- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉన్నది ఉన్నట్టు:కేసీఆర్ పై బీజేపీ విసిరే వెపన్ ఏంటి?నెక్స్ట్ టార్గెట్ వారి ఫ్యామిలీనేనా
మంత్రులను, రాజకీయ నాయకులను, వారికి సహకరిస్తున్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల అవినీతిని వెలికితీయడం, కేసులు పెట్టడం, చివరకు అరెస్టు చేసి జైలుకు పంపడం కొత్తేమీ కాదు. అవసరం వచ్చినప్పుడు బైటకొస్తాయి. లేదంటే చడీ చప్పుడు కాకుండా అటకెక్కుతాయి. కానీ, ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలే టార్గెట్. అందుకే అధికారంలో ఉన్న పార్టీలకు ఐటీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు పవర్‌పుల్ వెపన్‌లు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు బీజేపీ హయాంలోనూ జరుగుతున్నది.
అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చూశాం. ఆ తర్వాత అవినీతికి పాల్పడడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నైతికం, అనైతికం అనేదానికి తావు లేదు. నీతి నిజాయితీ అసలే ఉండదు. అందలం ఎక్కాలంటే ఎంతో కొంత సమర్పించుకోవాలి. కుర్చీలో కూర్చున్న తర్వాత అంతకంత పోగేసుకోవాలి. ఇదే రాజకీయాల అంతిమ లక్ష్యం. సర్పంచ్ మొదలు మంత్రి దాకా ఇదే టార్గెట్. ఎన్నికలలో నిలబడడానికి టికెట్ దక్కించుకోవడం మొదలు గెలిచిన తర్వాత మంచి పదవిని పొందడం దాకా దేశ రాజకీయాలలో ఇది కామన్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంచనాలకు అందనంత సంపదను వెనకేసుకోవాలి. అనేక రాష్ట్రాలలో వెలుగు చూస్తున్న కుంభకోణాలే ఇందుకు నిదర్శనం. తాజాగా పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చటర్జీని అవినీతి వ్యవహారంలో ఈడీ అరెస్టు చేసింది. కట్టలు కట్టడానికి కూడా సాధ్యం కానంతగా సోదాలలో కరెన్సీ నోట్లు దొరికాయి. మంత్రిగారి అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు మహారాష్ట్రలో అనిల్ దేశ్‌ముఖ్, అజిత్ పవార్, నవాబ్ మాలిక్ అవినీతి కేసులలో అరెస్టయ్యారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు, 'ఫెమా' ఉల్లంఘనలు జరిగినట్లు వారిపై అభియోగాలు. అందుకే అధికారం, అవినీతి కవల పిల్లలు అని చెప్పుకుంటుంటాం. మంత్రుల అవినీతి భాగోతాలలో మొదటిది, చివరిది అనేదేముండదు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇదో పొలిటికల్ వార్.
వారే అసలు టార్గెట్
మంత్రులను, రాజకీయ నాయకులను, వారికి సహకరిస్తున్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల అవినీతిని వెలికితీయడం, కేసులు పెట్టడం, చివరకు అరెస్టు చేసి జైలుకు పంపడం కొత్తేమీ కాదు. అవసరం వచ్చినప్పుడు బైటకొస్తాయి. లేదంటే చడీ చప్పుడు కాకుండా అటకెక్కుతాయి. కానీ, ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలే టార్గెట్. అందుకే అధికారంలో ఉన్న పార్టీలకు ఐటీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు పవర్‌పుల్ వెపన్‌లు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు బీజేపీ హయాంలోనూ జరుగుతున్నది. విచిత్రమేమంటే, ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, కేసులు నమోదైనా ఇప్పటికీ పదవులలో, అధికారంలో కొనసాగుతూ ఉండడం.
విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి, గొంతు నొక్కేయడానికి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదంటూ బీజేపీ మీద చాలా పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్‌గా ఉన్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని సైతం ఈడీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇక మహారాష్ట్రలో మంత్రుల సంగతి సరేసరి. నేడో రేపో కేసీఆర్ కుటుంబానికి సైతం తప్పదంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షాలను కంట్రోల్‌లో పెట్టుకోడానికి అధికార పార్టీలకు ఇదో బలమైన అస్త్రం. అవసరం ఏర్పడినప్పుడు నోటీసులు, సోదాలు తెరపైకి వస్తాయి. అంతా బాగానే ఉందనుకుంటే ఏ హడావుడీ ఉండదు. పార్టీలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్న పారిశ్రామికవేత్తలపైనా ఇలాంటి దాడులు సహజం. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టే ఇన్‌ఫ్రా, ఫార్మా సంస్థలపై ఐటీ దాడులు ఈ కోవలోనివే.
మచ్చ లేని నేతలు అరుదు
అవినీతి మచ్చలేని ప్రజా ప్రతినిధులు చాలా అరుదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఇప్పుడు చట్టసభలలో ఉన్న చాలా మందిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఐటీ కేసులు ఎదుర్కొంటున్నవారు పలువురు ఇటీవల పెద్దల సభలోకి ఎంటర్ అయ్యారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మొదలు యూపీ మాజీ సీఎం మాయావతి వరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, మనీ లాండరింగ్ లాంటి కేసులు ఉన్నాయి. జగన్‌మోహన్ రెడ్డి సైతం కేసుల విచారణలు ఎదుర్కొంటూనే సీఎంగా కొనసాగుతున్నారు. పలు రాష్ట్రాలలో మంత్రులపైనా ఇలాంటి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీకి చెందిన కేరళ సీఎం విజయన్‌పైనా గోల్డ్ స్కాం ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని ఆరోపణలు ఉన్నా పవర్‌లో కొనసాగుతున్నారు.
ఇక మాజీ సంగతి సరేసరి.అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అవినీతి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌పవార్, ఆయన సమీప బంధువు అజిత్ పవార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమీప బంధువు అభిషేక్ బెనర్జీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సమీప బంధువు రతుల్‌పూరి,తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి ఇలా పదుల సంఖ్యలో ఈడీ కేసులు ఎదుర్కొంటున్నవారే.
లొంగితే కేసులన్నీ మాఫ్
ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్నవారు అధికార పార్టీలో చేరగానే దర్యాప్తు అటకెక్కడం సహజం. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నారాయణ రాణే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన ముకుల్‌రాయ్, శారదా చిట్‌ఫండ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోం సీఎం హేమంత బిశ్వశర్మ తదితరులు ఇందుకు ఉదాహరణ. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ 'బీజేపీలో చేరితే అన్నీ మాఫ్' అంటూ సెటైర్లు వేశారు. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలు పార్టీల కనుసన్నలలో, ప్రభుత్వాల జోక్యంతో పని చేస్తున్నాయి. అందుకే బీజేపీపై విపక్ష పార్టీలు 'రాజకీయ ప్రతీకారం, కక్ష సాధింపు కోసం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నది. బెదిరింపులకు పాల్పడుతున్నది. లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నది' అంటూ విమర్శలు చేస్తున్నాయి.
ఇప్పుడు సోదాలలో దొరికిన నోట్ల కట్టలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం ఒక్కటే వారి అవినీతికి ప్రామాణికం కాదు. కంటికి కనిపించకుండా బినామీల పేర్లతో సంపాదించిన ఆస్తులు, భూములు, బంగళాలు, ఫామ్ హౌజ్‌ల సంగతి సరేసరి. ఇవి అంత సులభంగా రుజువయ్యేవి కాదు. అధికార పార్టీలకు ఎప్పుడు రాజకీయ అవసరం ఏర్పడితే అప్పుడు ఇలాంటి కేసులు, దర్యాప్తులు, సోదాలు తెరపైకి వస్తాయి. వాటి ప్రయోజనాలు నెరవేరుతాయనుకుంటే ఇలాంటి ఝలక్‌లు విసురుతుంటాయి. నయానా.. భయానా.. లాంటి అస్త్రాలలో దర్యాప్తు సంస్థల కేసులు, సోదాలు ఒక ఎత్తుగడ. సహకారం ఉన్నంతవరకూ ఓకే. లేదంటే కేసులు, విచారణలు, సోదాలు లాంటివాటిని ఎదుర్కోవాల్సిందే.
స్వప్రయోజనాల కోసమే
అధికారం సుపరిపాలన కోసం కాదు. ప్రజలకు మెరుగైన సంక్షేమం, సేవలందించడానికి అంతకంటే కాదు. స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడం, సొంతంగా ఆస్తులను పోగేసుకోవడమే రూలింగ్ పార్టీల అంతిమ లక్ష్యం. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలోనూ ఇదే ప్రధానం. ఆలోచనల స్థాయిలో ఉన్నప్పుడే పావులు కదిపే పొలిటీషియన్లు రాత్రికి రాత్రే సంపన్నులైపోతుంటారు. సోదాల సమయంలో ఇండ్లలో, ఆఫీసులలో వందల, వేల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్ల కట్టలు ఇలా పోగుపడుతున్నవే. పోస్టింగ్‌లు ఇప్పించడం మొదలు బదిలీ వరకు లంచాలు లేనిదే పనికాదు. కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు కమిషన్లు.
ఈ నోట్ల కట్టలన్నీ అక్రమ సంపాదన, అవినీతి సొమ్మే. దొరికినవారు ఎలాగూ దొంగలని తేలిపోయింది. దొరకకుండా ఉన్నవారు నిజాయితీపరులనే భ్రమలు అవసరం లేదు. 'ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో' తరహాలో రెయిడ్‌లు జరిగినప్పుడే వారి బండారం బైట పడుతుంది. రాజకీయ అవసరాలు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు సోదాలు జరుగుతాయి. స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడం, ప్రత్యర్థులను డీమోరల్ చేయడం, ప్రజలలో దోషులుగా నిలబెట్టడం, రాజకీయ లబ్ధి పొందడం.. ఇవే అధికార పార్టీ అడ్వాంటేజ్. సహకారం, సర్దుబాట్లు ఉంటే అంతా సైలెంట్. లేదంటే కేసులు, విచారణలు, జైళ్ళు అనివార్యం. బెదిరింపులతో కేసులు పెట్టి వేధించడం రూలింగ్ పార్టీల వంతైతే.. లొంగిపోయి మాఫీ చేసుకోవడం అవినీతి నేతల తక్షణ కర్తవ్యం.
ఎన్. విశ్వనాథ్
99714 82403