అన్నం పెట్టే రైతుకు దిక్కేది?

by Ravi |   ( Updated:2023-03-20 18:45:26.0  )
అన్నం పెట్టే రైతుకు దిక్కేది?
X

దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతు. రైతులు వ్యవసాయం చేయనిది విశ్వవ్యాప్తంగా నివసిస్తున్న ఏ జీవి కూడా తన మనుగడను సాధించలేదు.కానీ ప్రస్తుతం రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఒకవైపు ఎరువులు పురుగుమందుల ధరలు అధికంగా ఉండటం, మరొకవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఈ రెండు పోను ఆరుగాలం కష్టపడి చెమటోడ్చిన పంట అకాల వర్షంతో నష్టపోతే రైతులు పడే బాధ అంతా కాదు. ఇక 2023 మార్చి 16న పలుచోట్ల కురిసిన వడగండ్ల వానల వలన చేతికొచ్చిన పంటలు పూర్తిగా నేలకొరిగాయి. పంటలు నీటిలో కలిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు లబోదిబోమని సంబంధిత పంట పొలాల వద్దనే ఉక్కిరిబిక్కిరిగా ఏడ్చిన రైతులు వేలమంది ఉన్నారు. ఆ యొక్క పరిస్థితిని చూసి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన రైతులు కూడా చాలామందే ఉన్నారు.

నీరుగారిన తల్లిదండ్రుల కష్టం

మేమే పెద్దలు చెప్పిన మాట పాటించక, ఆర్థిక స్తోమత లేక చదవకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మా బిడ్డలు ఇలాంటి కష్టాలను అనుభవించవద్దని ఆరుగాలం కష్టపడి పనిచేసి పిల్లల చదువులకు ఇంకా కొన్ని రోజులలో ఫీజుల్లో కట్టే తల్లిదండ్రుల కష్టం నీరుగారిపోయింది. ఇంకా ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేనిది. పిల్లల చదువుల కోసం మళ్ళీ ఆ తల్లిదండ్రులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి దాపరించింది.

పంటల బీమా పథకాల ఊసే లేదు

మానవులకు అనుకోకుండా ఏవైనా సంఘటనలు, ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే పంటలకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. భారతదేశం విషయానికొస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకపోవడం మూలంగా చాలామంది రైతులు అకాల వర్షాలు, వడగండ్ల వానలు ఇతర చీడపీడల వలన కలిగేటువంటి నష్టాలకు నష్టపరిహారం రీతిలో లబ్ధిని చేకూర్చుకోలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేటు సంస్థలను రైతులు నమ్మలేని స్థితిలో ఉన్నారు. కావున రైతులను ఆదుకునే పథకాలు అమలు చేయాలని చాలామంది నిపుణులు కోరుతున్నారు

నివేదిక అందించాలి

నష్టపోయిన రైతాంగ పంటల వివరాలను వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించి ఆత్మహత్యలను తగ్గించాలి. ముఖ్యంగా రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఉండి, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటే రైతు లాంటి రాజు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. రైతు అనే పదాన్ని రాజకీయాల కోసం ఇతర ఏ ప్రయోజనాల కోసం వాడుకోకుండా రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే పనులను చేయాలి.

వెంగళ రణధీర్

99494 93707

Advertisement

Next Story

Most Viewed