- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యమేనా!?
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ తెచ్చాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వాట్ నెక్స్ట్.. అనే చర్చ జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొదటిసారి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.
జాతీయ అంశాలే ప్రధానంగా..
అయితే దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడ ఏ రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలు జరిగినా ముఖ్యంగా ప్రాంతీయత, స్థానిక విషయాలే ప్రధాన ఎజెండాగా ఎన్నికలు జరుగుతాయి. అదే విధమైన ఫలితాలు కూడా వస్తాయి. అదే దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయత, జాతీయ అంశాలే ప్రధాన ఎజెండాగా ఉంటాయి. అందుకే రాష్ట్ర అసెంబ్లీలలో 50% పైగా ఓటు షేర్ సాధించిన ప్రాంతీయ పార్టీలను కాదని లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల వైపు ఓటర్లు మొగ్గుచూపుతారు. ఉదాహరణకి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన 119 అసెంబ్లీ స్థానాలలో 88 మంది గెలిచారు. అంటే దాదాపు 47% ఓటింగ్ పొందింది. కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2 , ఇతరులు రెండు సీట్లు, బీజేపీ 1 సీటుకి మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని, ఫెడరల్ ఫ్రంట్ అని, కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నయంగా మూడో కూటమి అంటూ కేసీఆర్ సారు..కారు..పదహారు.. ఢిల్లీలో సర్కార్ అంటూ ప్రచార ఆర్భాటాలు చేశారు.. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన జాతీయ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సరిగ్గా ప్రచారం చేయకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను తెలంగాణ ప్రజలు ఎంపీలుగా గెలిపించి లోక్‌సభకి పంపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ సీట్లను, కాంగ్రెస్ ముగ్గురు ఎంపీ సీట్లు గెలుచుకుంటే అధికార తెరాస పార్టీకి 2014లో వచ్చిన సీట్ల కన్నా మూడు సీట్లు 6% ఓటు బ్యాంక్ తగ్గించి 41% ఓటు షేర్ తో 9 సీట్లకు పరిమితం చేశారు.
ప్రయోజనం ఎవరికి?
ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వాదాన్ని వదలి జాతీయ వాదాన్ని ఎత్తుకుని దేశ రాజకీయాలు, గుణాత్మక మార్పు అంటూ ఉద్యమ పార్టీ పేరు నుండి తెలంగాణ పదాన్ని తొలిగించి మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు.షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. అయితే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంటూ కొన్ని రోజులు హడావిడి చేసిన బీజేపీ ఇప్పుడు మిన్నకుండిపోయింది. ఒకవేళ ఈ ఐదు రాష్ట్రాలతో పాటు, 2024లో లోకసభ ఎన్నికలతో పాటు జరిగే మరో నాలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే దాదాపు పది రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగడం (వన్ నేషన్ వన్ ఎలక్షన్ ) వల్ల కలిగే లోటుపాట్లు, లాభ నష్టాలను కేంద్ర ఎన్నికల సంఘం బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలే లబ్ధి పొందుతాయన్న మాటనీ కొట్టిపారేయలేం..
ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్రాల లోక్‌సభ సభ్యుల సంఖ్య ఒకసారి పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్ -29, రాజస్థాన్ -25, తెలంగాణ -17, ఛత్తీస్ గడ్ -11, మిజోరాం -1. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ రాష్ట్రాల్లోని 83 లోక్‌సభ స్థానాల ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా జాతీయ అంశాలే తెరపైకి వచ్చి అవే కీలకం అయ్యి ఫలితాలను కూడా ప్రభావితం చెయ్యొచ్చు. మొత్తం 543 స్థానాలున్న లోక్‌సభలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే 272 సీట్లు గెలవాలి. పైన ఉన్న 5 రాష్ట్రాల లోక్ సభ 83 ఎంపీ సీట్లు జమిలి ఎన్నికల ద్వారా జరిగితే దీనివల్ల అసెంబ్లీ ఫలితాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్, మధ్య ప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రాల సీఎంలలో ఎవరైనా శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామన్నా కేంద్ర ఎన్నికల కమిషన్ నవంబర్, డిసెంబర్ వరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయదు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలు నాలుగు నెలలు వాయిదా వేస్తే ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యతిరేకించవు. ఇక తెలంగాణలో కూడా జాతీయ రాజకీయాలు అంటూ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ వాదన పైన తన పార్టీ వైఖరి ఏందో ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. ఒకవేళ కేంద్రం, ఎన్నికల కమిషన్ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో భాగంగా ఈ ఏడాది చివరన జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలను నాలుగు నెలల తరువాత లోక్‌సభ ఎన్నికలతో కలిపి పెట్టే యోచనలో ఉందా? లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
డా. అక్కెనపల్లి వెంకట్రాం రెడ్డి
అసిస్టెంట్ ప్రొఫెసర్
9700206444