చేయూత లేని చేనేత

by Ravi |   ( Updated:2023-01-21 18:30:33.0  )
చేయూత లేని చేనేత
X

నిషి జీవించాలంటే కూడు, గూడు, గుడ్డ, నీరు ఎంతో అవసరం. మనిషికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో, వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే అవసరం. పుట్టిన దగ్గరి నుంచి మరణించేంతవరకు మనిషికి వాటి అవసరం ఎంతో ఉంది. మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాక, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. చేతిలో అందమైన చీరలు సృష్టించడం నేతన్నకు మాత్రమే సాధ్యం. భారతీయ సాంస్కృతిక కళలలో ఒకటైన చేనేత ప్రపంచానికే ఆదర్శం.

ప్రపంచ ఖ్యాతి గడించి..

స్వాతంత్రం పూర్వం బ్రిటిష్ వారు ఇక్కడి పత్తితో వారి దేశంలో తయారైన వస్త్రాలను పన్నులు మినహాయించి విక్రయించేవారు. ఇక్కడి వస్త్ర పరిశ్రమలపై పన్ను పెంచేవారు. ఈ విధానంతో దేశ వస్త్ర పరిశ్రమ పతనమైంది. దీంతో దేశంలో విదేశీ వస్త్ర బహిష్కరణ నినాదం పెరిగింది. చేనేత కూడా స్వాతంత్ర్య పోరాటంలో ఒక సాధనంగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి రంగం చేనేతదే. 17,18 శతాబ్దాల నాటికి ప్రపంచ వస్త్ర వ్యాపారంలో మనదేశ వాటా 25 శాతం. ఇక్కడ నేసిన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇక్కడి వస్త్రాలే కాదు, లుంగీలు, కాటన్ బెడ్ షీట్స్ వంటివి కూడా విదేశాలకు ఎగుమతి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు ప్రత్యేకించి మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ నేచిన దరీస్‌ను లండన్ మ్యూజియంలో ప్రదర్శించడం అభినందనీయం. ఇలా రంగురంగుల చీరలు, హిమ్రూ చీరలు, ఇటీవల జీన్స్ క్లాత్‌ను తయారు చేశారు. వీరి ప్రతిభకు యునెస్కో గుర్తింపు దక్కడం విశేషం. అయితే ఇంతటి చరిత్ర ఉన్న నేత కార్మికుల బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీపడలేక ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన నేతకు నేడు చేయూత లేకుండా పోయింది. నేత కార్మికులు మాత్రం కళ తప్పిపోయిన సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి చేనేత గొప్పదని ఉపన్యాసాలు దంచే చాలా మంది నాయకులు వారి జీవితాలను బాగు చేసే బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. ఎంతోమంది నేత కార్మికులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా కారణంగా వారి నెత్తిన పిడుగు పడినట్లయింది. ఇలానే వారిని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే దేశానికి గర్వకారణమైన నేత కళా సంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.

ఆ కళను బతికించుకునేందుకు..

నేత కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పెరిగిన ముడి సరుకుల ధరలతో పెట్టుబడి పెరగడం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, వారి సంప్రదాయ డిజైన్లను పేటెంట్ లేకపోవడంతో కాపీలు రావడం, ప్రభుత్వం తరఫున వారికి చేయూత సరిగా అందకపోవడం వంటి కారణాలతో కార్మికుల జీవితాలు తలకిందులయ్యాయి. అందుకే ప్రభుత్వాలు వీరి రక్షణకై తక్షణం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన జీఎస్టీ రద్దు చేయాలి. అలాగే 1985లో ప్రభుత్వం చేనేత రిజర్వేషన్ తీసుకొచ్చి 22 రకాల వస్త్రాలను మగ్గంపైనే తయారుచేయాలని ఆమోదించారు. దానిని 11 కు తగ్గించారు. అయినా ఇప్పటికైనా చేనేతకు కేటాయించిన 11 రకాల ఉత్పత్తులను ఖచ్చితంగా అమలుపరచాలి. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి. నేత కార్మికుడిగా గుర్తింపు ఉన్నవారికి మాత్రమే రుణాలు మంజూరుచేయడం. వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, వారికి స్వయం ఉపాధి కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలి. అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసి రవాణా ఖర్చులు తగ్గించడం, నేతన్నలకు సబ్సిడీపై మరమగ్గాలు అందించడం వంటి చర్యలు తీసుకుని కనుమరుగైపోతున్న చేనేత వృత్తిని కాపాడాలి. అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకోవడం మనందరి బాధ్యత అందుకే చేనేత వస్త్రాలు ధరిద్దాం.. నేతన్నను కాపాడుకుందాం.

కోట దామోదర్

9391480475

Advertisement

Next Story