చెంచు పెంటలకు రక్షణ ఏది?

by Ravi |   ( Updated:2024-06-28 00:30:34.0  )
చెంచు పెంటలకు రక్షణ ఏది?
X

అనేక వేల సంవత్సరాల నుండి అడవులనే నివాసంగా ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజన తెగలలో మరింత వెనుకబడిన తెగ చెంచు తెగ (పి.వి.జి.టి) ఇలాంటి చెంచులు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూ‌బ్‌నగర్, నల్గొండ జిల్లాలలో ఉన్నారు. వీరిది పూర్తిగా నల్లమల అడవులతో పెనవేసుకున్న బంధం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఐదవ షెడ్యూల్ ప్రకారం చెంచులకు అనేక హక్కులు కల్పించారు.

సరైన గుర్తింపు లేకుండానే..

కానీ నిన్న మొన్నటి వరకు యురేనియం పేరుతో అడవిలో జీవిస్తున్న చెంచు పెంటలను అడవి నుండి దూరం చేస్తూ తరిమివేయాలని అన్ని పాలకవర్గాలు కుట్రలు పన్నుతూ ఆదివాసి చెంచుల బతుకులను సామ్రాజ్యవాదుల చేతుల్లో పెట్టారు. నల్లమల అంటేనే చెంచుల ఆవాసం. వారి జీవనోపాధి ఆ అడవులతో ముడిపడి ఉంది. అక్కడ దొరికే ప్రతి ఔషధ వనమూలికలు అనేక వృక్ష జాతులు వారికి ఆధారం. అటువంటి చెంచు పెంటలను ఖాళీ చేసే ప్రయత్నాన్ని మేధావులు, కులసంఘ నాయకులు ఖండించగలిగారు.

ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామంలో చెంచు మహిళా ఈశ్వరమ్మను అత్యంత క్రూరంగా హింసించారు, వివస్త్రను చేసి కొట్టి పచ్చి మిరపకాయలు దంచి ఆమె కళ్లల్లో, మర్మంగాల్లో పెట్టి హింసించిన ఘటన పౌర హక్కుల సంఘ ప్రతినిధుల తోడ్పాటు వల్ల బయటకు రావడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. భారత రాజ్యాంగం ఆదివాసి గిరిజనులకు అనేక చట్టాలు పొందుపరిచినప్పటికీ అమలుకు నోచుకోకపోవడమే ఈ దాష్టీకానికి కారణం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై అత్యాచార( నిరోధక) చట్టం -1989 అమల్లోకి వచ్చి 35 సంవత్సరాలు అయినప్పటికీ చెంచు పెంటలపై అనేక నేరాలకు పాల్పడుతున్నారు. చెంచులు తమ భూములు కోల్పోయి నిరాశ్రయులుగా, నిరక్షరాస్యులుగా సరైన ఆధార్ గుర్తింపు లేక బతుకుతున్నారు. ఈ విధంగా చెంచు పెంటలకు రక్షణ కరువై దిక్కు తోచని పరిస్థితిలో చెంచు తెగ కొట్టుమిట్టాడుతోంది.

-పెనుక ప్రభాకర్,

ఆదివాసీ రచయితల వేదిక,

9494283038.

Advertisement

Next Story

Most Viewed