- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫూలే
సమస్యలపై మడమ తిప్పని పోరాటమే ఆమె ధీరత్వం, ఆకలిగొన్న వారికి కడుపు నింపడమే ఆమె ఆరాటం, సమాజంలో అసమానతలు తొలగించడమే ఆమె లక్ష్యం. అక్షర సమాజం ద్వారా సమాజ అభ్యున్నతే ఆమె జీవిత ధ్యేయం. ఆమె శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అణగారిన వర్గాల మాతృమూర్తి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడి, కుల వ్యవస్థ పునాదులను పెకలించి శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాడటం సామాజిక బాధ్యతగా స్వీకరించిన ధీశాలి.
ఆయనే తన గురువు
సావిత్రిబాయి మహారాష్ట్రలోని సతారా జిల్లా, నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది. అక్షరాలు దిద్దలేని అంధకార యుగంలో నిరక్షరాస్యతలో పాటు అజ్ఞానం, మూఢనమ్మకాలు బహుజన సమాజాన్ని చిత్రహింసలు పెడుతున్నాయి. ఆ పురుషులు చదువు నేర్చుకోకూడదని బ్రాహ్మణవాద మత గ్రంధాలు శాసించేవి. ఇక స్త్రీల దుస్థితి వేరే చెప్పనవసరం లేదు. బహుజన స్త్రీలే కాదు బ్రాహ్మణ స్త్రీలు కూడా చదువుకోవడానికి ధర్మశాస్త్రాలు అంగీకరించని రోజులవి. ఆడపిల్ల చదువుకుంటే ఆమె భర్త అర్ధాంతరంగా చనిపోతాడన్న మూఢనమ్మకాలు బలంగా నాటుకుపోయిన రోజులలో వేగుచుక్కలా సావిత్రిబాయి జన్మించింది. వారిది రైతు కుటుంబం. చిన్నప్పటి నుండి ఆమె అన్ని విషయాల పట్ల చురుకుగా వ్యవహరించేది. ఆమె తొమ్మిదవ యేటనే జ్యోతిరావు ఫూలే తో వివాహం జరిగింది. ఆ వివాహమే సమాజానికి ఎనలేని మేలు చేసింది.
నిరక్షరాస్యులైన సావిత్రిబాయిని విద్యావంతురాలు చేసి ఆమెకు తొలి గురువుగా, ఆదర్శ భర్తగా ఫూలే పేరు గడించాడు. అత్తారింట్లో కుటుంబ బాధ్యత మోస్తూ, విద్యాభ్యాసం చేయడం ఎందరికో ఆదర్శం. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 జనవరి 1న పూనాలోని బుధవారపేట లో మొట్టమొదటి అతిశూద్ర బాలికల పాఠశాలను భర్తతో కలిసి ప్రారంభించింది. తొలి ఉపాధ్యాయినిగా చరిత్రకెక్కింది. అయితే అక్కడి జనాలు సావిత్రిని అనరాని మాటలు, తిట్లు తిట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఆమెపై బురద జల్లినా, శాపనార్థాలు పెట్టినా నేను తప్పు చేయలేదు నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని తెలిపేది. ఆమె మొత్తంగా 50 పాఠశాలలు నెలకొల్పింది.
సామాజిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ
ఒకపక్క విద్యాబోధన చేయడమే కాక సామాజిక సేవలో ముందుండేది. మహిళలను చైతన్య పరిచేందుకు మహిళా సేవ మండల్ ను ప్రారంభించింది. ఇది అంటరానితనం, స్త్రీ సమస్యల పరిష్కారం కోసం స్థాపించిన తొలి సంస్థ. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగాయి. చిన్న వయసులోనే భర్త చనిపోయి నిరాశ్రయులైన వారికి ఆశ్రయం ఇచ్చేందుకు బాల హత్య ప్రతిబంధక్ గృహాన్ని సావిత్రి నేతృత్వంలో జ్యోతిబా ఫూలే ప్రారంభించారు. ఆ గృహం అనేకమంది ఆశ్రయమిచ్చింది. ఈ దంపతులు బ్రహ్మణ విధవకు జన్మించిన బిడ్డను దత్తత తీసుకొని పెంచి డాక్టర్ ను చేశారు. వీరు 'సత్యశోధక్ సమాజ్' నెలకొల్పి బాల్య వివాహాలకు, సతీ సహగమనానికి, మూఢాచారాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృత పరిచారు. వితంతువులకు పునర్వివాహాలు జరిపించారు. 1870 లో దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల సమయంలో రెండు వేల మంది బాల బాలికలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
సావిత్రిబాయి మంచి రచయిత్రి కూడా 1854లో ఆమె తన సంపుటి 'కావ్య ఫూలే' ను ప్రచురించింది. మరో కవితా సంపుటి 'పావన కాశీ సుభూద్ రత్నాకర్' 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి. తన భర్త చనిపోతే భర్త చితికి నిప్పంటించి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇది దేశ చరిత్రలోనే తొలి సంఘటన. అనంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతలను స్వీకరించింది. 1897లో ప్లేగు వ్యాధి ప్రబలిస్తుంటే సావిత్రిబాయి ఫూలే కొడుకు తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవలందించారు . ఆ సమయంలో 'ప్లేగు వ్యాధి పిల్లల శిబిరాన్ని' సైతం ఏర్పాటు చేశారు. చివరకు అదే ప్లేగు వ్యాధి బారిన పడి సావిత్రిబాయి 1897 సంవత్సరం మార్చి 10న చనిపోయారు. వ్యక్తిత్వంతో సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసి, ప్రేమ, అంకితభావం, కర్తవ్య దీక్షలతో ప్రజల మనసును గెలుచుకున్న ఆమె, తన సామాజిక లక్ష్యసాధన కోసం జీవితాంతం నడిచింది. అణగారిన, దళితుల, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసి తన జీవితాన్ని తర్వాత తరాలకు ఆదర్శంగా నిలిచింది.
(నేడు సావిత్రి బాయి జయంతి)
ములక సురేష్
9441327666
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read..
- Tags
- Savitribai Phule