పక్కా ప్లానింగ్‌తోనే..రాహుల్‌ని ఇరికించారా!?

by Ravi |   ( Updated:2023-03-29 11:32:26.0  )
పక్కా ప్లానింగ్‌తోనే..రాహుల్‌ని ఇరికించారా!?
X

బీజేపీ రాహుల్‌కి వ్యతిరేకంగా చేస్తున్న దాడులను రాహుల్ తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. ఇప్పటికే ఆయనను టార్గెట్ చేస్తూ చేసిన ఏ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. కానీ రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బయటికి పంపించాలనే కలను ఎట్టకేలకు కాషాయదళం నెరవేర్చుకుంది.. అయితే ఈ శిక్షను సైతం రాహుల్ సదవకాశంగా మల్చుకునే అవకాశముంది.

ఎన్నో రకాలుగా బెదిరించి..

బీజేపీ భవిష్యత్తులో తన రాజకీయ భవిష్యత్‌కి రాహుల్ గాంధీ వల్లే ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి రాహుల్‌పై దాడులు చేస్తున్నది. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆయనను 50 గంటలు ప్రశ్నించినా ఏ ఆధారాలు దొరక్కపోవడంతో కేసు నమోదు చేయలేకపోయారు. అలాగే భారత్ జోడో యాత్రలో కొంతమంది మహిళలు చేసిన ఫిర్యాదులపై రాహుల్ గాంధీ మాట్లాడినందుకు, ఆయన ఇంటికి పోలీసులను పంపించారు. లండన్‌లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయనను లోకసభ నుంచి బహిష్కరించాలనే డిమాండ్‌ను సైతం తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఇవేవి ఫలించలేదు. దీంతో 2019లో పెట్టిన పరువునష్టం కేసును ఇప్పుడు తెరమీదకు తెచ్చేలా చేసి ఆ వ్యాఖ్యలపై సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించేలా చేశారు. దీంతో పాటు ఆగమేఘాల మీద పార్లమెంట్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. అయితే ఈ శిక్షపై అప్పీలు చేశారు రాహుల్. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టులో కూడా అలాంటి తీర్పే వస్తే, రెండేళ్ల శిక్షతో పాటు, ఎనిమిదేళ్ల పాటు ఆయన రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. ఇదంతా బీజేపీ పార్లమెంటులో, బయట రాహుల్ గాంధీని ఎదుర్కొనే దమ్ము లేక పక్కా ప్లానింగ్ తోనే పావులు కదిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌ గాంధీని బెదిరించి, భయపెట్టి తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలుగా అర్థమవుతున్నది. తన మీద చేసిన ఆరోపణలకు పార్లమెంటులోనే జవాబు చెబుతానన్న రాహుల్‌ గాంధీని అసలు పార్లమెంటులోకి అడుగుపెట్టకుండా చేయాలన్న బీజేపీ వ్యూహానికి అనుగుణంగా ఈ పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఒక ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకు ఓ ఎంపీకి రెండేళ్ళ జైలుశిక్ష విధించడం భారతీయ‌ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?

ఇప్పటికే కేంద్రంలో మూడోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, అందుకనుగుణంగా పావులు కదుపుతున్నది. అయితే, రాహుల్ గాంధీ వల్లే తమకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించి. అందుకు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయాలనుకొని పావులు కదిపింది. రాహుల్ గాంధీని మొదట ‘పప్పు’గా ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాలలో రాటుదేలడం చూసి భయానికి గురయినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. పార్లమెంట్ లోపల, బయట రాహుల్ గాంధీ సంధిస్తున్న వరుస ప్రశ్నలు బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా మోడీ- అదానీ స్నేహం గురించి ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి, ఆ దేశం నుంచి అదానీకి అందుతున్న కాంట్రాక్టుల గురించి వివరించారు. అంతేకాకుండా అదానీ స్కామ్‌లో జేపీసీ వేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

అయితే ఎన్నికల్లో ప్రచారం, జోడో యాత్రలో రాహుల్ కి వచ్చే పబ్లిసిటీ కంటే బీజేపీ చేస్తున్న ఈ చర్యల వల్లే ఎక్కువ పేరు వస్తుంది. గతంలో వామపక్షాలు సైతం చేసిన తప్పును ఇప్పుడు బీజేపీ చేస్తున్నట్లు అనిపిస్తుంది. గతంలో కేవలం గుజరాత్‌కే పరిమితమైన నరేంద్ర మోడీని మాటిమాటికి విమర్శించి వామపక్ష నాయకులు, ఆయనను దేశ్‌కి నేతగా చేసేశారు. ఇప్పుడు రాహుల్‌ను టార్గెట్ చేస్తున్న బీజేపీ.. అదే స్థాయిలో అతనికి పబ్లిసిటీ ఇస్తున్నది.

సదవకాశమే..!

బీజేపీ చేస్తున్న వరుస దాడులు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుకు సదవకాశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్, కాంగ్రెస్‌ను బలహీనపర్చడం ద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నదని దీంట్లో భాగంగానే రాహుల్‌పై అనర్హత వేటు వేసిందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ తీసుకున్న ఈ చర్యను ప్రతిపక్షాలన్నీ ఖండిస్తున్నాయి. రాహుల్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ప్రతిపక్షాలను సంఘటితం చేయడం ద్వారా రాహుల్ గాంధీ మరింత బలోపేతం కావచ్చు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నందున రాహుల్‌ వేసే అడుగులే మున్ముందు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తాయి.

ఇవి కూడా చదవండి: మారిన రాజకీయ పరిస్థితులు... జగన్ భయమేంటి?

- ఫిరోజ్ ఖాన్

96404 66464

Advertisement

Next Story

Most Viewed