- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ విద్యార్థుల సీలింగ్ పరిమితి ఎత్తివేయాలి!
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలైన బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యలో పూర్తి స్థాయి ఉపకారవేతనం రాకపోవడం వల్ల నేడు అనేక బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి సాంకేతిక, వైద్య కోర్సులను సాధారణ, మధ్య తరగతి విద్యార్థులు చదవలేకపోతున్నారు. ర్యాంకు పరిమితి ఆంక్షల కారణంగా రాష్ట్రంలోని బీసీ. విద్యార్థులు పూర్తిస్థాయి బోధన రుసుము(ట్యూషన్ ఫీజు)లకు నోచుకోవడంలేదు. ఇది బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డంకిగా మారింది. పేరుపొందిన పెద్ద ఇంజినీరింగ్ కళాశాలలో సీటు లభించిందని సంతోషపడినా, పూర్తి ఫీజులు రాక బీసీ విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రభుత్వం నేడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా కళాశాలకు ఫీజుల నియంత్రణ కమిటీ అనుమతించిన ప్రకారం పూర్తి ట్యూషన్ ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ బీసీ విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలని ఉన్నత విద్యలో పూర్తి ఆర్థిక సహాయం అందించకపోతే వెనుకబడిన బీసీ విద్యార్థులు ఉన్నత విద్యలో వెనుకబడే ప్రమాదం ఉంది.
విద్యార్థులే ఫీజు భరిస్తున్నారు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనా, బీసీ విద్యార్థులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన ర్యాంకుల పరిమితి నిబంధనే కొనసాగుతోంది. దీంతో ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందుతున్న బీసీ విద్యార్థుల్లో కేవలం 10-15 శాతం మందికి మాత్రమే బోధన రుసుం రూపంలో లబ్ధి కలుగుతోంది. దీంతో లక్షల మంది విద్యార్థులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్‌లో నిర్దేశించిన పరిమితికి మించి ర్యాంకులు పొందిన బీసీ విద్యార్థులు రూ.35 వేలకు పైగా అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. కేవలం పదివేల ర్యాంకు లోపు వచ్చిన వారికి మాత్రమే పూర్తి ఫీజు చెల్లించాలంటే సాధారణ మధ్యతరగతి బీసీ విద్యార్థులు ఆ పదివేల ర్యాంకుల్లో ఎక్కువ శాతం ఉండరు అదే విధంగా ఈ మధ్యకాలంలో చూస్తే పదివేల ర్యాంకులు లోపు వచ్చిన విద్యార్థులు ఎవరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కళాశాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు తీసుకోవడం లేదు. ఎక్కువ శాతం విద్యార్థులు ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలలో, కొంతమంది ఇతర రాష్ట్రాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తిగా ఫీజులు చెల్లిస్తుంది, పదివేల కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు ప్రభుత్వం కేవలం 35 వేల రూపాయల ఫీజును మాత్రమే చెల్లిస్తుంది. అంతకు మించి ఉన్న ఫీజును విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ లో చేరే బీసీ విద్యార్థులు దాదాపు 30 నుండి 40 వేలకు పైగా ఉంటే పూర్తి ఫీజు పొందుతున్న విద్యార్థులు ఐదు నుండి ఆరు వేల మంది మాత్రమే.
నివేదిక సిద్ధం చేసినా..
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజుల చెల్లింపు, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు ర్యాంకుల పరిమితి అమలులోకి వచ్చింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మైనార్టీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజులు చెల్లిస్తోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు పెరిగాయి. దాదాపు అన్ని కళాశాలల్లో కోర్సు ఫీజు రూ.లక్ష దాటింది. పేరున్న కళాశాలలో సీటు పొందుతున్న విద్యార్థులు ప్రభుత్వమిచ్చే రూ.35 వేల బోధన రుసుం పోను, అదనంగా మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈసెట్‌లో వెయ్యికి పైగా ర్యాంకు పొందుతున్న విద్యార్థులు కూడా ఇలాగే ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.బీసీ విద్యార్థులకు ఉన్న ర్యాంకు సీలింగ్ విధానాన్ని తొలగించాలని బీసీ సంక్షేమ శాఖ నాలుగేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందుకు ఏటా కనీసం రూ. 300 కోట్లు అవసరమని ఆ శాఖ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకూ ఆమోదం లభించలేదు. పూర్తిస్థాయి ఉపకార వేతనాలు రాకపోవడం వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేటు కళాశాలలో డిగ్రీలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన బీసీ. విద్యార్థులు కొంతమంది ఫీజులు చెల్లించలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు.
వేలమందికి విద్య అందుబాటులోకి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసిన మొదట్లో ఎటువంటి ర్యాంకుల పరిమితి లేకుండా అందరు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు, ఆ తర్వాత ఈ ర్యాంకుల పరిమితి అంశం తీసుకువచ్చి నేడు బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యేవిధంగా తీసుకురావడం బాధాకరం. మరోవైపు కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు సకాలంలో ఉపకార వేతనాలు విడుదల కాక కాకపోవడం వల్ల, పూర్తిస్థాయి ఫీజు రాకపోవడం వల్ల అధిక మొత్తంలో ఉన్నటువంటి ఫీజును చెల్లించలేని పరిస్థితుల్లో పలు విద్యా మరియు ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో బీసీ విద్యార్థులకు పూర్తిస్థాయి ఉపకార వేతనం రాకపోవడం వల్ల కోర్సు పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితుల్లో నేటి బీసీ విద్యార్థులు అనేక సమస్యలకు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు వెంటనే ఎటువంటి ర్యాంకుల పరిమితి లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇచ్చిన మాదిరిగానే బీసీ విద్యార్థులకు అన్ని రకాల కోర్సుల్లో పూర్తిగా ఫీజులు చెల్లించాలి, దీని వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల అదనపు భారం కూడా పడకపోవచ్చు, కానీ వేల బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువవుతుంది.
-డా..కందగట్ల శ్రవణ్ కుమార్
సోషల్ అనలిస్ట్
86393 74879