ఇప్పుడే చేరికలు ఎందుకు, కాస్త ఆగలేకపోయారా?

by Disha edit |
ఇప్పుడే చేరికలు ఎందుకు, కాస్త ఆగలేకపోయారా?
X

కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపార అవతారం ఎత్తడం... ధరణిని అడ్డుపెట్టుకుని వందలాది భూములు కబ్జాలు పెట్టిండ్రు అనే అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చింది. విసిగి వేసారిన ప్రజలు గత ప్రభుత్వానికి ఓటు రూపంలో బుద్ధి చెబితే... మూడు నెలలు దాటకముందే అవే అక్రమాలు చేసిన వారిని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేర్చుకోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో తాము చేసిన తప్పుడు పనులకు ఎక్కడ కొత్త ప్రభుత్వం శిక్షిస్తుందో అని, తప్పించుకోవడానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వంతో అప్పాయింట్‌మెంట్ పెట్టుకోవడానికి క్యూ కడుతున్న నేతలను చేర్చుకోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు...

వందేండ్ల పార్టీలో మేమే.. సినిమా దేవుడు పార్టీ పెట్టి గెలిచినా మేమే..మాస్ హీరో పార్టీ పెట్టి గెలుస్తాడు అనుకుంటే అందులోనూ మేమే ఉంటాం..లేదా ఒక ఉద్యమకారుడి పార్టీలోనూ మేమే చేరుతాం... జనం మమ్మల్ని కాదని మరో పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఏదో ఒకటి చేసి అందులోనూ మేము చేరుతాం...జనం ఏ పార్టీని అధికారంలోకి తెచ్చినా అందులో ఉండేది మేమే... జనాలను పందికొక్కులాగా పీక్కుతింటాం... ఇది ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్... ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను గమనిస్తే ఇది నిజమే అనిపిస్తున్నది..

వ్యతిరేకతకు కారణాలు..

ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిన వారు... ప్రభుత్వ శాఖలలో దందాలు చేసిన వారు... ప్రజలను పీడించిన నాయకులు... ఆ పని చేస్తాం ఈ పని చేస్తామంటూ అందిన కాడికి దండుకున్న నేతలు... ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలలో చేతివాటం చూపిన నేతలు, నాయకులు... ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులంతా మనవాళ్లే అంటూ అక్రమార్జనకు తెగబడిన మరికొందరు... కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు దండుకున్న దుర్మార్గులు.. చెరువులను, కుంటలను ఆక్రమించి ఊర్లను నగరాలను పట్టణాలను చెరువులుగా మార్చిన కబ్జాకోరులు.. గుట్టలను, పుట్టలను కూడా వదలకుండా ప్రకృతిని సర్వనాశనం చేసినవారు. భూ బకాసురుల అత్యాశాపరుల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఓ వైపు ఎకరం వంద కోట్లు పలికిందని చెబుతూనే మరోవైపు పార్టీ కార్యాలయం కోసం.. పీఠాధిపతులకు రూపాయికే ఎకరాలకు ఎకరాలు అప్పనంగా ధారాదత్తం చేసిన తీరు ప్రజలలో వ్యతిరేకతకు దారి తీసింది.

గంపగుత్తగా చేర్చుకుంటూ...

ములుగు, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతంలో వర్షాలు పడితే చాలు నగరం సముద్రంలో ఉందా అనే విధంగా తలపించి ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయి పదులు సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్న జనాలు... స్థిర, చర ఆస్తులు ఇలా సర్వస్వం కోల్పోయిన తరుణంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. పైన పేర్కొన్న వాటి ద్వారా విసిగి వేసారిన ప్రజలు గత ప్రభుత్వానికి ఓటు రూపంలో బుద్ధి చెబితే... మూడు నెలలు దాటకముందే అవే అక్రమాలు చేసిన వారిని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేర్చుకోవడం చూసి ప్రజలు షాక్‌కు గురవుతున్నారు... గల్లీ నాయకుడి నుంచి మొదలుకొని బడా బడా కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా ఎదిగిన ఎమ్మెల్యేలు... ఎంపీలను చేర్చుకోవడం ప్రజలు హర్షించడం లేదు.. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపార అవతారం ఎత్తడం... ధరణిని అడ్డుపెట్టుకుని వందలాది భూములు కబ్జాలు పెట్టిండ్రు అని ప్రచార అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అన్యాక్రాంతం కాలేదు అని చెప్పడానికి వీలు కాకుండా చేసిన దుర్మార్గపు పనులతో గత ప్రభుత్వం పూర్తిగా అభాసుపాలైంది.

దుర్మార్గులకు గేట్లు తెరిస్తే...

ఓ వైపు కోట్ల రూపాయలు కొల్లగొడుతూ మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారనే తీవ్రమైన ఆగ్రహంతో గత ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టారు ఓటరు మహాశయులు. అధికారం దక్కలేదని ఒకరు... అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని మరొకరు, ప్రభుత్వం మూడు నెలలకే, ఆరు నెలలకే పడిపోతుందంటూ ప్రకటనలు చేస్తుంటే ఆ ప్రకటనలకే ప్రభుత్వం భయపడితే ప్రజలకు ఏ విధంగా ధైర్యం చెప్పగలుగుతారు అని ప్రశ్నిస్తున్నారు. దుర్మార్గుల పాలన అంతమైందని సంబరపడేలోపే సద్ది మూటలు... ఆపకీర్తిలను ముఠా గట్టుకున్న నేతలను కొత్త ప్రభుత్వం గేట్లు తెర్చి ఆహ్వానించడమంటే ఒకతాను పక్షులమేనని ఒప్పుకున్నట్టే.... గత ప్రభుత్వంలో చేసిన తప్పుడు పనులకు ఎక్కడ కొత్త ప్రభుత్వం శిక్షిస్తుందో అని భయపడి తప్పించుకోవడానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో అపాయింట్మెంట్ పెట్టుకోవడానికి క్యూ కడుతున్న నేతలను చేర్చుకోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు... కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏంది మేము ఆ పార్టీలో చక్రం తిప్పుతామంటూ తొడలు కొడుతున్నారు.

వీరికి సమాధానం ఏది?

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన యోధులకు ఏమని సమాధానం చెబుతుంది కొత్త ప్రభుత్వం. పక్క బొక్కలు ఇరగ కొట్టుకున్న వారు కొందరైతే, గత ప్రభుత్వ దాడుల్లో చావు నోట్లో తల పెట్టి బట్ట కట్టిన వాళ్లు మరికొందరు.. సొంత పార్టీ నేతలు తప్పు చేస్తే ఎదిరించిన వాళ్లు లేకపోలేదు. గత ప్రభుత్వ వేధింపులకు చట్టపరంగా అనేక కేసులు ఎదుర్కొన్న వారు మరికొందరు ఇలాంటి వారిపై గతంలో వేధింపులు గురిచేసిన వారే నాట్యం ఆడుతామంటే సహించగలుగుతారా? ప్రశాంతంగా జీవించగలుగుతారా? ఓ అధిష్టానమా ఒక్కసారి వీళ్ళ కళ్ళల్లోకి చూసి ఆలోచించు..

సత్యారాం భీమప్ప

జర్నలిస్ట్

63033 67213


Next Story