Revanth Reddy: కూతురి లక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్

by Ramesh N |   ( Updated:2025-04-14 07:06:10.0  )
Revanth Reddy: కూతురి లక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేషన్ దుకాణాల్లో కొన్నేళ్లుగా దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో సగానికిపైగా లబ్దిదారులు వాటిని తినేందుకు ఇష్టపడేవారు కాదు. చాలా మంది వ్యాపారులు, డీలర్లకు ఆ బియ్యాన్ని విక్రయించే వారు. ఈ బియ్యం మిల్లులకు చేరి రీసైక్లింగ్ చేసి తిరిగి సర్కారుకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉండేది. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో రేషన్‌కార్డుల లబ్దిదారులు సంబర పడుతున్నారు. గతంతో పోల్చితే సన్నబియ్యం తీసుకునేందుకు పేదలు ఉత్సాహం చూపుతున్నారు. రేషన్ షాపులకు లబ్దిదారులు వరుస కడుతున్నారు. ఇప్పటికే 50 శాతం మందికి పైగా పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇక బహిరంగ మార్కెట్‌పై సన్న బియ్యం పంపిణీ ప్రభావం పడిందని, కిలోకు రూ. 5 మేర ధర తగ్గిందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సన్నబియ్యం లబ్ధిదారులే.. మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. ‘సిద్దిపేట జిల్లా, అక్బర్ పేట గ్రామానికి చెందిన కూతురి లక్ష్మికి నా ప్రత్యేక అభినందనలు. తనకు వచ్చిన 24 కిలోల సన్నబియ్యం తో ఆమె ఊరందరికీ సహపంక్తి భోజనం పెట్టి ఈ పథకం పేదల జీవితాల్లో ఎంతటి ఆనందాన్ని నింపిందో చెప్పే ప్రయత్నం చేసింది’ అని ఆమెను సీఎం ప్రశంసించారు. కాగా, సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట గ్రామానికి చెందిన లబ్ధిదారు కూతురి లక్ష్మి.. తనకొచ్చిన 24 కిలోల సన్న బియ్యంతో ఆదివారం వంట చేసి గ్రామస్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. సుమారు 130 మందికి భోజనం చేసినట్లు సమాచారం. వారింట్లో లక్ష్మి, ఆమె కుమారుడు, కోడలు, మనవడు ఉంటారు. ఆమె వారం నాడు జరిగే అంగడిలో చేపలు శుభ్రం చేసిచ్చే పని చేస్తుంటారు. అయితే ఆమె సన్న భియ్యంతో భోజనం పెట్టిన తీరుపై కాంగ్రెస్ నేతలు, గ్రామస్థులు ప్రశంసలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ విషయం సీఎం దృష్టికి రావడంతో లక్ష్మిని అభినందించారు.



Next Story

Most Viewed