- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆత్మగౌరవమా... హననమా?
ఇటీవల రాష్ట్ర గీతం సంగీతం కూర్పు పైనా, రాష్ట్ర చిహ్నం మార్పు చేర్పులపైనా తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగిందని కొందరు, ఇదే అవకాశంగా భావించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి పొందడానికి నిరసనలకు విమర్శలకు పూనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పదేళ్లపాటు నాయకులు అధికార పక్షం వహించిన మేధావులు సైతం ప్రజల పట్ల చూపిన ప్రదర్శనల తీరు పైన అనేక ఆరోపణలు ప్రజా సమూహాలలో నిర్నిద్రంగా ఉన్నాయి. రాష్ట్ర గీతం లేకుండా పరిపాలన కొనసాగించినప్పుడు గానీ, రాష్ట్ర చిహ్నం రూపకల్పన ఒనరించినప్పుడు గానీ ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయని వారికి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడే అర్హతలు ఉన్నాయా?
తెలంగాణ ఆత్మకు కొలమానాలు కొలతలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయని భావిస్తే వాటిని అమలు చేసిన తీరుపైనే ఎన్నడైనా మల్లెత్తు రాయని, పల్లెత్తు మాట్లాడని వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉదాసీనత వహించి, తెలిసి వ్యూహాత్మకంగా మౌనం వహించి ఇప్పుడు గౌరవ మర్యాదల గురించి మాట్లాడడం సముచితమేనా, సమంజసమేనా, సందర్భమేనా? తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల చరిత్రను మతిలోకి తీసుకుంటే తెలంగాణను ప్రస్తుత ఉక్క పోతక వాతావరణానికి కారణం బోధపడుతుంది.
ప్రాంతీయ ప్రస్తావన ఇప్పుడెందుకు?
ఏ తెలంగాణ ఆత్మగౌరవ కోసం తెలంగాణ ఉద్యమం, రాష్ట్రాన్ని సాధించిందో అటువంటి అశేష ప్రజల ప్రాంత ఆత్మ గౌరవ సూచకంగా తెలంగాణ రాష్ట్ర గీతం ప్రకటించమని గత దశాబ్దంలో ఏ ఒక్కనాడు కూడా నోరు తెరచి అడగని, ప్రశ్నించని వారు.. ఇప్పుడు వినేవానికి లేకున్నా చూసేవారికి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే, తెలంగాణవాదులు జరుగుతున్న విపరిణామాల పట్ల చింతిస్తున్నారు. రాజకీయ నాయకులకు ఆపదమొక్కులు కానీ, ఆలోచనపరులు కుయుక్తులతో ఇలాంటి వాద వివాదాలకు తెర తీయడం అంటే ఏ రాజకీయ గొడ్డలికో 'కామా'గా ఉపయోగపడడమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు. గతంలో జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణేతర నటీమణులతో బతుకమ్మ ఆటలు ఆడించినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు తెలంగాణ, తెలంగాణేతర ప్రస్తావన ఎందుకు వచ్చిందో ఎత్తి చూపే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.
ఆత్మగౌరవం అప్పుడు గుర్తు రాలేదా?
మరొక ముఖ్య విషయం ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితంగా భావిస్తాను. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన నేపథ్యం గురించి ఇక్కడ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధనలో సరి అయిన ఆధారాలు లేవని మద్రాస్ హైకోర్టు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మద్రాస్ హైకోర్టులోని కేసును రీ ఓపెన్ చేయించి మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని బొమ్మలమ్మ గుట్ట మీది జినవల్లభుని కంద పద్యాలను ఆధారంగా చూపించి తెలుగు భాషకు ప్రాచీన హోదా కలిగించడంలో మార్గం సుగమం చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా గుర్తింపు ప్రకటించింది. కానీ ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరుకు తెలుగు అధ్యయన భాష కేంద్రాన్ని తరలించుకుపోయినప్పుడు మన ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం కానీ మేధావులు కానీ ప్రధాన ఎజెండా మీదకి తీసుకు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దీనికి జవాబుదారీతనం ఎవరో చెప్పాల్సిన సందర్భం వచ్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో 'రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉందాం' అనే నినాదం ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిందా? ఇప్పుడు ఇంతకాలం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్లకు కొమ్ము కాసిన లోపాయికారిగా అంటకాగిన మేధావులు ఒకవైపు, మరోవైపు మంచిని మంచి అనక చెడును చెడుగా ఎత్తి చూపక నిశ్శబ్దం వహించిన వారు... వీరే అత్యంత ప్రమాదకారులుగా మారి తెలంగాణ సమాజానికి ఆయా సందర్భాల్లో తీరని అన్యాయం చేశారు.
తోరణం, చార్మినార్ పరిపూర్ణం కావు
అయితే కాకతీయుల స్వాగత తోరణం, చార్మినార్ తెలంగాణ సమాజానికి పాక్షిక ప్రతిబింబాలే కానీ పరిపూర్ణం కానేకావు. ఎందుకంటే కాకతీయ రాజులు ప్రజా పాలన కొనసాగించారనుకుంటే పొరపాటు. రామప్ప లక్నవరం చెరువులు తవ్వించి నీటి వసతులు కల్పించి నంత మాత్రాన దయా ప్రభువులు కాబోరు. సమ్మక్క సారక్కలను ఆదివాసి వీర వనితలను హతమార్చిన రక్తపు మరకలు అంటిన చరిత్ర కూడా వారిదే అని మర్చిపోకూడదు. అలాగే నిజాం పరిపాలన మొత్తంగా అణచివేతలు నియంతృత్వం దౌర్జన్యాలతో కూడిన పరిపాలనే. ప్రజల మాన ప్రాణాలకు ప్రమాదమొనర్చిన ఆయన తాబేదార్ల, రజాకార్ల దురాగతాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రాచరికపు పరిపాలన మొత్తంలో ప్రజలకు పది పైసల మందమే మేలు అనివార్యంగా మంచి జరిగింది అని మర్చిపోకూడదు.
ప్రజా బోనులో సూడో మేధావులు..
రాచకొండ ప్రభువుల వారసులుగా చలామణి అయిన గత ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అడుగడుగునా కించపరచడమే గాక కొండొకచో అవమానపరిచారు. ఇవన్నీ మరిచిపోయిన తెలంగాణ ఆత్మగౌరవ వాదులు ఇప్పుడు కొత్తగా ఆత్మగౌరవం కాపాడుతున్నారో లేక ఆత్మ హననానికి పాల్పడుతున్నారో చెప్పాలి. ఏవేవో ఊకదంపుడు పొల్లు మాటల వాదనలు చేయడం, మాట్లాడడం అంతగా సమంజసం సమయోచితం కాదు. పైన ఊటంకించిన విషయాలే కాక గడచిన పదేళ్ల కాలంలో తెలంగాణ ఆత్మగౌరవం మాటకు వస్తే చాలా విషయాలలో గత ప్రభుత్వమే కాక సూడో మేధావులు చాలామంది ప్రజాబోనులో నిస్సందేహంగా నిలబడాల్సి వస్తుంది.
వాయిదా వేయడం సమంజసమే!
ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం వలె నియంతృత్వ పోకడలకు పోకుండా, అన్ని విపక్ష పార్టీల నాయకుల ఆమోదంతో రాష్ట్ర గీతం జాతికి అంకితం చేయడంలో ప్రభుత్వం చూపిన స్ఫూర్తిని ఆహ్వానించాల్సిందే, రాష్ట్ర చిహ్నం ఖరారును వాయిదా వేసి ఇంకా వందల చిత్రకారుల నమూనాలను ఆహ్వానించడమే కాక, అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి సూచనలు తీసుకొని, అధికార చిహ్నాన్ని ఆమోదిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని గత పదేళ్లలో లేని ప్రజాస్వామ్య వాతావరణానికి శ్రీకారం చుట్టినట్టు అయింది.
అసలు తెలంగాణ మూర్తిమత్వం అంటే స్థూలంగా ధిక్కార స్వరం, పోరాట వారసత్వం, ప్రశ్నించడం, అభిశంసించడం. ప్రజల భాషా, సంస్కృతుల సమున్నత సమాహారమే తెలంగాణ ఆత్మగౌరవం అవుతుంది తప్ప రాజకీయ అవసరాలు తీర్చడంలో పావుగా ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఉపయోగపడదు కూడా..!
-జూకంటి జగన్నాథం
కవి, రచయిత
94410 78095