్యూలో నిలబడి, ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రహసనంగా ఉండేది. కానీ నేడు భారీ మార్పు.. చేతిలో ఉండే సెల్ ఫోన్లోనే సమస్త సమాచారం. వంద, రెండు వందల మీటర్ల దూరంలోనే పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికల అధికారుల సూచనలు.. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో తెలుసుకునే మేధాసంపత్తి ఉంది. అయినా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే తీరిక, సమయం దొరకదు ప్రజలకు దొరకడం లేదు. తెలంగాణ జిల్లాల్లో ఏ ఎన్నికలు జరిగినా 70 నుంచి 80 శాతం ఓటింగ్ పోలవుతున్నా నగరంలో మాత్రం 50 శాతానికి మించడం లేదు. ఓటింగ్ జరిగే రోజును నగరవాసులు కేవలం హాలీడే గా భావిస్తున్నారా.. లేదా కాలక్షేపం కోసం వద్దనుకుంటున్నారా? అన్న మీమాంస కలుగుతుంది. ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ ఎంతో అవగాహన పెంచినా.. నగరవాసులు గుర్తించకపోవడం వ్యవస్థలో లోపమా.. సమాజంలో లోపమా? అన్నది తేలాలి.

బాధ్యతను విస్మరించి..

ఆధునికతకు దూరంగా నిరక్షరాస్యులైన తెలంగాణ గ్రామీణులు అంచనాకు అందకుండా ఓటు వేసేందుకు ముందుకువస్తుంటే.. నగరంలో నివసిస్తున్న, ప్రజా సమస్యలపై అంచనా ఉన్న విద్యావంతులు మాత్రం ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. కోటి మందికి పైగా ఓటర్లున్న హైదరాబాద్ నగర వాసులు ఏ ఎన్నికలు జరిగినా 50 శాతం మించకపోవడం విడ్డూరంగా ఉంది. గ్రామీణులు బాధ్యతగా వ్యవహరిస్తుంటే.. నగరవాసులు మాత్రం బాధ్యతను విస్మరిస్తున్నారు. అభివృద్ధిలో, నాగరికతలో, టెక్నాలజీలో, సోషల్ మీడియాలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ముందుండే వీరు.. తమ విలువైన ఓటుహక్కును మాత్రం వినియోగించుకోలేకపోతున్నారు. రాజకీయాలన్నీ ఇప్పుడు ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలిసిపోతుంది. పల్లెల్లో, గ్రామీణుల్లో ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసినా.. వారి స్పందన వేరు.. నగరవాసుల స్పందన వేరు. కమ్యూనిటీ గ్రూపుల్లో రాజకీయాలపై చర్చోపచర్చలు చేసే నగరవాసులు, అందుకు అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నప్పుడు ఓటు వేసేందుకు మాత్రం వెనకడుగు వేయడం విస్మయం గొలుపుతుంది.

ఓటేయడానికి 16 కిలోమీటర్లు నడిచొచ్చి..

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గుట్టలపై దశాబ్దాలుగా నివసిస్తున్న గిరిజనులు మూడు గుట్టలు, మూడు వాగులు దాటి దాదాపు 16 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి మండల కేంద్రంలోని జంగాలపల్లి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాల్వంచలో సోడా వెంకటమ్మ అనే వంద సంవత్సరాలు దాటిన వృద్దురాలు ఇద్దరి సహాయంతో వచ్చి ఓటు వేసింది. భద్రాచలంలోని ఉంజుపల్లి అనే మావోయిస్టు ప్రభావిత గ్రామంలో 81.55 శాతం ఓటింగ్ నమోదైంది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఓటింగ్ రోజు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. కానీ నగరవాసులు మాత్రం ఇవేవీ తమకు పట్టనట్టుగా, ఎన్నికల వ్యవస్థే తమకూ, తమ వ్యవహారశైలికి వ్యతిరేకమన్నట్లు భావిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓటర్ ఐడీ ని కేవలం తమ ఐడెంటిటీ కోసం మాత్రమే వాడుతున్నారు. దేశ పౌరునిగా ఉన్న బాధ్యతలను విస్మరిస్తున్నారు.

గెలుపోటముల్లో భాగస్వామ్యం కావాలి!

ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా నగర ఓటర్ల చెవికెక్కడం లేదు. ఏ ఎన్నికలు జరిగినా 50 శాతం కూడా ఓట్లు పోల్ కాకపోవడానికి కారణాలు అనేకం కావచ్చు, ఎవరు గెలిచినా ప్రయోజనమేమి లేదన్నది నగర ఓటర్ల భావనై ఉండొచ్చు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అవినీతి, అక్రమాలు కామనే అనే నిరాశా కావొచ్చు, లేదా ఏ నాయకుని మీదా సదభిప్రాయం ఉండకపోవచ్చు. అలా అని నగర ఓటర్లు సమాజంలో భాగం కాకుండా పోరు కదా? అని ప్రజాస్వామికవాదులో ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తమ భవిష్యత్ కోసం ఐదేళ్లు పాలించే నాయకుని కోసం వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఊక దంపుడు ఉపన్యాసాలు, చర్చలు, నాయకులు లేదా పార్టీ గెలుపోటముల మీద అంచనాలు కాదు ఆ గెలుపోటముల్లో కూడా నగర ఓటరు భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ పాలసీలు పల్లెలకు మాత్రమే కాదు.. పట్టణంలో ఉన్న తమకూ వర్తిస్తాయని భావించాలి. తాము ఆచరిస్తూ పది మందిని ఆచరింపజేసే గుణం పెరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం కాపాడిన వారమవుతాం. అందులో మనమూ భాగమవుతాం.

సాగర్ దువ్వ

సీనియర్ జర్నలిస్ట్

8096677477

Advertisement

Next Story

Most Viewed