రైతుబంధు వీరికి కట్ చేస్తే.. పదివేల కోట్లు మిగులుతాయి!

by Ravi |   ( Updated:2024-02-20 01:15:43.0  )
రైతుబంధు వీరికి కట్ చేస్తే.. పదివేల కోట్లు మిగులుతాయి!
X

60 శాతం రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద వ్యాపారస్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు. వృత్తి విద్యా నిపుణులు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, సెలబ్రిటీలు, ఇతర సంపన్న వర్గాలు సొంతంగా పొందుతున్నారు. వీళ్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ , అవస్ధలు కానీ, అప్పులు కానీ లేని సంపన్న వర్గం. ఫలితంగా సాలీనా 9 నుంచీ 10 వేల కోట్ల రూపాయలు సంపన్న వర్గాల చేతిలోకి చేరిపోతున్నాయి.

తెలంగాణ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. వ్యవసాయ ఉత్పాదకతను, రైతులకు ఆదాయాన్ని పెంపొందించడానికి , రైతులను అప్పుల ఊబిలో కూరుకుపోకుండా 2018-19 ఖరీఫ్ సీజన్ నుండి వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం ‘రైతు బంధు’ పథకాన్ని గత ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ పథకం భూమి యజమానులందరికీ వారి వ్యక్తిగత ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా చెల్లిస్తుంది. కానీ అసలు వ్యవసాయాన్ని సాగుచేసే రైతుకు మాత్రం ప్రయోజనం లేదు.

60శాతం భూమి వీరి చేతుల్లోనే…

తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (అట్లాస్) 2022 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సుమారుగా వ్యవసాయపు సాగు భూమి. కోటి 60 లక్షల ఎకరాలు, సాగుచేసే రైతులు 70,00,286 (పోడు భూమి రైతులు) మంది ఉన్నారు.

సన్నకారు రైతులు..2.5 ఎకరాలు కంటే తక్కువ భూమి కలవారు.. 47,86,161 మంది, చిన్నకారు రైతులు 2.5 నుంచి 5 ఎకరాల లోపు గలవారు.. 11,50,339 మంది, మధ్య తరగతి రైతులు...5 నుంచి 10 లోపు కలవారు.. 4,73,387 మంది, పెద్ద రైతులు... 10 నుంచి 25 లోపల కలవారు.. 94,558 మంది, అతి పెద్ద రైతులు ... 25 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ కలవారు.. 6900 మంది.

ఇందులో బీసీ రైతుల శాతం 48%, వారి సంఖ్య 34,80,994 మంది. వారి వద్ద ఉన్న భూమి 71.47 లక్షల ఎకరాలు, ఎస్టీ రైతుల శాతం 13%, వారి సంఖ్య 8,23,799 మంది. వారి వద్ద ఉన్న భూమి 19.29 లక్షల ఎకరాలు. ఎస్సీ రైతుల శాతం 9%, వారి సంఖ్య 8,54,151 మంది. వారి వద్ద ఉన్న భూమి 13.53 లక్షల ఎకరాలు. ఓసి రైతుల శాతం 30 %, వారి సంఖ్య 13,41,342 మంది, వారి వద్ద ఉన్న భూమి 44.41 లక్షల ఎకరాలు, 25 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ ఎకరాలు గలవారు కొద్ది మంది ఉన్నపటికీ వారి వద్దనే వేలాది ఎకరాల భూమి ఉండటం గమనించదగిన విషయం. ఇందులో ఎస్సీ వర్గాలకు చెందిన వారు 65 మంది, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 153 మంది, బీసీ వర్గాలకు చెందిన వారు 1215 మంది ఓసీ, ఇతర ఉన్నతవర్గాలకు చెందిన వారు 5467 మంది ఉన్నారు. వీరిలో కనీసం 500 మందికీ 50 -100 ఎకరాలకు పైగా భూమి ఉంది. కుటుంబాలను పరిగణలోనికి తీసుకున్నట్లయితే కేవలం 2-3 శాతం మంది వద్దనే కనీసం 14 నుంచి 15 లక్షల ఎకరాలు భూమి ఉంది.

సాగు రైతు కన్నీళ్ళు అగేదెట్లా...

రైతు బంధు పథకం ఆర్థికంగా అభివృద్ధి చెందిన అనేక మంది సంపన్న వ్యక్తులు వ్యవసాయ భూములను కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ అరుగాలం కష్టపడి సాగు చేసే రైతుకు ఎంత మాత్రం కాదు. విచిత్రంగా ఇటీవల కాలంలో ధనవంతులైన భూ యజమానులు వ్యవసాయ కూలీల కొరత కారణంగా కష్టపడి పని చేయడానికి ఇష్టపడక తమ భూములను ఆరుగాలం కష్టపడి పనిచేసే పేద రైతులకు కౌలుకు ఇస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాల కోసం మార్చబడిన సాగులో లేని భూములకు కూడ రైతు బంధు పథకం ద్వారా డబ్బులు వర్తిస్తుంది. ఫలితంగా దాని ప్రయోజనం ఎంతమాత్రం నెరవేరడం లేదు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ భూములకు ఎకరానికి కనీసం మార్కెట్ ధర 40-50 కోట్ల రూపాయలపైగానే వుంటాయి, వీటికి కూడా రైతుబంధు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలు, సమాజం తీసుకునేవారు కూడ ఆలోచించాలి. అలాగే ప్రతీ జిల్లా కేంద్రం, నియోజకవర్గం కేంద్రం, మండల కేంద్రం పరిధిలో ముఖ్య ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలు కూడ విపరీతంగా పెరిగిపోయాయి. ఇలా పైన పేర్కొన్న భూములకు కూడా రైతు బంధు ఆపేయడం ద్వారా రాష్ట్రానికి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధిపరంగా సాలీనా రాష్ట్రానికి ఇంచుమించుగా 10 వేల కోట్ల ఖర్చును అదా చేయవచ్చు.

తెలంగాణ పునర్నిర్మాణానికి…

తెలంగాణ రాష్ట్రం అర్ధిక పరిస్థితి కూడా ఏమాత్రం మంచిగా లేదు. గత ప్రభుత్వాలు వరుసగా చేసిన అప్పుల వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. విచ్ఛిన్నమైన తెలంగాణ అర్థిక పునర్నిర్మాణానికి సంపన్నులు, ఆర్థిక స్థోమత ఉన్న తెలంగాణ భూ యజమానులందరూ ముందుకు వచ్చి తమ రైతుబంధు సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోవాలి. గివ్‌ ఇట్‌ అప్ - రైతుబందు ఉద్యమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహా ఉద్యమంలో చేరాలి. ఈ సహాయాన్ని వదులుకునే ప్రతి భూయజమాని నిరుపేద రైతు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించడంలో సహాయం చేసినట్టవుతారు. ఇప్పటికే అప్పుల భారంతో బాధపడుతున్న రాష్ట్రానికీ ఇది నిజంగా మంచి ఆర్థిక బహుమతిగా ఉంటుంది.

డా. బి. వి. కేశవులు. ఎండీ. సైకియాట్రీ.

చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Advertisement

Next Story