ఇంద్రవెల్లి గుణపాఠం ఏది..!?

by Ravi |   ( Updated:2023-04-20 00:16:05.0  )
ఇంద్రవెల్లి గుణపాఠం ఏది..!?
X

దేశ మూల వాసులైన ఆదివాసీ హక్కుల కోసం పోరాడి రక్తతర్పణం చేసిన సంఘటన ఇంద్రవెల్లి. భారత స్వాతంత్ర ఉద్యమంలో జలియన్ వాలాబాగ్ సంఘటనతో సరిపోలినది ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన. ఈ నెత్తుటి గాయాలకు 42 ఏళ్లు నిండినవి. ఆనాడు 1980వ దశకం ప్రారంభంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో అణగారిన రైతులకు, ఆదివాసీలకు ఎటువంటి హక్కులు ఉండేవి కావు. ఆ హక్కుల రక్షణ కోసం పచ్చటి అడవిని నెత్తురోడ్చిన సంఘటన ఇంద్రవెల్లి. ఆదివాసీల మూల వారసుడు కుమ్రంభీం ఆధ్వర్యంలో కొనసాగించిన జోడేఘాట్ పోరాటంతో ఆదివాసీలకు భూములపై హక్కులు లభించాయి. మానవ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ అధ్యయన సూచనల మేరకు నిజాం ప్రభుత్వం లక్షన్నర పైచిలుకు ఎకరాల అటవీ పోడుభూములకు పట్టాలు లభించాయి. ఈ క్రమంలో కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీల సమస్యలు పరిష్కరించేందుకు అర్జీలు తీసుకోవటం ప్రారంభించినది. నిజాం ప్రభుత్వం గిరిజన ప్రాంతాలు, తెగలను నోటిఫై చేస్తూ ప్రకటించి బయటి వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఇది కొంత కాలం తాత్కాలిక ఉపశమన చర్య. ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనం అయింది. ఆదివాసిల ప్రాంతాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కింద పొందుపరచబడ్డాయి. మొదట హైదరాబాద్ గిరిజన ప్రాంత చట్టం 1948 కింద నోటిఫైడ్ ప్రాంతాల్లో ఆదివాసీల భూములు ఇతరులకు బదిలీ కాకుండా రక్షణ కల్పించారు.

ఆదివాసీ రక్షణ చట్టాలను గౌరవించరా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం)భూమి బదలాయింపు చట్టం -1959 వచ్చింది. దీనికి 1970లో మార్పులు చేశారు దీనినే 1/70 చట్టంగా పిలుస్తారు. దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపులు (అమ్మకం, కౌలు, గిఫ్ట్) చెల్లకుండా చర్యలు చేపట్టారు. అడవిపై ఆదివాసీలకే హక్కు ఉండాలని ఈ చట్టం చెబుతోంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించడం అంతరించిపోతున్న ఆదివాసీ తెగలను కాపాడడం కోసం 1/70 చట్టాన్ని తీసుకొచ్చింది. ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ పరిణామాల తర్వాతే ఇంద్రవెల్లి సంఘటనకు దారితీసింది. వలసదారుల దోపిడీ నిరాటంకంగా కొనసాగడం, భూముల అన్యాక్రాంతం, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖల ప్రాబల్యం పెరగడం వలన, జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం అయ్యాయి. వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై గిరిజన రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20 1981 నాడు ఒక సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా మొదలైన అలజడి ఇంద్రవెల్లి సంఘటనకు దారితీసింది. ఈ సంఘటన జలియన్ వాలాబాగ్ లాగా నెత్తుటి గాయాలను నింపింది. నెత్తుటి గాయాలతో తడిచిన ఆ నేల మీద 1983లో ఒక స్థూపం నిర్మించారు. దానిని కుట్రదారులు కూల్చివేశారు. ఇది ఆనాటి పాలకుల దౌర్జన్య క్రీడకు నిదర్శనం.

పోడు భూములకు పట్టాలు ఇవ్వరా?

రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 నవంబర్‌లో మహబూబాబాద్ ఎన్నికల బహిరంగ సభలో పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. అనేక సందర్భాలలో అసెంబ్లీ సాక్షిగా నెలలో ఇస్తాం, రెండు నెలల్లో పూర్తి చేస్తాం, కమిటీలు వేస్తున్నాం, అప్లికేషన్లు పెట్టుకోండి, అధైర్యపడకండి, ఈ ప్రభుత్వం పోడు రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఆదివాసీ గిరిజనులకు పోడు పట్టాల విషయంలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్‌గా పువ్వాడ అజయ్‌కుమార్ ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సభ్యులుగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇలా అనేక మాటలు చెప్పి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు పోడు పట్టాల విషయంలో అతీ గతీ లేదు, అందులోనూ పురోగతి లేదు. సుమారు మూడున్నర లక్షలకు పైగా ఆదివాసీలు, గిరిజనులు పోడు పట్టాల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఏమైందని ఆరాధిస్తే ఆన్‌లైన్ చేస్తున్నాం స్క్రూటినీ చేస్తున్నాం అని కాలం గడుపుతున్నారే తప్ప వారికి ఇచ్చిన హామీని నెరవేర్చిన దాఖలాలు లేవు.

గిరిజనేతరుల దౌర్జన్యాలు ఎన్నాళ్లు?

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఒంటరిగా అడవిలో అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడం ద్వారా బయటి వ్యక్తులను దోపిడీ చేయడం మొదలుపెట్టారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో పలు హోదాలు పొంది ఆదివాసీల ఉపాధిని కబ్జా చేస్తున్నారు. అనేకమంది గిరిజనేతరులు పోడు భూములలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం స్తబ్దంగా ఉంటుంది. వీరిని వెనక్కి పంపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా! వీరి నుండి ఆదివాసీలను కాపాడరా..!

అటవీ అధికారుల దుందుడుకు ఆపలేరా!

టైగర్ జోన్లు, గ్రీన్ బెల్ట్ పేరుతో వైమానిక దాడులు చేస్తూ ఆదివాసీలను అడవి నుండి బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ మూల వారసుల మూలాలను దెబ్బతీస్తున్నారు. పోడు భూములకు పట్టాలు కల్పిస్తామని ప్రకటించిన తెరాస ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఆదివాసులకు అటవీ అధికారులకు మధ్య రోజు రోజుకి దాడులు, ప్రతిదాడులు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. పట్టాలు పంపిణీ చేయకపోవడం వలన అది భౌతిక హత్యలకు దారితీసింది. ఒక అటవీ రేంజ్ అధికారి హత్యకు గురైన సందర్భంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించి 11 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒకవైపు భూమి హక్కు పత్రాలు ఉన్న భూములను వదిలేసి మిగతా ప్రాంతాలలో మొక్కలు నాటుతున్నామని అటవీ అధికారులు చెప్తున్నారు. మరొకవైపు ఆదివాసీ గిరిజనులు స్పందిస్తూ మేము పోడు కొట్టుకుంటున్న భూములలోనే అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారని వారి ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వానికి అటవీశాఖ అధికారులకు మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఆదివాసీ గిరిజనులు సమిధలవుతున్నారని పౌర సమాజం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అటవీ అధికారుల దౌర్జన్యాల నుండి ఆదివాసీ గిరిజనులను కాపాడాల్సిన బాధ్యత పాలకులదే.

ఇంద్రవెల్లి నుండి గుణపాఠం తీసుకొని ఆదివాసీ మేధావులు, పౌర సమాజం ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి, ఎదిరించాలి. ఆదివాసీ సమాజం కలలు కన్న స్వప్నం కోసం పోరాడినప్పుడే ఆదివాసీ త్యాగధనులకు ఘనమైన నివాళి.

(ఇంద్రవెల్లి అమరత్వానికి నేటితో 42 ఏండ్లు)

పందుల సైదులు

తెలంగాణ విద్యావంతుల వేదిక

9441661192

Advertisement

Next Story

Most Viewed