మధ్యతరగతికి అందని ద్రాక్షేనా...?

by Ravi |   ( Updated:2025-03-29 00:45:51.0  )
మధ్యతరగతికి అందని ద్రాక్షేనా...?
X

ఒకప్పుడు బంగారం పేదవాళ్ల నుండి ధనికుల వరకు ఒక ఆర్థిక భరోసా. ముఖ్యంగా మధ్య తరగతి మానవుడు తన కొనుగోలు శక్తిమేరకు బంగారం నిల్వ చేసుకొని భవిష్యత్ అవసరాలకు ఒక భరోసాగా, తమ వారసత్వ ఆర్థిక పరిపుష్టికి ఒక ఆయుధంగా బంగారాన్ని ఉపయోగించిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దేశంలో మధ్యతరగతికి బంగారంతో అనేక కారణాలతో ఎనలేని అనుబంధం ఏర్పడింది.

అందుకే అంతర్జాతీయంగా బంగారం రేటు దూసుకుపోతున్నా ప్రతియేటా అమ్మకాలు పెరగడం విశేషం. కానీ ఇటీవల కాలంలో పెరుగుతున్న బంగారం రేట్లు అన్ని వర్గాల వారికీ భారంగా మారుతున్నాయి. బంగారంతో మహిళలకున్న భావోద్వేగం భారమవుతున్న బతుకుల నేపథ్యంలో మరో వైపు పరిగెడుతున్న పుత్తడి ధరలతో గుండె గుభేల్ మంటుంది.

బంగారానికి దూరమయ్యే పరిస్థితి..

క్రీ.పూ.3100 నాటి నుంచి నేటికి బంగారం మానవజీవితంలో ఎంతలా పెనవేసుకుపోయిందో ధరల విషయంలో అంతలా దూసుకుపోతోంది. ఒక మోస్తరు ధనికులు గానీ, మధ్యతరగతి వారు గానీ ఇక ఇళ్లల్లో ఏడు వారాల నగలు, నీ ఇళ్లు బంగారంగానూ లాంటి మాటలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అనేక మతాల్లో బంగారం పవిత్రమైనదిగా భావించిన రోజుల నుండి ధర తల్చుకుంటే కళ్లతో తృప్తి పడే రోజులు కొన్ని వర్గాల అనుభవంలోకి వస్తు న్నాయి. గత ఏడాదిలో బంగారం 40 కంటే ఎక్కువ సార్లు సరికొత్త ఆల్ టైం గరిష్టాలను నమోదు చేయడం విశేషం.

ధరలెంత పెరిగినా బంగారం పైపైకే...

1947లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 88.62 రూపాయిలుంటే ప్రస్తుతం సుమారు 91,950 వేల రూపాయలకు చేరుకుంది. ఈ యేడాది చివరికి 10 గ్రాములు లక్ష రూపాయిలకు చేరుకోవచ్చనేది ఒక అంచనా. ఈ తరహా పెరుగుదల మధ్యతరగతి, రైతు కుటుంబాలు, చిన్న వ్యాపారులకు గుదిబండగా మారింది. పెరిగిన రేట్ల నేపథ్యంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఐనా బంగారం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పెరిగిన జీతాలు, ఐటీతో పాటు పలు ప్రైవేటు రంగాల్లోని వారికి పెరిగిన కొనుగోలు శక్తి ఒకవైపు, మరోవైపు ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో పెరిగిన అవినీతితో వస్తున్న బ్లాక్ మనీని వివిధ రూపాల్లో బంగారం వైపు మరలించడం వల్ల కూడా అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి.

దేశానికి ఆర్థిక భద్రత

ప్రపంచలోని అనేక దేశాలలకు బంగారు నిల్వలు ఆర్ధిక భద్రతను, భవిష్యత్‌కు భరోసాను అందిస్తున్నాయి. 1991లో మన దేశం విదేశీ మారక ద్రవ్య సంక్షోభం ఎదుర్కొన్న క్రమంలో పుత్తడి చేసిన మేలే ఈనాడు భారతావని దూసుకుపోవడానికి కారణమైంది. 2024 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం ఆర్బీఐ 308 మెట్రిక్ టన్నుల బంగారం తన కరెన్సీ కి మద్దతుగా కలిగి ఉంది. 100.28 టన్నుల బంగారం స్థానిక బ్యాంకింగ్ విభాగం ఆస్తులుగా మొత్తంగా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం విదేశాల్లో ఉంది. సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్ లెక్కల ప్రకారం అమెరికా 8133.5 మెట్రిక్ టన్నుల బంగారం దేశ ఆర్థిక భరోసాకు భద్రపరుచుకోగా మనదేశం 9వ స్థానంలో ఉంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ లాంటి దేశాలు బంగారం భద్రతతో ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయి.

- అడపా దుర్గ

సీనియర్ జర్నలిస్ట్

90007 25566



Next Story

Most Viewed