- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు కష్టానికి విలువ దొరకదా..?
సబ్బుబిల్ల... అగ్గిపుల్ల కాదేదీ ధర పెరగడానికి అనర్హం అన్నట్లు ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగుతోంది. దీన్ని ఉత్పత్తి చేస్తున్న వారు ధరను పెంచేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాలు అడ్డు చెప్పడం లేదు. కంపెనీలకు నష్టమొస్తుందని ముందే ధర పెంచి అమ్మినా ప్రభుత్వాలు వారికి సహకారం అందించేస్తున్నాయి. సరే కంపెనీలో కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఇంత చేస్తున్నారని సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఇటీవల సినిమా వాళ్లు టికెట్ ధర పెంచుకునేందుకు, బెన్‌ఫిట్ షోలకు సైతం ప్రభుత్వం అనుమతించింది. అంటే సినిమా వాళ్లు నష్టపోవద్దని.. కానీ రైతు వద్దకు వచ్చేసరికి వారు ఎంతో కష్టపడి పండించే పంటకు మాత్రం సరైన ధర లభించేలా కృషి చేయడం లేదు. దీనికి కారణమేంటి..? రైతుల కష్టానికి విలువ లేదా.. విలువ దొరకదా?
పదేండ్ల క్రితం వరకు ఎడ్ల బండ్లతో దుక్కి దున్ని చదును చేసి పంటలు పండించేవారు. ఇప్పుడు యాంత్రీకరణతో పరిస్థితులు మారిపోయాయి. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగాయి. దీంతో వ్యవసాయానికి పెట్టుబడి భారంగా మారింది. ఇది చాలదన్నట్లు మొన్నటి వరకు కూలీలు పొలాల్లో పనిచేస్తూ కనిపించేవారు. ఇప్పుడు పొలాల్లో కూలిపనికి వచ్చేవారు తగ్గిపోయారు. అయినా రైతులు మొక్కవోని ధైర్యంతో దేశానికి అన్నం పెట్టడానికి పొలాన్ని నమ్ముకుంటున్నాడు. విత్తనం నాటిన నుండి చేతికొచ్చే వరకు చేసే కష్టానికి రైతే బాధ్యుడవుతున్నాడు. కానీ తాను పండించే పంటకు మాత్రం ధర నిర్ణయించుకునే దిక్కులేని పరిస్థితి.
మార్కెట్ ధరకు అమ్ముకుంటే..
మనదేశం ప్రపంచంలోనే పత్తి సాగులో మూడో స్థానంలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో పత్తి సాగులో మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఆసియాలోనే డిమాండ్ ఉన్న తెలంగాణ పత్తి గురించి అందరూ చెప్పుకుంటున్నా దాన్ని సాగు చేస్తున్న రైతుకు మాత్రం సాయం దక్కడం లేదు. ప్రభుత్వాలు ఏటా మద్దతు ధర ప్రకటించడం వంటి కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక పత్తిని పండించే రైతులు 100 మందిలో 60శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. వారు భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి. యాంత్రీకరణ వల్ల పనిముట్ల ధరలు, కూలీల రేట్లు పెరిగాయి. దీంతో రైతుకు పెట్టుబడి అమాంతం పెరుగుతోంది. బ్యాంకుల నుండి వచ్చే అప్పు సరిపోక వడ్డీకి తెచ్చి పంట సాగు చేస్తున్నారు. ఇలా ఎన్నో కష్టాలు పడి పండించిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో తేమ, రంగు మారిందని సీసీఐ కొనుగోలుకు ఆదిలోనే నిరాకరించడం రైతుల కష్టాన్ని పరోక్షంగా దళారుల పాలు చేయడానికే అన్నట్లు తయారైంది. తేమ 8 నుండి 12 శాతం లోపు ఉంటేనే కొంటామని అది కూడా మద్దతు ధర రూ.7,525గా నిర్ణయించడంతో రైతులు వర్షానికి తడిసిన పత్తిని సీసీఐకి అమ్మలేక, ఇంటికి తీసుకెళ్లలేక చివరకు వ్యాపారులు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పత్తి రైతులకు మార్కెట్లో వ్యాపారులు ఇచ్చిన ధరెంతో తెలుసా.. అక్షరాలా.. రూ. 6700 నుండి 6900 మాత్రమే.
ధర నిర్ణయించుకునే అధికారం కావాలి!
రాష్ట్రంలో సాగువుతున్న పత్తి పంటకు ఎకరానికి అవుతున్న ఖర్చెంత.. లభిస్తున్న ధర.. ఎంత.. రైతుకు దక్కుతున్నదో తెలిస్తే.. అసలు వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి దయనీయం. దీనికి కారణం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఒకటైతే.. వ్యాపారులు రైతులను వడ్డీ రూపంలో నడ్డి విరిచేయడం మరో కారణం. రైతులు ఎకరా పంట పండించడానికి 65వేల నుండి 75వేల వరకు ఖర్చుపెడుతున్నారు. మరి ఎకరానికి వచ్చే దిగుబడి ఎంత..? పంటపండిన రైతుకి ప్రతి ఏడాది ఇంకా అప్పు పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర అంటూ ఆర్భాటం చేస్తున్నా.. అది కూడా రైతుకు దక్కడం లేదు. ఈ సమయంలో కార్పొరేట్ వ్యాపారులు ఎలా అయితే తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించి అమ్ముకోగలుగుతున్నారో అలాగే ప్రభుత్వం రైతుల పంటకు కూడా ధర నిర్ణయించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. రైతు వద్దకే వచ్చి పంట కొనుగోలు చేసే రోజులు రావాలి. బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితి పెంచగలగాలి. ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ అంటూ ఆర్భాటపు ప్రచారాలు కాకుండా రైతులకు ఏది అవసరమో.. పంట అమ్ముకునేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే వారికి లాభసాటిగా ఉంటుందో చూడాలి. రైతుకు సాయం కాదు.. పెట్టుబడి ఖర్చులు పోగా తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కాస్త మిగిలేలా చూడాలి. అప్పుడే రైతు నిలదొక్కుకోగలడు.
వామన్ మామిళ్ల,
సీనియర్ జర్నలిస్ట్,
99085 56358