- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ampasayya Naveen: చైతన్య స్రవంతి శిల్పి అంపశయ్య నవీన్
వీరు ఇప్పటివరకు 34 నవలలు, 8 కథా సంపుటాలు, సాహిత్య వ్యాస సంకలనాలు, వ్యాసాలు రాశారు. లెక్కలేనన్ని సాహితీ సభలు, సమావేశాలు నిర్వహించారు. 1944 నుంచి 1994 మధ్య 50 సంవత్సరాల కాలంలో తెలుగు సాంస్కృతిక రాజకీయ ఆర్థిక జీవితాలను అద్దం పట్టే విధంగా అంపశయ్య, ముళ్లపొదలు, అంత: స్రవంతి పేరుతో మూడు నవలలు వరుసగా రాశారు. వీటిని విమర్శకులందరూ రవి త్రయాలు అంటారు, ఇవి వరుసగా ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. 2004లో తెలంగాణ రైతాంగ పోరాటం ఇతివృత్తంగా రాసిన 'కాలరేఖలు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇందిరాగాంధీ సమయంలో విధించిన ఎమర్జెన్సీతో ప్రజలు పడిన ఇబ్బందులను కండ్లను కట్టినట్టు చూపుతూ 'చీకటి రోజులు' నవలను రచించారు.
ఆయన ప్రముఖ సాహితీవేత్త. ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు. ఉర్దు భాషలో ఓనమాలు దిద్దినా తెలుగు భాష ఆనవాళ్లు తెలుసుకోవడం కోసం బాల్యం నుంచే తెలుగు సాహిత్యం మీద అభిమానం పెంచుకున్నారు. సాహిత్యంలో అత్యద్భుత జ్ఞానాన్ని గడించారు. చిన్ననాటి నుంచే రచనలపై మక్కువను పెంచుకొని కథలు రాయడం ప్రారంభించారు. ఐదు దశాబ్దాల తెలుగు సాహితీ ప్రపంచంలో కవి దిగ్గజంగా ఎదిగిన దొంగరి మల్లయ్య సాహితీ లోకానికి అంపశయ్య నవీన్‌గా(ampaseyya naveen) సుపరిచితులు. 24 డిసెంబర్ 1941న సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో అమ్మమ్మ గారి ఇంటిలో జన్మించారు. స్వగ్రామం జనగామ జిల్లా పాలకుర్తి దగ్గరి వావిలాల. తల్లిదండ్రులు పిచ్చమ్మ-నారాయణ. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. సాహితీ ప్రియుడైన తాతగారి పేరునే వీరికి పెట్టారు. భారత, భాగవత పద్యాలను తన తండ్రి చేత వంట పట్టించుకోవడం, పోతన జన్మించిన బమ్మెర సమీపంలో సొంత ఊరు ఉండడం, తండ్రి సాహితీ పటిమ, పోతన సాహిత్య పరిమళాలు, తాతగారి పేరులో ఉన్న బలం కలగలిపి నవీన్ సాహితీ ప్రపంచంలో అగ్రగణ్యులుగా ఎదిగారని చెప్పవచ్చు.
నాలుగవ తరగతి చదివే రోజులలోనే మంచి మంచి కథలు చెప్పి స్నేహితులను మెప్పించిన నవీన్ తన అత్యద్భుత కథల ద్వారా సాహితీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. పాఠశాలలో గణితం బోధించే విశ్వనాథ వెంకటేశ్వర్లు మాస్టారు వీరిలో ఉన్న సాహితీ పటిమను గుర్తించి ఒక లిఖిత మాసపత్రికకు ఎడిటర్‌గా నియమించారు. అందులో కథలు, కవితలు రాస్తుండేవారు. 'కవిత్వం కంటే నువ్వు కథలే బాగా రాస్తున్నావని' గురువుగారు చెప్పడంతో కథల రచనల మీద ఇంకా మక్కువను పెంచుకున్నారు. 1960-61 ప్రాంతంలో కథలు, కవిత్వాలు పత్రికలకు పంపుతుండేవారు. ప్రచురితం కాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ఆత్మీయులు వరవరరావు(varavara rao) సలహాతో నవీన్‌గా పేరు మార్చుకున్నారు. అప్పటి నుంచి అదే పేరుతో వ్యాసాలు, కవితలు, కథలు పత్రికలలో ప్రచురితమవుతూ వచ్చాయని ఆయనే స్వయంగా చెప్పారు.
తొలి నవలే ఇంటి పేరుగా
నవీన్ మొదటగా రాసిన నవల 'అంపశయ్య' కాబట్టి తన పేరును 'అంపశయ్య నవీన్'గా మార్చుకొమ్మని ప్రఖ్యాత విమర్శకులు కేపీ అశోక్ సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి 'అంపశయ్య నవీన్'గా సాహితీ లోకానికి సుపరిచితులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. అయినప్పటికీ, తెలుగు సాహిత్యం అంటే అత్యంత అభిమానం. మానసిక శాస్త్రవేత్త సిగ్మెంట్ ఫ్రాయిడ్(sigmund freud) ప్రభావం వీరిపై పడింది. అందుకే వీరి రచనలన్నీ నిజ జీవితానికి, వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. తన రచన శైలికి జీవన విధానానికి అద్దం పట్టే విధంగా 'చైతన్య స్రవంతి శిల్పం'లో నవలా రచన సాగింది. యూనివర్సిటీ వాతావరణం, విద్యార్థుల మనసు లోపల ఉన్న జ్ఞాపకాలు, ప్రశ్నలు, మనసులో పడిన సంఘర్షణలు, లోపల ఆలోచనలను పాఠకుల కళ్లకు కట్టినట్లు చూపిస్తూ మీరు 'అంపశయ్య' నవలను రాశారు. విద్యార్థి లోకం నుంచి నుంచి ఆదరణ లభించింది. 14 సార్లు పునర్ముద్రణ జరిగింది. లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.'క్యాంపస్ అంపశయ్య' పేరుతో సినిమా కూడా వచ్చింది.
వీరు ఇప్పటివరకు 34 నవలలు, 8 కథా సంపుటాలు, సాహిత్య వ్యాస సంకలనాలు, వ్యాసాలు రాశారు. లెక్కలేనన్ని సాహితీ సభలు, సమావేశాలు నిర్వహించారు. 1944 నుంచి 1994 మధ్య 50 సంవత్సరాల కాలంలో తెలుగు సాంస్కృతిక రాజకీయ ఆర్థిక జీవితాలను అద్దం పట్టే విధంగా అంపశయ్య, ముళ్లపొదలు, అంత: స్రవంతి పేరుతో మూడు నవలలు వరుసగా రాశారు. ఈ మూడు నవలలలో కథానాయకుని పేరు రవి కావడంతో వీటిని విమర్శకులందరూ రవిత్రయాలు అంటారు, ఇవి వరుసగా ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. 2004లో తెలంగాణ రైతాంగ పోరాటం ఇతివృత్తంగా రాసిన 'కాలరేఖలు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇందిరాగాంధీ(indira gandhi) సమయంలో విధించిన ఎమర్జెన్సీతో ప్రజలు పడిన ఇబ్బందులను కండ్లను కట్టినట్టు చూపుతూ 'చీకటి రోజులు' నవలను రచించారు.
జీవితాలను ఔపోసన పట్టినట్టుగా
చలం(chalam) గారి జీవిత విధానాన్ని ఆధారం చేసుకుని 'ప్రేమకి ఆవలితీరం' నక్సలైట్లకు పోలీసులకు మధ్య నలిగిపోయిన బలవుతున్న అమాయక ప్రజలనుద్దేశించి 'రక్త కాసారం' ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలు, యాసిడ్ దాడి నేపథ్యంలో 'ప్రేమోన్మాదులు' పేరుతో నవలలు రాశారు. మహిళలు అంటే వీరికి అపార గౌరవం, వారికి జరుగుతున్న అన్యాయాల మీద, ఇదేం న్యాయమంటూ రాసిన 'విచలిత' నవల మహిళలకు కొంత ఊరట కలిగించింది. ఈ విధంగా సమాజంలో జరిగే ప్రతి సంఘటనను సమాజానికి అందించి చైతన్యపరచడంలో ముందున్నారు. ప్రయాణాలలో ప్రమదలు, చెదిరిన స్వప్నాలు, దాగుడుమూతలు, ఉమెన్స్ కాలేజ్, ఏ వెలుగులకీ ప్రస్థానం, వంటి నవలలు రాశారు.
ఫ్రమ్ అనురాధ విత్ లవ్, నిష్కృతి, అస్మదీయులు-తస్మదీయులు, ఎనిమిదో అడుగు, లైఫ్ ఇన్ ఏ కాలేజ్, బంధితులు, అనేవి కథా సంపుటాలు. నవీన్ సాహిత్య వ్యాసాలు, సాహిత్య కబుర్లు, తెలుగులో ఆధునిక నవల, సినిమా వీక్షణం మొదలైనవి వ్యాస సంపుటాలు. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలలో డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. కవి తన హృదయంలో కలాన్ని ముంచి రాయాలని, గాంధీ,చలం, కాళోజీ ఏం చెప్పారో దాన్నే ఆచరించారు. వీరి కలం నుండి ఇంకా ఎన్నో నవలలు, కథలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
కొమ్మాల సంధ్య
తెలుగు లెక్చరర్
తాడ్వాయి, ములుగు
91540 68272
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
Hyderabad Book Fair: పుస్తకాలే విలువల వెలుగులు