రైతులకు ఎరువుల బరువు ..!

by Ravi |   ( Updated:2024-07-16 00:45:12.0  )
రైతులకు ఎరువుల బరువు ..!
X

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం…రెట్టింపు సంగతి పక్కనబెడితే పలు రాష్ట్రాల రైతుల ఆదాయం గణనీయంగా తగ్గినట్టు స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. “2022 మార్చిలో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2015-16-2018-19 మధ్య కొన్ని రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పడిపోయింది. జార్ఖండ్‌లో రైతుల ఆదాయం నెలకు రూ.7,068 నుంచి రూ.4,895కి, మధ్యప్రదేశ్‌లో రూ.8,339కి రూ.9,740 నుంచి రూ.9,877కి, నాగాలాండ్‌లో రూ.11,428 నుంచి రూ.9,877కి, ఒడిశాలో రూ.5,274 నుంచి రూ.5,112కి తగ్గాయి…” ఆదాయం రెట్టింపు ముచ్చట దేవుడెరుగు కానీ రైతుల పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేసిందనేది ప్రభుత్వ వ్యవసాయ విధానాలను పరిశీలిస్తే మనకు అవగతం అవుతుంది.

సబ్సిడీలతో, రుణమాఫీలతో కార్పొరేట్ వ్యవస్థకు వంతపాడుతూ…దేశానికి వెన్నుముకై నిలిచిన రైతులపై ఎరువుల భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది. “రైతు పండించిన పంటలకు కల్పించే మద్దతు ధరకు, ఎరువుల ధరకు పొంతన లేకుండానే 2022 సంవత్సరంలో ఎరువుల ధరలు 50 శాతం పెంచి రైతాంగాన్ని ఒక్కసారిగా అగాథంలో నెట్టిన కేంద్ర ప్రభుత్వం దీనికి కుంటి సాకుగా అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడి సరుకు ధరలు పెరిగినట్లు చెబుతోంది. ముడి సరుకు ధరలు పెరిగితే వాటిని భరించాల్సిన కేంద్రం ఆ భారాన్ని రైతులపై మోపుతూ వారి నడ్డిని విరుస్తూ మళ్లీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాననడం చూస్తుంటే, హత్య చేసినోడే హంతకుడి కోసం వెతికినట్లు ఉందని రైతులు వాపోతున్నారు..

రైతు నడ్డి విరిచే చర్యలు

గడిచిన పదేండ్ల కాలంలో కేంద్రం గుడ్డిగా ఎరువుల ధరలను పెంచుతూ యూరియా, డీఏపీ వినియోగాన్ని తగ్గించేలా ప్రచారం చేయమని రాష్ట్రాలకు చెబుతోంది. రైతులు ఎక్కువగా వాడే 28.28.0 ఎరువు ధరను 50 శాతం, పోటాష్ ధరను 100 శాతానికి పైగా పెంచేశారు. 2021 ఏడాది చివర్లోని 90 రోజుల్లోనే ఈ ఎరువుల ధరలు 970 నుండి 1700 రూపాయలకు పెరగడం శోచనీయం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడు మరి నేడు ఎంవోపి, కాంప్లెక్స్ ఎరువు ధరలు ఏ విధంగా పెరిగాయనేది ఒకసారి పరిశీలిద్దాం… 2014-15లో కాంప్లెక్స్ ఎరువుల ధర 50 కేజీలకు 890-1210 రూపాయల మధ్య ఉండగా అది 2024-25 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా 1700-1900 రూపాయలకు పెంచింది. ఈ విధంగా పంటలకు ఇచ్చే మద్దతు ధరలకు, పెంచుతున్న ఎరువుల ధరలకు పొంతన లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితికి వస్తున్నారు..

ఎరువుల సబ్సిడీకి మంగళం

ప్రభుత్వాలు దశాబ్దాల నుండి ఎరువులపై కొనసాగించిన రాయితీ విధానాన్ని తుంగలో తొక్కుతూ సేంద్రియ సాగును ప్రోత్సహించే ‘పీఎం ప్రణామ్’ సాకుతో ఈ ఆర్థిక సంవత్సరం ఎరువుల సబ్సిడీలో కేంద్రం 22.25 శాతం కోత పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీ రూ.2.54 లక్షల కోట్లు ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఎరువులపై ఇస్తున్న రాయితీని రూ.1.75 లక్షల కోట్లకు తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలిపారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గిస్తుండడంతో అకస్మాత్తుగా ఎరువుల ధరలు భారీగా పెరిగి అంతంత మాత్రంగా ఉన్న రైతుల జేబుపై కన్నేసింది.

సబ్సిడీని కొనసాగించాలి

ఎరువుల ధరలను పెంచడం మూలనా రైతులకు తీరని నష్టం జరుగుతుంది. ఎరువుల ధరలను చిన్న, సన్నకారు రైతులకు అందుబాటు ధరలోకి తీసుకొచ్చి, అదనంగా మోపుతున్న జీఎస్టీ సుంకాన్ని రద్దు చేసి అన్నదాతపై అదనపు భారాన్ని మోపకుండా చూడాల్సిన అనివార్య బాధ్యతను కేంద్రం గుర్తెరగాలి. ఎరువుల ముడి సరుకులపై అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలను కేంద్రమే భరించి.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల సంక్షేమ దృష్ట్యా కొనసాగించాలి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కేంద్రం తీసుకొచ్చిన ప్రణామ్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. దాన్ని సాకుగా చూపి ఎరువులపై సబ్సిడీని వెనక్కి తీసుకోవడం ఉత్తమ చర్య కాదు .. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్రం ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలి.. కేంద్రం పెంచిన ఎరువుల ధరలను వెనక్కి తీసుకొవాలి. రైతు బతుకే దేశానికి అన్నం మెతుకు. జై కిసాన్ నినాదాన్ని, నినాదంగానే భావిస్తున్న కేంద్రం అది నినాదం కాదు ప్రభుత్వం బాధ్యత అని గుర్తించాలి..

పిన్నింటి విజయ్ కుమార్,

రాజనీతి శాస్త్ర విభాగం,కేయూ

90520 39109

Advertisement

Next Story