ఈ గీతం జన జాగృత సందేశం

by Ravi |
ఈ గీతం జన జాగృత సందేశం
X

నరజాతి చరిత్ర అంతా పరపీడనే అంటాడు శ్రీశ్రీ. గాయపడిన భారతజాతికి వైద్యమే 'చదువు' అంటున్నాడు మౌనశ్రీ. ఒకటి చారిత్రక వాస్తవమైతే మరోటి పరిష్కార మార్గం. కవి మౌనశ్రీ మల్లిక్ 'ఇండియా ఫైల్స్' సినిమా కోసం రాసిన ఆరు నిమిషాల పాటలో ఒక పాదమది. పాటంతా వర్తమాన సమాజంలోని దుష్ట పోకడలను ఎత్తి చూపింది. మానవజాతిలో సమభావనను కూలదోస్తున్న స్వార్థశక్తుల గుట్టు తెలుసుకొనేందుకు తిరుగుతున్న భూమిని, మనిషిలోని మనిషిని తిరిగి తిరిగి చూడమన్న ఈ గీతం విస్తృత ప్రచారాన్ని అందుకుంటోంది.

ఈ గీతం మొత్తం సమాజాన్ని నిలదీసే ధోరణిలో సాగుతుంది. పాటలో 'సంప్రదాయపు ముసుగు, శిలల మొక్కే ప్రజలకు, కోట్ల దేవుల పేరు చెప్పి, భక్తి పేరున రచన చేసే'.. అనే పదాల వాడకం రచయిత చేసిన దుస్సాహసమే అనక తప్పదు. ఒక మాట అటు ఇటు అయినా మొనదేలి ఉన్న ఛాందసాలు చూస్తూ ఊరుకోవు. ఈ సున్నితమైన పదజాలాన్ని సునిశితంగా చెప్పినా విస్ఫోటన శబ్దాలే దాగివున్నాయి. ప్రతిభకు పరీక్షగా లభించిన ఈ అవకాశంతో సినీ గీత రచయితగా మౌనశ్రీ ఒక కొత్త శిఖరాన్ని అందుకున్నారు.

సినిమా మాధ్యమంగా..

'వాడిపోయిన మగువను, బూడిదైన తెగువను, రాలుతున్న పూలను, గుండె పగిలిన నేలను' అనే పదాలు మౌనశ్రీ రచనా సామర్థ్యానికి మచ్చుతునకలు. ఈ పాటతో తెలుగు సినిమాల్లో ఉద్విగ్నభరిత సందర్భగీతాలపై తన ముద్రను వేశాడు. చక్కని గీతానికి సంగీతవాద్యాల కన్నా ఆ భావాన్ని పలికించే గొంతే ప్రధానం. ఆవేశంతో పాటు ఆర్ద్రత పండిన గీతమిది. కీరవాణి గొంతులో ఈ గీతం ఉద్వేగభరితంగా మారింది. ఆవేశ పదాలకు గొంతెత్తుతూ ఆ వెంటనే మార్దవంగా 'తరచి చూడు' అనడం ఆయనకే చెల్లింది. 'కోట్ల దేవుల పేర్లు చెప్పి' అనేప్పుడు నొసటిని చేయితో తాకి, 'కుట్రదారులను తెలుసుకో' అని పలికినప్పుడు చూపుడు వేలెత్తి ఆయన వాగ్గేయకారుడయ్యారు. పాటే ప్రాణంగా నడిచిన సినిమాలు తెలుగులో కోకొల్లలు. అన్ని రకాల ప్రజలు ఇష్టంగా వచ్చి చూస్తారు కాబట్టి సినిమా మాధ్యమంగా ఏదో మంచి విషయాన్ని చెప్పాలనే తపన ఆనాటి సినిమా రచయితలకు, దర్శకులకు ఉండేది. కుటుంబ కథాచిత్రమైనా ఒక సందేశాత్మక గీతం కలిపేసేవారు.

సందేశాత్మక చిత్రాల్లో..

వెలుగు నీడలులో 'పాడవోయి భారతీయుడా!', జై జవాన్ లో 'నా జన్మ భూమి..', ఒకే కుటుంబంలో 'నరుడే ఈనాడూ..' లాంటి ఎన్నో పాటలు సినిమాల్లో ఇలా ప్రవేశించినవే. కథకు సంబంధమున్నా లేకున్నా ఒక సందేశాత్మక పాట చిత్రంలో ఉంచేవారు. శ్రామిక జనాభా అధికంగా గల మన దేశంలో ఆటపాటలు సంస్కృతిలో భాగం. జానపదాలు జనజీవన ఉల్లాస కేంద్రాలు. అందుకే పాటల ద్వారా సమాజానికి ఏదో ఒక సందేశాన్ని సినిమాలో చేర్చేవారు. సినిమా నడవడానికి, ప్రజల మేలుకొలుపుకు పాటలు ఉభయతారకంగా పని చేసేవి.

సందేశాత్మక చిత్రాల్లో సినిమా సారమంతా ఒక పాటలో కుదించి చెప్పాలని దర్శకులు అనుకుంటారు. అలాంటి అరుదైన సందర్భాలు గీతరచయితకు సవాలు విసురుతాయి. 'ఇండియా ఫైల్స్' ద్వారా మౌనశ్రీ మల్లిక్ ఈ అవకాశాన్ని పొందారు. వారం కింద విడుదలైన ఈ పాట ఇప్పటికే లక్ష వీక్షకులను దాటింది. వందలాది ప్రశంసలు అందుకుంటోంది. సమాజానికి ఇలాంటి మేలుకొలుపు లాంటి గీతాల అవసరం ఎంతో ఉందని ఈ పాటకు అందుతున్న ఆదరణ నిరూపిస్తోంది.

తిరిగి చూడు తిరిగి చూడు (పాట)

తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమినీ..

కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషినీ..

నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో

వెలుగునిచ్చిన జ్ఞానజ్యోతులనార్పినా.. కుయుక్తులేవో

అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో..

మహిళలంటూ పురుషులంటు

మానవాళిని వేరుచేసీ..

అబలవంటూ అద్దమిచ్చి

అందమైన భ్రమల తోసి..

సంప్రదాయపు ముసుగు వేసిన

వారు ఎవరో తెలుసుకో

ఇంద్రచాపం రంగు మాపిన వారు ఎవరో కలుసుకో..

తరచి చూడు తరచి చూడు వాడిపోయిన మగువను

తగిలి చూడు తగిలి చూడు బూడిదైన తెగువను

అగ్రవర్ణము నిమ్నవర్ణము

అంటు మనలను వేరుచేసీ..

స్వార్ధబీజములేవొ నాటి

విశ్వభావన కాలరాసీ..

కోట్లదేవుల పేరు చెప్పి కొరివి పెట్టినదెవ్వరో

భక్తిపేరున జనము నడిచే రచన చేసినదెవ్వరో.‌.

తరలి చూడు తరలి చూడు శిలల మొక్కే ప్రజలను

మరలి చూడు మరలి చూడు గూడుకట్టిన దిగులును

వేట కొడవలి చేతపట్టి రక్తపాతపు దాడులెన్నో

బాల భవితను చిదిమి వేసే దాష్టికాల చర్యలెన్నో

జన్యువులలో విషము నింపిన

కపటి ఎవరో తెలుసుకో

మాన్యులంటూ మనలనేలే

కుట్రదారుల కలుసుకో..

పొగిలి చూడు పొగిలి చూడు సుడులు తిరిగే దుఃఖము

మరిగి చూడు మరిగి చూడు మనిషి వేసే వేషము

పుణ్యపుడమిలొ పరిఢవిల్లిన

మేధ లేదిపుడెందుకో‌‌..

ధన్యధరణిలొ నెత్తుటేరులు

పారుతున్నది ఎందుకో..

తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో

గాయపడిన భరతజాతికి

వైద్యమేదో చదువుకో..

రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను

పగిలి చూడు పగిలి చూడు

గుండె పగిలిన నేలను

- పాట రచయిత

మౌనశ్రీ మల్లిక్

89193 38546

- బి.నర్సన్

9440128169

Advertisement

Next Story

Most Viewed