- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓపీఎస్ కోసం ఎదురుచూపులు
తెలంగాణ రాష్ట్రంలో 3.28 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా వీరిలో రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. నూతన ఉద్యోగ నియామకాల వల్ల ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సీపీఎస్ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాల్సి ఉంది.
2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) లేదా (సీపీఎస్)ను వర్తింప చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో 18 నుండి 60 సంవత్సరాల వయసు గల భారత పౌరులు ఎవరైనా చేరవచ్చు. అప్పటివరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను రద్దుచేసి దాని స్థానే సీపీఎస్‌ని తీసుకువచ్చారు. సీపీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పెన్షన్ల ఆర్థిక భారం ప్రభుత్వాలపై పడకుండా ఉండడానికి ఈ సీపీఎస్‌ని తీసుకువచ్చారు. కానీ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతను విస్మరించారు.
ఎన్నో సౌకర్యాలు కోల్పోతూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోఎంఎస్ 653 తేదీ. 22-9 -2004 ప్రకారం 1 సెప్టెంబర్ 2004 నుండి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకుంటూ 23 ఆగస్టు 2014 న జీవో ను జారీ చేసింది. దీంతో 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ సీపీఎస్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అయింది.
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలో పనిచేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలో పని చేయడం వల్ల రిటైర్మెంట్ సమయంలో వచ్చే 50% పెన్షన్, కుటుంబ సభ్యులకు 30% పెన్షన్, కనీసం 16 లక్షల గ్రాట్యుటి, కమ్యూటేషన్ వంటి సౌకర్యాలను కోల్పోతున్నారు. సీపీఎస్ ఉద్యోగి, ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వారికి వచ్చే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక భద్రత లేక వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి కుటుంబాలకి భద్రత కల్పిస్తూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఆర్థిక భద్రత లేకుండా..
సీపీఎస్ ఉద్యోగి తన బేసిక్ పే డిఏలలో కలిపి 10%, మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రభుత్వం నుంచి మరో 10% సొమ్మును కలిపి నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్ట్(ఎన్ పి ఎస్ టి)లో జమ చేస్తారు ఉద్యోగికి కేటాయించిన పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్(ప్రాన్)లో ఈ సొమ్ము జమవుతుంది. ఉద్యోగి పదవి విరమణ పొందే వరకు జమ అయిన మొత్తం నుంచి 60% డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40% డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు. ఒకవేళ షేర్ మార్కెట్లో నష్టాలను చవిచూస్తే ఉద్యోగి డబ్బుల నుంచి తీసుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్ లాభనష్టాలపై ఉద్యోగి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా విచారకరం. వారి సొమ్ముకు ఆర్థిక భద్రత లేకుండా పోతుంది.
ఇచ్చిన హామీ ప్రకారం..
సీపీఎస్ విధానం నష్టదాయకంగా ఉందని దాన్ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆకాంక్షలను గుర్తించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరిస్తామని ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా సీపీఎస్ రద్దు కోసం పోరాటం చేస్తున్నాయి.రాష్ట్రం లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ ని రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరిస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నారు.
పాకాల శంకర్ గౌడ్
98483 77734