- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమ బాటకు అర్హత ఉందా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల్లో ఎన్నడూ చూడని వ్యతిరేకత కనపడుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు గాలికి పోయాయని, ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయని, విద్యుత్ ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారుల రాజ్యం, మద్దతు ధర దక్కకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలు వంటి సమస్యలపై ఈ నెల 11 నుంచి ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు.
ఈ నెల 11న ధాన్యం సేకరణ, రైతుల సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వడం, 27న విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా జిల్లాల్లో విద్యుత్‌శాఖ ఎస్‌ఇ కార్యాలయాలతో పాటు, సీఎండి కార్యాలయాల వద్ద వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేయడం, జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన రూ.3,900 కోట్లు చెల్లించాలని కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అయి తే, అసలు మీరు ఐదేళ్లు ఏమి ఉద్దరించారని ఉద్యమా లు చేస్తారు? ఉద్యమానికి కాలు బయట పెట్టే ముందు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉద్యమ బాట పడితే అర్థవంతంగా ఉంటుంది.
మీరు అమలు చేయని హామీలు..
జగన్, మీరు పరీక్ష పాసవ్వని రెండో క్లాస్ పిల్లాడిలా అమాయకంగా ముఖం పెట్టి నా పరిపాలన అద్భుతం, నేను మంచి చేశానని మీకు మీరు అనుకుంటే ఎవ్వరూ జాలి పడిపోరు. మీరు చేసిన మంచి ఏమిటో, ఇచ్చిన వాగ్దానాలు ఎలా గాలికి పోయాయో ప్రజలకు తెలుసు. మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? సీపీఎస్ రద్దు అన్నారు చేశారా? పోలవరం పూర్తి అన్నారు.. చేశారా? రోడ్లు వేశారా? కనీసం గుంతలైనా పూడ్చారా? ముఖ్యమైన హామీలను పక్కన పెట్టి హామీలు అన్నీ అమలు చేశాం అంటూ అడ్డంగా అబద్ధాలు చెప్పడానికి మీకు నోరెలా వస్తోంది? శాంతిభద్రతలను గాలికొదిలేశారు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి లాఠీలతో కుళ్ల బొడిపించారు. ఇసుకను, మట్టిని బొక్కేశారు. పన్నుల భారంతో ప్రజలను పీల్చి పిప్పి చేశారు. సంపద సృష్టించకుండా, రాష్ట్రం నెత్తిన పది లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టారు. అందుకే ప్రజలు చాలా తెలివిగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. నన్ను ఏం చేయలేరు అంటూ సవాళ్లు వేసిన మిమ్మల్ని ప్రజలు పీకి కుప్పలు పెట్టి రెండు పంగనామాలు పెట్టారు.
వ్యవసాయంలో మీరు చేయనివి..
సామాన్య జనం కోసం జగన్ ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే ప్రజలు ఆయన పార్టీకి 11 సీట్లిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. 2019 లోను ఇంతే అబద్ధాలను పదేపదే వల్లెవేసి, అవే నిజాలుగా జనాన్ని నమ్మించి అలివి కాని హామీలు ఇచ్చి గెలిచి జనం గొంతు కోశారు. నవరత్నాలు అంటూ అశేష జనావళిని నమ్మించి నిలువునా ముంచే శారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 ఇస్తామని పీఎం కిసాన్ ద్వారా వచ్చే నగదును అందులో కలిపారు. పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత కరెంటు, రూ.4000 కోట్లతో విపత్తుల సహాయక నిధి, 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లూ కానరావు. భవిష్యత్తుపై రైతుకు భరోసా లేకుండా చేసిన బూటకపు వాగ్దానాలతో అన్నదాతను మభ్యపెట్టి రైతులను దగా చేసినందుకు ఉద్యమ బాటపడుతున్నారా? తన పాలనలో రైతులకి ప్రోత్సాహకాలు అందించలేదు.
ఫీజు బకాయిలపై అబద్ధాలే..!
అధికారం కోల్పోయే నాటికి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,100 కోట్లు, వసతి దీవెన కింద మరో 1,400 కోట్లు, మొత్తం రూ.3,500 కోట్లు బకాయి పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు ఫీజు బకాయిలన్నీ చెల్లించానని అబద్దాలకు తెగబడ్డాడు. ఉత్తిత్తి బటన్ నొక్కి డబ్బులు జమ కాని పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి పేద కుటుంబాలు భరించిన ఫీజుల భారం రూ 3,500 కోట్లు, వసతి దీవెన పేరిట చేస్తానన్న సాయమూ ఎగవేసి నిరుపేద విద్యార్థులను వంచించినందుకు ఉద్యమ బాటపడుతున్నారా? ఇక రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలన్నదే నా లక్ష్యం అని, మద్యపాన నియంత్రణ అంటూ మద్యం ధరలను విపరీతంగా పెంచి నకిలీ బ్రాండ్లనూ జనం మీదకు వదిలి అభాగ్యులకు మరణ శాసనం రాసినందుకు ఉద్యమబాట పడుతున్నారా? జలయజ్ఞాన్ని అస్మదీయ గుత్తేదారులకు కామధేనువుగా మార్చినందుకు, పోలవరాన్ని పూర్తిచేయడంపై అనేక సార్లు నాలుక మడతేసినందుకు, జగనన్న కాలనీలు అంటూ బులిపించి పేద ప్రజల సొంతింటి కలలను నిలువునా కూల్చి వేసినందుకు, ఉద్యమ బాట పడుతున్నారా?
పేదల నడ్డి విరిచి..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐదేళ్లలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచిన జగన్ తాను పైసా పెంచలేదని, చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ బాదుడే బాదుడు మొదలుపెట్టారని అబద్దాలకు తెగబడ్డాడు. జగన్ చేసిన మంచి, ప్రజలకు జరిగిన మేలు దేవుడెరుగు. కానీ జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో దోపిడీకి గురయ్యారనేది బహి రంగ రహస్యం. ఐదేళ్లలో ప్రజలపై ఆయన మోపిన భారం రూ.1.38 లక్షల కోట్లని సమాచారం. ఇలా అడుగడుగునా పేదల నడ్డి విరిచేసి వేల కోట్లు పిండుకుని పేదల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తూ ఉద్యమాల బాట పడతాను అనడం సిగ్గుచేటు. కావున ఉద్యమానికి బయలుదేరే ముందు ప్రజలు అడిగిన ప్రశ్నలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
- నీరుకొండ ప్రసాద్
98496 25610