కాటేరమ్మ కొడుకులే..

by John Kora |
కాటేరమ్మ కొడుకులే..
X

- ఫస్ట్ మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలు

- ఐపీఎల్‌లో సెకెండ్ హయ్యెస్ట్ టీమ్ టోటల్

- టీ20ల్లో 250 ప్లస్ స్కోర్లు నాలుగు సార్లు దాటిన సన్‌రైజర్స్

దిశ, స్పోర్ట్స్: ఒకప్పుడు లోయెస్ట్ స్కోర్స్‌కు సన్‌రైజర్స్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. 120.. 130 స్కోర్లు కూడా కాపాడుకునేది. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ అంటే టాప్ స్కోర్లకు అడ్డాగా మారింది. ఒకరిని అవుట్ చేస్తే.. మరొకడు వచ్చి ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేస్తుంటారు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో టాప్-6 టీమ్ టోటల్స్‌లో నాలుగు సన్‌రైజరస్ జట్టువే కావడం గమనార్హం. అందుకే సన్‌రైజర్స్ అభిమానులు కాటేరమ్మ కొడుకులు అంటూ పోస్టులు పెడతారు. టోలీచౌకి ట్రావీస్ హెడ్.. కూకట్‌పల్లి క్లాసెన్.. అంబర్‌పేట్ అభిషేక్ శర్మ అంటూ సోషల్ మీడియాలో ఇన్నాళ్లూ సంబరాలు చేసుకున్న అభిమానులకు ఇప్పుడు కొత్తపేట కిషన్ తోడయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ కోసం ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఇవ్వాళ కిషన్ ఆడిన తీరు చూస్తే.. ముంబై ఇండియన్స్ అభిమానులు తప్పకుండా బాధపడి ఉంటారు. అనవసరంగా యాజమాన్యం కిషన్‌ను వదిలేసిందని బెంగపడే ఉంటారు. ఉప్పల్ స్టేడియంలో నలుదిక్కులా బంతిని పరుగులు పెట్టించాడు. ఇక ట్రావిస్ హెడ్ సంగతి చెప్పనక్కర లేదు. చాంపియన్స్ ట్రోఫీ సమయంలో హెడ్ ఎప్పుడు అవుటవుతాడా అని ఎదురు చూసిన అభిమానులే.. ఇవ్వాల బౌండరీలు బాదుతుంటే కూర్చీల మీద నుంచి లేచి డ్యాన్సులు చేశారు. ఇవ్వాళ సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం చూసి.. క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు.

టాప్ స్కోర్లు హైదరాబాద్‌వే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్‌లో రెండో అత్యధిక పరుగులు కావడం గమనార్హం.

టాప్ స్కోర్లు

1. సన్‌రైజర్స్ హైదరాబాద్ - 287/3 (ఆర్సీబీపై) - 2024

2. సన్‌రైజర్స్ హైదరాబాద్ - 286/6 (రాజస్థాన్ రాయల్స్‌పై) - 2025

3. సన్‌రైజర్స్ హైదరాబాద్ - 277/3 (ముంబై ఇండియన్స్ పై) - 2024

4. కోల్‌కతా నైట్ రైడర్స్ - 272/7 (ఢిల్లీ క్యాపిటల్స్‌పై) - 2024

5. సన్‌రైజర్స్ హైదరాబాద్ - 266/7 (ఢిల్లీ క్యాపిటల్స్‌పై) - 2024

6. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 263/5 (పూణే వారియర్స్‌పై) - 2013

టీ20ల్లో 250+ స్కోర్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ - 4 సార్లు

సర్రే - 3 సార్లు

ఇండియా - 3 సార్లు

ఐపీఎల్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ ఓవర్లు

1.జోఫ్రా ఆర్చర్ - సన్‌రైజర్స్‌పై 0/76

2. మోహిత్ శర్మ - ఢిల్లీ క్యాపిటల్స్‌పై 0/73

3. బాసిల్ థంపీ - ఆర్సీబీపై 0/70

4. యశ్ దయాల్ - కేకేఆర్‌పై 0/69

5. రీస్ టోప్లే - సన్‌రైజర్స్‌పై 1/68

6. లూక్ వుడ్ - ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1/68

ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే..

ఈ రోజు సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. గతేడాదే ఈ సెంచరీ చేయాలని అనుకున్నాను. కానీ హైదరాబాద్ జట్టుకు ఆడిన తొలి మ్యాచ్‌లోనే వంద పరుగులు కొట్టడం సంతోషంగా ఉంది. జట్టు నాపై చాలా నమ్మకం ఉంచింది. అందుకే నేను కూడా జట్టు కోసం గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నాను. మా కెప్టెన్ కమ్మిన్స్ చాలా స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించాడు. ఇక యాజమాన్యానికి కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చక్కగా ప్రారంభించారు. వాళ్ల బ్యాటింగ్‌తో నాలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. రాజస్థాన్ బౌలర్లు బాగనే బౌలింగ్ చేశారు. అయితే మేం మా ప్రణాళికలకు అనుగుణంగానే ఆడి మంచి స్కోర్ సాధించాము.

సోషల్ మీడియాలో మీమ్స్ వరద..

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగియగానే సోషల్ మీడియాలో మీమ్స్‌తో హోరెత్తిపోయింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్‌లను పొగుడుతూ అభిమానులు పోస్టుల వరద పారించారు. రాజస్థాన్ బౌలర్లను ట్రోల్ చేస్తూ.. ఇషాన్, హెడ్‌ల బ్యాటింగ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెట్టారు. ఇషాన్ కిషన్ సెంచరీ చూసి ముంబై ఇండియన్స్ యాజమాన్యం తప్పకుండా ఏడుస్తుంటుందని అభిమానులు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.

Next Story

Most Viewed