మాజీ సైనికుల సంక్షేమానికి కేటాయించిన నిధులు ఏమయ్యాయి!?

by Ravi |   ( Updated:2022-11-03 10:59:13.0  )
మాజీ సైనికుల సంక్షేమానికి కేటాయించిన నిధులు ఏమయ్యాయి!?
X

మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిధికి యేటా ముఖ్యమంత్రి, మంత్రులు రూ.25 వేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రూ.10 వేలు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించారు. ప్రతి పైసాను మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మాత్రమే ఖర్చుచేస్తాం' 2017 జనవరిలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు ఇవి. నిధిని ఏర్పాటు చేసి అయిదున్నరేండ్లు గడిచిపోయాయి. సేకరించిన దాదాపు రూ.30 కోట్ల రూపాయలను ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌‌కు మళ్లించిందని సైనిక సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. హడావుడిగా ఒక్క ఏడాదే సైనిక నిధిని సేకరించిన ప్రభుత్వం ఆ తరువాత దానిని పూర్తిగా విస్మరించింది. 50 వేల మంది మాజీ సైనికుల సంక్షేమం గురించి సీఎం ఇచ్చిన హామీ అమలు కావడం లేదు.

కావల్సినవారు కళ్ల ముందే చనిపోతే ఎలా ఉంటుంది? ఎక్కడో ఒక మూలగా, అయినవాళ్లకు, ఆత్మీయులకు దూరంగా, నిస్వార్థంగా మన కోసం, దేశం కోసం పోరాడుతున్నారు మన జవాన్లు. వారికి తోడుగా ఎవరూ ఉండరు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వారిని వారే కాపాడుకుంటూ దేశాన్ని కాపాడుకోవాలి. అలా సర్వీస్‌లో ఉన్నంత కాలం అనుక్షణం దేశం కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతారు వారు.

ప్రజల ఆకలి తీర్చే బాధ్యతను రైతు తన భుజాల మీద వేసుకుంటే, దేశ పౌరులంతా నిశ్చింతగా ఉండేందుకు సైనికుడు తన ప్రాణాలను పణంగా పెడతాడు.దేశానికీ, దేశాధినేతలకూ ఇచ్చినంత గౌరవాన్ని మనం సైనికుడికీ ఇవ్వాలి. కానీ రిటైర్ అయిన తర్వాత వీరిని చూడాల్సిన కనీస బాధ్యతలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరం.

ఆ నిధి ఏమైంది?

'మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిధికి యేటా ముఖ్యమంత్రి, మంత్రులు రూ.25 వేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రూ.10 వేలు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించారు. ప్రతి పైసాను మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మాత్రమే ఖర్చు చేస్తాం' 2017 జనవరిలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు ఇవి. నిధిని ఏర్పాటు చేసి అయిదున్నరేండ్లు గడిచిపోయాయి.

సేకరించిన దాదాపు రూ.30 కోట్ల రూపాయలను ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌‌కు మళ్లించిందని సైనిక సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. హడావుడిగా ఒక్క ఏడాదే సైనిక నిధిని సేకరించిన ప్రభుత్వం ఆ తరువాత దానిని పూర్తిగా విస్మరించింది. 50 వేల మంది మాజీ సైనికుల సంక్షేమం గురించి సీఎం ఇచ్చిన హామీ అమలు కావడం లేదు.

ఇవీ సీఎం హామీలు

మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్‌ పెన్షన్‌, మాజీ సైనికోద్యోగి మరణిస్తే భార్యకు పెన్షన్‌, యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు అందుతున్న పరిహారం, సదుపాయాలను సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వంటి కారణాలతో మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా వర్తింపజేయడం, వారికి నెలనెలా పెన్షన్‌ చెల్లించడం, స్పెషల్‌ పోలీసాఫీసర్లుగా పని చేస్తున్నవారికి మాజీ సైనికోద్యోగుల వేతనం. సైనిక సంక్షేమ బోర్డుల బలోపేతానికి చర్యలు.

21 కొత్త జిల్లాలలోనూ బోర్డుల ఏర్సాటు, మెదక్, ఆదిలాబాద్‌‌లో సైనిక సంక్షేమ కార్యాలయాల నిర్మాణం, యుద్ధంలో మరణించిన సైనికులకు గ్యాలంటరీ అవార్డుల ద్వారా అందించే పరిహారాన్ని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండేలా కొత్త విధానం, సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో రిజర్వే షన్‌, మిలటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు. స్కౌట్స్, గైడ్స్, ఎన్‌సీసీ కెడెట్లకు, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు కేంద్రంతో ఒప్పందం, వాహనాల పన్ను దేశంలో ఎక్కడ చెల్లించినప్పటికీ తిరిగి తెలంగాణలో చెల్లించాల్సిన అవసరం లేకుండా చర్యలు, సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు, డబుల్‌ బెడ్‌ రూం పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం లాంటి వరాలను కూడా సీఎం ప్రకటించారు. నేటికీ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లుగా ఉంది.

అమలు కాని ఉత్తర్వులు

సైనికుల ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర్వులనే తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. మాజీ సైనికులకు, వితంతవులకు 175 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించే అధికారం కలెక్టర్‌కు అప్పగించారు. అమర సైనికుల భార్యలు, గాయపడిన సైనికులకు 300 చదరపు గజాల ఇళ్లస్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. రిజర్వేషన్ అంతంత మాత్రంగానే ఉంది. ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు.

పౌరసరఫరాల డీలర్‌షిప్‌లో ఒక శాతం, పారిశ్రామిక షెడ్డు/స్థలాల కేటాయింపులో ఐదు శాతం, మాజీ సైనికుల పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రెండు శాతం రిజర్వేషన్లను కూడ అమలు చేయడం లేదని చెబుతున్నారు. సమస్యల పరిష్కారానికి డీజీపీ అధ్యక్షతన ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఆరునెలలకోసారి సమావేశం అవుతుందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2018 జూన్‌లో ఒక సమావేశం మాత్రమే జరిగింది.

కేంద్ర సర్వీసులలో మరీ దారుణం

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) నిబంధనల ప్రకారం గ్రూప్‌-సిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం, గ్రూప్‌-డిలో 20 శాతం మాజీ సైనికులకు ఇవ్వాలి. గ్రూప్‌- సిలో 1.29 శాతం, గ్రూప్‌-డిలో 2.66 శాతం మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో మాజీ సైనికులకు 14.5 శాతం, కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్లలో 24.5 శాతం కోటా ఉంది. గత ఏడాది జూన్‌ 30 నాటికి ఇందులో మాజీ సైనికులు గ్రూప్‌-సి ఉద్యోగాలలో 1.15 శాతం, గ్రూప్‌-డి ఉద్యోగాలలో 0.3 శాతం మాత్రమే ఉన్నారు. భారతీయ రైల్వే కేవలం 1.4 శాతం (11.5 లక్షలలో 16,264) ఉద్యోగాలను మాజీ సైనికులతో భర్తీ చేసింది.77 కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉండగా, 34 శాఖలలో గ్రూప్‌- సి ( 10 శాతం రిజర్వ్‌డ్) 10,84,705 పోస్టులకుగానూ 13,976 (1.29 శాతం) మంది మాజీ సైనికులు మాత్రమే ఉన్నారు.

గ్రూప్‌-డి (20 శాతం రిజర్వ్‌డ్) 3,25,265 పోస్టులకుగాను 8,642 (2.66 శాతం) మంది మాజీ సైనికులు మాత్రమే ఉన్నారు. పారామిలటరీ బలగాలు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), సెంట్రల్‌ పారా మిలటరీ ఫోర్స్‌స్‌ (సీపీఎంఎఫ్‌)లో పది శాతం మాజీ సైనికుల కోటా ఉండగా, 2021 జూన్‌ 30 నాటికి 0.47 శాతం మాత్రమే ఉన్నారు. 8,81,397 గ్రూప్‌-సి పోస్టులకు 4,146 ( 0.47 శాతం) మంది మాత్రమే ఉన్నారు. 61,650 గ్రూప్‌-బి పోస్టులకు 539 (0.87 శాతం) పోస్టులు మాత్రమే మాజీ సైనికులకు లభించాయి. 76,681 గ్రూప్‌-ఎ పోస్టులకు 1,687 (2.2 శాతం) ఉద్యోగాలు మాత్రమే పొందారు. గ్రూప్‌-డిలో 20 శాతం కోటా ఉన్నప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.

ఇదీ అసలు పరిస్థితి

170 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, 94 సంస్థలలోనే మాజీ సైనికులకు ఉద్యోగాలు కల్పించారు. 2,72,848 గ్రూప్‌-సి పోస్టులలో 3,138 (1.15 శాతం) మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. 1,34,733 గ్రూప్‌-డి పోస్టులలో 404 (0.3 శాతం) మంది మాత్రమే ఉన్నారు. 13 ప్రభుత్వ రంగ బ్యాంకులలో 2,71,741 గ్రూప్‌-సి పోస్టులు ఉండగా, 24,733 (9.1 శాతం) మాత్రమే ఇచ్చారు. 1,07,009 గ్రూప్‌-డి పోస్టులకు, 22,839 (21.34 శాతం) పోస్టులు మాజీ సైనికులు ఇచ్చారు. 2021 జూన్‌ 30 నాటికి మొత్తం 26,39,020 మంది మాజీ సైనికులు ఉన్నారు. అందులో 22,93,378 మంది ఆర్మీ, 1,38,108 మంది నేవీ, 2,07,534 మంది ఎయిర్‌‌ఫోర్స్‌ నుంచి ఉన్నారు. తెలంగాణలోనే కాదు. ఇతర రాష్ట్రాలు కూడా మాజీ సైనికులకు సరైన రీతిలో ఉపాధి కల్పించలేకపోయాయి.

డిసెంబర్‌ 2019 నాటికి దేశంలోని 80 శాతం సాయుధ బలగాలను కలిగి ఉన్న బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానాలో రెండు లక్షల మంది మాజీ సైనికులలో 1.5 శాతానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు. ఉద్యోగులందరికీ జీతాలు పెరిగాయి. మాజీ సైనికులను పట్టించుకోలేదు. ప్రభుత్వం విలువైన భూములను అమ్ముతూ ఆదాయం పొందుతున్నది. మాజీ సైనికులకు మాత్రం అసైన్డ్ భూమి కేటాయించడానికి మనసు రావడం లేదు. ఇప్పటికైనా మాజీ సైనికులు దేశం కొరకు చేసిన సేవలను గుర్తిస్తారా?


డా. బి. కేశవులు నేత, ఎండీ. (సైకియాట్రీ)

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

99496 95189

Advertisement

Next Story

Most Viewed