- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు నేలపై వికసించిన మానవతా ధార బౌద్ధం
ఒకనాడు భారతదేశం తాత్వికంగా ఉజ్వల ప్రభాసమానంగా వెలుగొందింది. ముఖ్యంగా ఆంధ్రదేశంలో.. ఇది ఈనాడు రెండు రాష్ట్రాలుగా భౌగోళికంగా పిలువ బడుతున్నప్పటికి, ఇది ఒక సాంస్కృతిక తాత్విక కేంద్రంగానే వెలుగొందింది. ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తే నాగార్జునకొండ, నాగార్జునసాగర్, నాగార్జున విశ్వ విద్యాలయం, సిద్ధార్థ కాలేజీలు విస్తారంగా ఉన్నాయి. అటు తెలంగాణలో కూడా బౌద్ధ వికాసం విస్తరిల్లింది. నిజానికి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో ఉన్న అనేక గిరిజన తెగలు తమ మౌఖిక భాషా సంస్కృతుల నుండి తెలుగు భాషలోకి సంలీనం అయినట్టు అవన్ని బౌద్ధ వికాసానికి తోడ్పడినట్టు మనకు అర్థం అవుతోంది. నిజానికి నాగార్జునుడిని రెండు తెలుగు రాష్ట్రాలే కాక భారతదేశమే స్వీయం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
భారతదేశ వ్యాప్తంగా కూడా బౌద్ధ క్షేత్రాలే ఎక్కువ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బౌద్ధ సాంస్కృతిక వికాసం ఫరిడవిల్లింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కూడా బౌద్ధ సాంస్కృతిక వికాసం విస్తరిల్లింది. భారతదేశంలో ఉన్న శిలాశాసనాల్లో అత్యధిక శాసనా లు బౌద్ధ సంస్కృతికి సంభవించినదే. ముఖ్యం గా అశోకుడు బౌద్ధాన్ని ప్రపంచదేశాలకు తీసుకువెళ్లడంలో తన కుమార్తెను కూడా దూతగా వినియోగించి ప్రభోదకురాలుగా నిలిపిన గొప్పతనం ఆయనది. అందుకే ‘చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వేలాది చక్రవర్తుల పేర్ల మధ్య సర్వజన సమ్మతమైన సార్వభౌమాధికారంతో, రాచరికపు ఔన్నత్యంతో, మానవతా పరిమళాలతో, విశాల ప్రశాంతాకాశంలో చిరకాలం వెలిగేది అశోకుడు ఒక్కడే’ అన్న సుప్రసిద్ధ చరిత్ర కారుడైన హెచ్.జి. వెల్స్ ప్రశంసొక్కటి చాలు అశోకుని పాలనాకాలం స్వర్ణయుగమని చెప్పడానికి. ఈ ప్రపంచంలో సర్వమానవాళినే కాదు, సకల ప్రాణికోటినీ తన విశాల దృష్టితో, దయార్ద్ర దృక్పథంతో ప్రభావితం చేసి, పరివేష్టించియున్న ఏకైక సార్వభౌముడు అశోకుడు మాత్రమే.
అమరావతి సాంస్కృతిక రాజధాని
ఇకపోతే ఆచార్య నాగార్జునుని ప్రభావం అమరావతి మీద బలవంతంగా ఉంది. ఆచార్య నాగార్జునుడు శ్రీ.శ.2వ శతాబ్దానికి సంబంధించినవాడు. ఆంధ్రుల ప్రశస్తికి ఆయన ఒక మేరు శిఖరం. రెండు రాష్ట్రాలు విడిపోయే సమయంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టులో అమరావతిని రాజధానిగా చేయాలని కోరిన కారణం.. అది ఒక సాంస్కృతిక తాత్విక కేంద్రంగా ఉండాలనే, అయితే ఇప్పటి పాలకులు దాన్ని ఒక కార్పొరేట్ వ్యవస్థగా, మతాధిపత్య, కులాధిపత్య, కార్పొరేట్ శక్తుల ఉమ్మడి భావజాల కేంద్రంగా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. దానివల్ల ప్రపంచ సామ్రాజ్యవాదానికి, ఢిల్లీ ఆధిపత్యానికి లొంగిపోవడం తప్ప ప్రయో జనం శూన్యం. నిజానికి ఆంధ్ర భాషా సంస్కృ తులు అనేక తెగల సంలీనంతో ఏర్పాడ్డాయి అని బి.ఎస్.ఎల్.హనుమంతరావు గారు తన ఆంధ్రుల చరిత్రలో చెప్పారు.
తెగల సంస్కృతుల సమ్మేళనమే తెలుగు
ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో ఉన్న అనేక గిరిజన తెగలు తమ మౌఖిక భాషా సంస్కృ తుల నుండి ఆంధ్రుల భాషలోకి సంలీనం అయినట్టు అవన్ని బౌద్ధ వికాసానికి తోడ్పడినట్టు మనకు అర్థం అవుతుంది. నిజానికి నాగార్జునున్ని రెండు తెలుగు రాష్ట్రాలే కాక భారతదేశమే స్వీయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసిద్ధ చరిత్రకారులు పాహియాన్, హుయాన్‌త్సాంగ్, ఆల్బెరూని రాతలను బట్టి నాగార్జునుని ప్రపంచ విస్తృతి కూడా మనకు తెలియజేశారు. ఈ బౌద్ధ తాత్విక జ్ఞాన జిజ్ఞాసను ఆధునిక కాలంలో ముందుకు తీసుకువెళ్లిన డా. బి.ఆర్.అంబేడ్కర్ మానవాభ్యుదయం కోసం బౌద్ధాన్ని స్వీకరించి భారత రాజ్యాంగాన్ని బౌద్ధ సూత్రాల మీద రాశారు. ఇకపోతే అంబేడ్కర్ తన ‘బుద్ధుడు మరియు అతని దమ్మ’ అనే పుస్తకంలో జంతుబలులను, బుద్ధుని అహింస గూర్చి చెపుతూ బుద్ధుడు శిక్షకుల పాత్రలో ఎవరైనా మాంసాహారం తెస్తే భుజించడానికి అవకాశం ఇచ్చారు. మతపరమైన వాటి మీదే నొక్కు పెట్టినట్లు బుద్ధుని ఉపదేశాలను అంబేడ్కర్ తెలియ చెప్పారు. అశోకుడు కూడా మానవత్వానికి భంగం కలిగే ఆహింసను ప్రబోధించడంలో ఎక్కువ నొక్కు పెట్టాడు.
అంబేద్కర్ పార్కులు, లైబ్రరీలు అవసరం
భారతదేశవ్యాప్తంగా ఈ అర్థ శతాబ్ధిలో అంబేడ్కర్ స్మృతివనాలు, అంబేడ్కర్ బృహత్త ర విగ్రహ నిర్మాణాలు, అంబేడ్కర్ పార్కులు, అంబేడ్కర్ లైబ్రరీలు ఏర్పాడ్డాయి. అంబేడ్కర్ పేరు అనేక విశ్వవిద్యాలయాలకు పెట్టబడింది. అనేక రాజకీయ కారణాల వల్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం భాగ్యనగరంలో జరిగింది. అంబేడ్కర్ 204 అడుగుల విగ్రహం స్మృతి వనం విజయవాడలో జరిగింది. కానీ తెలుగు మంత్రులు, ముఖ్యమంత్రులు అంబేడ్కర్ రా జ్యాంగ పునాదుల నుండే మనకు పదవులు వచ్చాయని మరచిపోతున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు గాని అంబేడ్కర్ పార్కులు, లైబ్రరీలు నిర్మించడం అంబేడ్కర్ స్మృతి వనం మండలాల్లో నిర్మించడం మరచిపోయారు. ఊరూరికి మద్యం షాపులు తెరిచి ప్రజలను మద్యం మత్తులో ఉంచాలని చూస్తున్నారు గాని, పిల్లలు డ్రాపౌట్స్ అవుతున్నారని, ఇతర వస్తువుల కొనుగోలు శక్తి పడిపోతుందని, కుటుంబం అర్థ ఆకలితో జీవిస్తున్నారనే వాస్తవాన్ని మరచిపోతున్నారు. అంబేడ్కర్ పేరుతో వచ్చిన మంత్రులు, ఉపమంత్రులు కూడా అంబేడ్కర్ పాఠ్య గ్రంథాలను, అంబే డ్కర్ చరిత్రను పాఠ్యగ్రంథాలుగా పెట్టలేకపోతున్నారు.
బౌద్ధాన్ని పునర్‌నిర్మించుకోవడంతోనే..
ఈనాడు అమరావతి నగరం, భాగ్యనగరం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం విచారకరం. ఈనాడు భారతదేశం బౌద్ధాన్ని పునర్‌నిర్మించుకోవడంతోనే రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశంలో వెల్లివిరిస్తుందని తప్పక మనం అందరం గమనించాలి. బౌద్ధం ఒక మాన వతా ధారగా నిరంతరం వర్షించాల్సిందే. దాని కి బోధకులు అవసరం. అంబేడ్కర్ వంటి బోధకులు బౌద్ధాన్ని నూతన దృక్కోణం నుండి మానవతా దర్శనంగా ఆవిర్భవింపజేశారు. ఈనాడు భారతదేశానికి బౌద్ధ తత్వశాస్త్రం ఒక చారిత్రక గమన సూత్రం. బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా మళ్లీ భారతభూమిని మనం రక్షించుకుందాం. మన నేల, మన భాష, మన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచం వైపు మనం చూస్తున్నాం.. మనవైపు ప్రపంచం చూస్తుంది. నిన్ను నీవు తెలుసుకో, నీవు పుట్టిన గడ్డని తెలుసుకో.. నీవు, నీ నేల పరిమళిస్తారు.
పునరుజ్జీవం ఇలా సాధ్యం!
భారతదేశం శాంతిని బోధించాలంటే తప్పక బౌద్ధ తాత్విక సందేశం నుండే సాధ్యమవుతుందని పాలకులు గుర్తించాలి. బౌద్ధాన్ని, అంబేడ్కర్‌ను నిరాకరించడం వల్ల కేంద్ర రాష్ట్ర పాలక వర్గాలు అశాంతి ఊబిలో కూరుకుపోతున్నాయి. దేశానికి దేశ ప్రజలకు, పాలకులకు రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలి. జీవన తత్వం ఉండాలి. ఒకరు నిర్మించిన దానిని ఒకరు కూల్చడం నిర్లక్ష్యం చేయడం భారతదేశ సాంస్కృతిక నిధులను నిర్లక్ష్యం చేసినట్లే.. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల భారతదేశాన్ని పునరుజ్జీవింపచేయలేరు. అందుకే సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, తాత్విక పునరుజ్జీవనానికి నడుం కడుదాం. భారతదేశానికి శాంతి, కాంతి సమసమాజ భావనాలతో ముందుకు నడిపిద్దాం. చరిత్ర నిర్మాతలు ప్రజలే.
డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695