పేదలంటే ఎందుకంత చులకన?

by Ravi |   ( Updated:2022-09-03 14:51:16.0  )
పేదలంటే ఎందుకంత చులకన?
X

గణాంకాలను పక్కన పెట్టి దేశంలో అత్యధికంగా ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ధరలు ఎంత పెరిగినా ప్రజలు వ్యతిరేకించడం లేదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. దినదిన గండంగా జీవన పోరాటం చేసేవారికి అంత వ్యవధి, ఓపిక ఉండదనే విషయాన్ని కేంద్రం గుర్తించుకోవాలి. ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు తమను ఆదుకుంటారనే నమ్మకంతో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. కనుక పాలకులు ఇప్పటికైనా మేల్కొని రెండు ప్రభుత్వాల సమన్వయంతో నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తేవాలి.

2001వ యేట దేశంలో 35 శాతం ఉన్న పేదరికం 2011లో 22.3 శాతానికి, 2021 కి వచ్చేసరికి 10.9 శాతానికి తగ్గినట్లు అధికారిక గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇదే నిజమైతే దేశ జనాభాలో 38.4 శాతం ప్రజలు ఇంకా కట్టెల పొయ్యిపై ఎందుకు వంట చేసుకుంటున్నారో అధికారులు సమాధానం చెప్పాలి. అలాగే, దేశ సంపదలో 1.4 శాతం ఉన్న ధనికుల దగ్గర దేశ 43 శాతం సంపద ఎలా పోగై ఉందో అంతుచిక్కని అంశం. గణాంకాలు ఎలా ఉన్నా భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉన్నారనేది నిర్వివాదాంశం.

గ్యాస్, పెట్రోల్, డీజీల్, వంట నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో 140 నుంచి 200 శాతం పెరగడంతో వీరి బతుకు బండి ముందుకు సాగక అష్టకష్టాలు పడుతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కోట్ల మంది పేదలు ఒకే పూట తింటూ రెండు పూటలా పస్తులుండే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి.

దానిని బూచిగా చూపి

కోట్ల మంది ప్రజలు దయనీయ పరిస్థితులలో బతుకుతున్నారు. వారికి పరిష్కారం చూపకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుండడం అమానుషం. పెట్రోల్, గ్యాస్, క్రూడ్ ఆయిల్‌కు కావలసిన ముడి సరుకులు అధికంగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా పెరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ధరల పెరుగుదల నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నా ఆదాయం కోసం పెరుగుతున్న ధరలను నియంత్రించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం చమురు శుద్ధి కార్మాగారాలపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధించడం వలన చమురు ధరలు అధికమయ్యాయని చెబుతున్నారు. వీటిలో వాస్తవికత ఎలా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ భారాన్ని సమానంగా భరించి గ్యాస్, పెట్రోల్, డీజీల్, నిత్యావసర వస్తువులను పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పేద ప్రజలకు గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపేసింది. పరోక్షంగా ఇది సామాన్య ప్రజలు భరించాల్సి వస్తున్నది.

గణాంకాలు పక్కకు పెట్టి

ఇప్పటికే పెట్రోల్, డీజీల్ రేటు పెరుగుదల వలన అన్ని రకాల రవాణా చార్జీలు పెరిగాయి. బస్సులు, ఆటోలలాంటి చార్జీలు పెరిగాయి. వాటితో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది ప్రజలకు మోయలేని భారంగా మారింది. కానీ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటుండడం ఆశ్చర్యకరం. పొద్దు తిరుగుడు విత్తనాల డిమాండ్ పెరగడం వలన నూనెల ధరలు పెరిగినట్టు చెబుతున్న ప్రభుత్వం అవి పండించే రైతులకు మాత్రం ప్రోత్సాహకాలు అందించడం లేదు. ఎన్నికల సమయంలో యుద్ధ ప్రాతిపదికన సమీక్షలు నిర్వర్తించే ప్రభుత్వాలు కోట్లాది ప్రజల ఇబ్బందులు తీరేలా ధరల నియంత్రణకు అనుసరించాల్సిన ప్రణాళికల కొరకు సమీక్ష జరపకపోవడం విచారకరం.కరోనా వలన ధరలలో స్థిరీకరణ లేదంటున్న ప్రభుత్వాలు, మరి అదే కరోనా కారణంగా పేద ప్రజలు బతుకులు ఛిద్రమైన విషయం కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.

గణాంకాలను పక్కన పెట్టి దేశంలో అత్యధికంగా ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ధరలు ఎంత పెరిగినా ప్రజలు వ్యతిరేకించడం లేదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. దినదిన గండంగా జీవన పోరాటం చేసేవారికి అంత వ్యవధి, ఓపిక ఉండదనే విషయాన్ని కేంద్రం గుర్తించుకోవాలి. ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు తమను ఆదుకుంటారనే నమ్మకంతో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. కనుక పాలకులు ఇప్పటికైనా మేల్కొని రెండు ప్రభుత్వాల సమన్వయంతో నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తేవాలి.

కైలసాని శివప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్

94402 03999

Advertisement

Next Story

Most Viewed