- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ అవినీతి మకిలి తుడిచివేయండి
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్లను అంగట్లో సరకులా అమ్మేసి నిరుద్యోగ యువత ఆశలను కుళ్ళబొడిచిన బీఆర్ఎస్ సర్కార్. మరో పాపానికి ఒడిగట్టింది. కాంట్రాక్టు ఉద్యోగాల పర్మినెంట్ విషయంలో ముడుపులు స్వీకరించి అర్హత లేని వారిని పర్మినెంట్ చేసింది. ఈ వ్యవహారంలో నాటి మంత్రి, ఓ విద్యాసంస్థల అధిపతి ఇన్వాల్వ్ అయినట్టు ఆరోపణలు ఉన్నాయి.
స్వరాష్ట్రంలోనైనా తమ ఉద్యోగాలకు భద్రత దొరక్కపోదా? అని ఉద్యమంలో విస్తృత స్థాయిలో పాల్గొన్న కాంట్రాక్ట్ (జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్) అధ్యాపకులకు స్వరాష్ట్రంలో ఆశనిపాతమే ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామంటే సంతోషించిండ్రు. దశాబ్దాల తమ స్వప్నం రాష్ట్ర ఏర్పాటుతో సాకారం అవుతుందని నమ్మిండ్రు. నమ్మి నానబోస్తే పుచ్చులు చేతికి వచ్చినట్లు... నమ్మి రెండుసార్లు అధికారాన్ని కట్టబెడితే కాంట్రాక్ట్ అధ్యాపకులకు చిప్ప చేతికి ఇచ్చిండ్రు. ప్రతిభతో పనిలేదు, పైసలు ప్రామాణికంగా కొలువులు అమ్ముకున్న దుర్మార్గం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చోటు చేసుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మచ్చగా మిగిలిపోతుందని అనడంలో సందేహం అక్కర్లేదు.
విద్యావ్యవస్థలోనూ ఈ జాఢ్యం
గత ప్రభుత్వంలో పీహెచ్డీ, నెట్, సెట్, పీజీలో 60, 70% మార్కులు ఉన్న వారిని కాదని, పైసలు ఇచ్చిన వారిని పర్మినెంట్ చేసిండ్రు. అన్ని అర్హతలు ఉన్న తమ ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత ఉంటుందని నమ్మిన వేలాది మంది అధ్యాపకుల ఉద్యోగాలు ఇప్పుడు చీకటికి, వెలుగుకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నెల 6న దిశ పత్రికలో ప్రచురితమైన ‘అర్హత లేకున్నా పర్మినెంటా..’ అనే ఆర్టికల్ చూసి పదుల సంఖ్యలో కాంట్రాక్టు అధ్యాపకులు కాల్స్ చేసి తమ గోడు విలపిస్తుంటే బాధేసింది. అన్ని అర్హతలు ఉన్న మమ్మల్ని కాదని, నకిలీ ధృవపత్రాలు సృష్టించిన వారిని పర్మినెంట్ చేశారని వారు తమ వ్యధను వివరించారు. పర్మినెంట్ చేసిన వారిలో.. ఇతర రాష్ట్రాల్లో పీహెచ్‌డీ చేసినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించిన వారు కొందరైతే, ఉద్యోగంలో చేరిన నాడు ఉన్న పీజీ, రెగ్యులరైజ్ అయ్యే నాటికి ఉన్న పీజీ కి ఎలాంటి పొంతన లేని నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన వారు ఇంకొందరు. అలాంటి వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయినా, ఉన్నత శ్రేణి మార్కులు వచ్చిన తమ ఉద్యోగాలే గాల్లో దీపంలా మారాయని దానికి కారణం... ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఇవ్వకపోవడమేనని దుఖంతో మాట్లాడిండ్రు. ప్రిన్సిపల్స్ బంధువులం కాకపోవడం తమ తప్పిదం అంటూ ఆవేదన వ్యక్తం చేసిండ్రు. వ్యవస్థలన్నింటికి అవినీతి మరకలు అంటించిన నాటి ప్రభుత్వ పెద్దలు..విద్యా వ్యవస్థను కూడా అందులో భాగం చేయడం అత్యంత విషాదం.
తొమ్మిదేళ్లుగా పక్కన పెట్టిన అంశాన్ని..
అర్హత లేని కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌పై ఓయూ, నిరుద్యోగ యువత హైకోర్టును ఆశ్రయిస్తే, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మే 4న క్రమబద్దీకరణపై స్టే ఇచ్చింది. అయినా, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ప్రభుత్వ ఒత్తిడితో ఇంటర్మీడియట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు స్టే ఇచ్చిన ఒకరోజు ముందుగా రెగ్యులర్ చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విధానాన్ని డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామకాల్లో ఫాలో అయ్యారు. ఇంత హడావిడిగా కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజ్ ఎందుకు చేసినట్లు? ఎవరి ప్రయోజనాల కోసం ఇంత వేగంగా ఫైల్స్ మూవ్ అయినట్లు? తొమ్మిదేళ్లుగా పక్కన పెట్టేసిన నాటి ప్రభుత్వం ఎందుకు ఇంత స్పీడ్‌గా ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపించింది? ఈ వ్యవహారం ఇంత హడావుడిగా ముగియడానికి కారణం రాజకీయ నాయకులేనని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సూర్యాపేటకు చెందిన ఓ సెక్షన్ ఆఫీసర్ ఇదంతా రూ.500 కోట్ల స్కాం అన్నడు. జేఎల్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం రూ.5 నుంచి 10 లక్షలు, డీఎల్ కోసం రూ.10 నుంచి 15 లక్షలు, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల కోసం రూ. 15 నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్కరు చెల్లించుకున్నరని చెప్పిండు. ఇది కేవలం ఆరోపణగానే చూడలేం. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా, రాత్రికి రాత్రి ఉత్తర్వులు ఇచ్చేసి ఎలాంటి అర్హతలు లేని వ్యక్తులకు గెజిటెడ్ హోదాను కల్పించారంటే వసూళ్ల పర్వం గట్టిగానే జరిగినట్లు అర్థం అవుతోంది. పైగా దొంగ సర్టిఫికేట్లతో రెగ్యులర్ అయినట్లు ఆధారాలు కూడా బయటకొచ్చాయి. ఈ స్కామ్ వెనక మాజీ మంత్రితో సన్నిహితంగా ఉండే ఉద్యోగ సంఘం నేత కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అలాగే ఓ ఐఏఎస్ అధికారిపై కూడా ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది.
కాళేశ్వరం, మేడిగడ్డలపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన రేవంత్ సర్కార్... ఈ వ్యవహారంపై కూడా దృష్టి సారించి అర్హులకు కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలి. లేదంటే, కనీస అర్హతలు లేకుండా రెగ్యులర్ అయిన వారి బోధనలతో కొత్త తరం భవిష్యత్‌ను ఆగం చేసినట్లు అవుతుంది. పారదర్శకత మా విధానమన్న రేవంత్ రెడ్డి...ఆచరణలో చూపాలి. విద్యా వ్యవస్థకు అంటుకున్న మకిలిని తుడిచివేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
-ప్రశాంత్ పగిళ్ల
ఓయూ విద్యార్థి
95812 62429