- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవి చార్జీ మెమోలా.. చార్జిషీట్లా?
గత వారం నుంచి ఫలానా జిల్లాలో ఇంతమందికి, మరో జిల్లాలో ఇంతమందికి ఛార్జి మెమోలు ఇచ్చినట్లు సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారులే పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు. పోలీసులు నేరస్తులను పట్టుకున్నట్లు, కోర్టులో చార్జిషీట్లు వేసినట్లుండే తతంగం. ఎంత కష్టించి పనిచేసినా కనీస గుర్తింపు లభించకపోగా, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు చర్యలు చేపట్టడంలో ఔచిత్యమేంటి? ఈ అడ్డగోలు వ్యవహారానికి ముగింపు ఎక్కడ?
సమాజానికి ఒక నీతిని, నిజవర్తనను, ఒక స్పృహను, ఒక చైతన్యాన్ని రగుల్కొలిపే స్ఫూర్తి ప్రదాతలు ఉపాధ్యాయులు. ప్రతి మనిషిని జీవన ఋజుమార్గంలో నడిపించేందుకు తాను కాలుతూ అందరికీ వెలుగులు పంచే దివిటీలు ఉపాధ్యాయులు. వారు సామాజిక స్పృహ కలిగిన కార్మికులు. స్వీయ నియంత్రణ కలిగిన బాధ్యతాయుత పౌరులు. అవినీతి మాలిన్యం అంటని ధృవతారలు. చరిత్రలోనే వారిదొక ప్రత్యేక అధ్యాయం. కానీ ఈనాడు వారిని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. బానిసలుగా భావిస్తూ కించపరచాలని పరదాల చాటున మాటువేసిన కొందరి ఫర్మానాలను తలకెక్కించుకుని విషం కక్కుతున్నారు అది వేరే విషయం. ఆలసత్వం ప్రదర్శించే వారికి అండగా నిలబడటం కాదు నా ఉద్దేశ్యం. బోధనను విస్మరించిన వారిని వదిలేయండని చెప్పడం కాదు. పొరపాట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో నిబద్ధత, చట్టబద్దత, నైతిక విలువలు ప్రతిక్షేపింపబడాలనేది నా ఉద్దేశ్యం. ఏళ్ల తరబడి సృజనాత్మక బోధన చేసినవారిని చిన్న తప్పిదాలను చూపి దోషులుగా ప్రజల ముందు నిలబెట్టే చర్యలు సహేతుకం కాదని స్పష్టంగా చెప్పడమే నా అభిమతం!
టీచర్లు మీ దృష్టిలో దోషులా?
క్రమశిక్షణతో మెలిగే ఉపాధ్యాయవర్గంపై విద్యాశాఖ అధికారులు ఎందుకింత అనుచితంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఆవేశంతో రగిలిపోతూ రక్తపోటు పెంచుకుంటున్నారు? ఉపాధ్యాయులను సమాజం ఎదుట దోషులుగా నిలబెట్టేందుకు చేస్తున్న ఏకపక్ష యుద్దానికి కారణమేంటి" పత్రికాప్రకటనలతో, యూ ట్యూబ్ చానెళ్లలో వెక్కిరిస్తూ వార్తలకెక్కిస్తూ అధికారాన్ని ఎందుకు ఫణంగా పెడుతోంది ప్రభుత్వం? అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సింది ఎవరు? వ్యవస్థలను దిగజార్చడం సమర్ధనీయమా ఆయా అధికారుల తనిఖీల్లో నైతికత ఉందా? రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పరివారం మొత్తం తనిఖీల పేరుతో ఒక్కసారిగా ఉప్పెనలా పడి ఏం బావుకోవాలనుకుంటున్నారు . నోరూ... వాయిలేని టీచర్లను, నిబద్ధతకు మారుపేరైన టీచర్లను తప్పుడోళ్లగా చిత్రీకరించడానికి, బడిలో అసలు చదువే చెప్పడం లేదని బదనాం చేయడానికి మీకు మనసెలా ఒప్పుతోంది?
ఉపాధ్యాయులు గుడ్డెద్దులు కాదు...
ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరిస్తున్నామని, ఉపాధ్యాయుల చేత బాగా పని చేయిస్తున్నామని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే అని మీరు ముక్తాయింపు ఇచ్చుకోవచ్చు. విద్యుక్తధర్మ నిర్వహణలో భాగమని అధికారులు సమర్ధించుకోవచ్చు. ప్రజలకోసమని సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి ఉపాధ్యాయుల మీద మోపిన పనిభారం ఎంత, సిలబస్ భారమెంత, అదనపు బోధనేతర బాధ్యతల భారమెంత, యాపుల భారమెంత, వీటన్నింటినీ ఒకసారి మానవీయ కోణంలోనూ, శాస్త్రీయంగానూ ఆలోచించాలి. ఆచరణలో సాధ్యాసాధ్యాలపై విశ్లేషణ జరగాలి. ఉపాధ్యాయులు యంత్రాలు కారు. మరమనుషులు కారు. ఒక మనిషి సజావుగా పనిచేయగలిగిన సమయమెంతో శాస్త్రీయంగా నిర్ధారించాలి. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయగలిగిన పరిస్థితులను విశ్లేషించాలి. విద్యార్థుల గురించి బహుశా పూర్తిస్థాయిలో అలోచించేది, సమాజాన్ని ఉద్ధరించాలని తపించేది వాస్తవానికి ఉపాధ్యాయులే! జీతమిస్తున్నాం కదా అని బండెడు భారం మోపితే మోయడానికి ఉపాధ్యాయులు గుడ్డెద్దులు కాదు కదా! వాస్తవానికి ఇదొక ఎత్తుగడ. ఇవి సాధింపు చర్యలు. పిఆర్సీలో అన్యాయంపై ఉద్యమ రూపం ఇచ్చిన పాపానికి ప్రతిఫలం. అందుకోసం విలువల్లేని అధికారులను ఉసిగొల్పిన ఉదంతమనేది జగమెరిగిన సత్యం! తమ లోపాలను సరిదిద్దుకోవడాలికి బదులు ఉపాధ్యాయులలో తప్పులు వెదికి అణిచివేసే కుట్ర! ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తూ మరోవైపు ప్రశ్నించే గొంతుకలను నులిమేస్తూ పనిచేయట్లేదనే విషం కక్కుతూ... ఎందుకీ రాక్షసానందం? ఒక దెబ్బకి రెండు పిట్టలు. లోపాయకారి ఒక ఎత్తుగడ. ఈ మొత్తం వ్యవహారంలో కార్యకారణ సంబంధం పసిగట్టలేని స్థితిలో ఉపాధ్యాయులున్నారని అనుకోకూడదు. ప్రస్తుత వ్యవహారాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. చర్యల్లోని డొల్లతనాన్ని, దొరతనాన్ని వారు గ్రహించారు.
రానున్న ఎన్నికల్లో ఉపాధ్యాయులను విధులకు దూరంగా పెట్టాలి. ఆ మేరకు బోధనేతర విధులనుంచి తప్పిస్తున్నామని ఉత్తర్వులలో సెలవిచ్చారు. స్వాతంత్ర్య కాలం నుంచి ద్విగ్విజయంగా, ద్విగుణీకృత ఉత్సాహంతో ఎన్నికల విధులను ఒంటిచేత్తో నడిపిన ఉపాధ్యాయులను ఈ దఫా ఎందుకు దూరంగా పెట్టాలనుకుంటున్నారో జగమెరిగిన సత్యం. అయినా ముంజేతి కంకణానికి అడ్డమెందుకు? అయినప్పటికీ ఎన్నికల సంఘం ఉపాధ్యాయుల జాబితాను అప్లోడ్ చేయాలని జిల్లా అధికారులను నిర్ధేశించిన నేపథ్యంలో దాడులకు పదును పెట్టారు. సిలబస్ పూర్తికాలేదని వారిని ఎన్నికల విధుల్లో నియమిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నివేదించి వారి సేవలను నిరోధించడానికి ముందస్తు ఎత్తుగడగా ఉపాధ్యాయులపై ఈ దాడులు, నివేదికలు.
ఉపాధ్యాయ సోదర సోదరీమణులారా!
మీకు అండగా మేమున్నాం. అధైర్య పడకండి! సంయమనంతో, బాధ్యతాయుతంగా పని చేయండి. చట్టప్రకారం చార్జి మెమోలకు ధీటుగా బదులివ్వండి. లోపాలను ఎండగట్టండి. ఉపాధ్యాయుల హక్కులను తాకట్టు పెట్టిన సంఘాలు, నిద్ర నటిస్తున్న నాయకులు బాధ్యతగా ఆలోచించాల్సిన సమయమిది. పాలకవర్గ సపర్యల్లో మునిగితేలుతున్న, కష్టకాలంలో అండగా నిలవని నాయకులను ఉపాధ్యాయ లోకం క్షమించబోదు. కాసులకు కక్కుర్తి పడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన వారికి తోడుగా తిరగడం. ఇప్పటికైనా ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన సమయమిది. ఆ దిశగా ఆలోచించని వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించువాల్సిందే!
మోహన్ దాస్,
రాష్ట్ర కౌన్సిలర్, ఏపిటిఎఫ్ 1938
94908 09909