- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీకి కొలీజియం వ్యవస్థ అవసరమేనా?
కమిషనర్ల ఎంపిక విధానంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రితో ఎన్నికల కమిషన్ తలపడే సందర్భం వస్తే ప్రధానిపై చర్యలు తీసుకోగలరా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అందుకే న్యాయవ్యవస్థకు కొలీజియం వ్యవస్థ ఉన్నట్టుగానే ఎన్నికల కమిషనర్‌ను నియమించడానికి ఒక స్వతంత్ర్య వ్యవస్థను ఏర్పాటు చేయాలనే భావం ఏర్పడుతుంది. అలా చేస్తేనే ఈసీ మీద వస్తున్న ఆరోపణలను నివారించడంతోపాటు ఆ వ్యవస్థ మరింత పారదర్శకంగా పనిచేసే అవకాశం కల్పించినట్టు అవుతుంది. మహాకవి ఆరుద్ర వ్యాఖ్యానించినట్టు 'దేశ రాజకీయాలు మేడిపండు లాంటివి. వాటి నుంచి మేలిమి ఆశించడం దురాశే' అవుతుందేమో!
అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ కలిగిన మన దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా, ఆర్టికల్ 324 ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్‌ను(election commission) 1950లో ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటివరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను నిర్వహించింది. ఇప్పటి దాకా 25 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా వ్యవహరించారు. 1989 వరకు ఎన్నికల కమిషనర్ ఒకరు మాత్రమే ఉండేవారు. ఆ తరువాత మరో ఇద్దరిని నియమించారు. ముగ్గురిలో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. 72 సంవత్సరాల భారత ఎన్నికల చరిత్రలో కమిషన్ మీదా, కమిషనర్ మీదా అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.
ఎన్నికలను పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించకుండా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారినే ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటు చేయాలనే పిటిషన్ మీద జస్టిస్ కేఎం జోసెఫ్(justice km joseph) ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతున్నది. విచారణ జరుగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ ను( election commissioner arun goyal) నియమించడం, ఎన్నికల కమిషనర్లుగా టీఎన్ శేషన్(tn seshan) వంటివారు రావాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఎన్నికల కమిషనర్ల నియామకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఆయన వంటి వారు కావాలని
ఆర్థిక సంఘం, ఎన్నికల కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (Comptroller and Auditor General), అంతర్రాష్ట్ర మండలి, మహిళా కమిషన్, సుప్రీంకోర్టు(supreme court) వంటివి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థలు. ఇవి స్వయంప్రతిపత్తితో పని చేస్తేనే ఆయా సంస్థల గౌరవం పెరిగి సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగదు. కానీ, అవి నిష్పక్షపాతంగా రాజ్యాంగం కల్పించిన అధికారంతో పనిచేయకుండా అధికార పార్టీ కనుసన్నలలోనే పనిచేస్తున్నాయనే ఆరోపణలు నిత్యం వింటూనే ఉన్నాం. ఇది దేశానికి ఎంతో ప్రమాదం. ఈ దేశంలో ఎన్నికల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి ఈ కమిషన్ ఇలాంటి ఆరోపణలకు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతంగా తన విధులు నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఉంది.
ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో పదవ ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన టీఎన్ శేషన్(election commissioner tn seshan) ఒక ప్రత్యేకంగా వ్యవహరించారు. ఓటర్ ఐడీ కార్డ్ అమలుకు తెచ్చారు. అనుమతి లేకుండా గోడలపై రాతలు, మైకులు వాడటం, ఖర్చు పరిమితి, మత పరమైన ప్రదేశాలలో, విద్యాసంస్థలలో ఎన్నికల ప్రచారం నిషేధించారు. దీంతో కొంతమేరకు ప్రక్షాళన జరిగింది. ఆయన తరువాత ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా వ్యవహరించిన ఎంఎస్ గిల్, జే ఎం లింగ్డో, టీఎస్ కృష్ణమూర్తి కూడా అమలు చేశారు. కానీ, అలాంటి వారు ఇప్పుడు లేరు. అందుకే సుప్రీంకోర్టు(supreme court) సైతం ఆయన పేరు తలచింది.
సంస్కరణలు తీసుకురావాలి
నిజానికి 80 కోట్ల ఓటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ తేలికైన విషయం కాదు. కమిషన్ ఎన్నికలను కఠినంగా నిర్వహించడానికి మరిన్ని సంస్కరణలు చేయాలనే భావన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఓటర్ల నమోదులో జరుగుతున్న అవతవకలు, పెరుగుతున్న ఖర్చు, ప్రలోభాలు, డబ్బు నియంత్రణ, అసాధ్యమైన హామీల విషయంలో సంస్కరణలు అత్యవసరం. ఎందుకంటే, ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ప్రచార మాధ్యమాల సాక్షిగా ప్రజలు కూడా వాటిని అంగీకరించారు. అయినా, చర్యలు చేపట్టలేని అచేతన స్థితిలో ఎన్నికల కమిషన్ ఉండిపోయిందనే భావన సామాన్య ప్రజలలో కలుగుతోంది. అందుకే సంస్కరణలు తీసుకోవడానికి కమిషనర్లు స్వతంత్రంగా పని చేయాలి. తరచూ జరుగుతున్న ఎన్నికల నిర్వహణ వలన ఆర్థిక భారం పడుతుంది కాబట్టి జమిలి ఎన్నికల(jamili election) సాధ్యాసాధ్యాలను సైతం ఎన్నికల కమిషన్ త్వరగా పరిశీలించాలి.
ఈ మార్పులు, సంస్కరణలు తీసుకురావడానికి సుప్రీంకోర్టు భావిస్తున్నట్టు కమిషనర్ల ఎంపిక విధానంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రితో(prime minister) ఎన్నికల కమిషన్ తలపడే సందర్భం వస్తే ప్రధానిపై చర్యలు తీసుకోగలరా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అందుకే న్యాయవ్యవస్థకు కొలీజియం వ్యవస్థ(collegium system) ఉన్నట్టుగానే ఎన్నికల కమిషనర్‌ను నియమించడానికి ఒక స్వతంత్ర్య వ్యవస్థను ఏర్పాటు చేయాలనే భావం ఏర్పడుతుంది. అలా చేస్తేనే ఈసీ మీద వస్తున్న ఆరోపణలను నివారించడంతోపాటు ఆ వ్యవస్థ మరింత పారదర్శకంగా పనిచేసే అవకాశం కల్పించినట్టు అవుతుంది. మహాకవి ఆరుద్ర వ్యాఖ్యానించినట్టు 'దేశ రాజకీయాలు మేడిపండు లాంటివి. వాటి నుంచి మేలిమి ఆశించడం దురాశే' అవుతుందేమో!
డా. తిరునహరి శేషు
రాజకీయ విశ్లేషకులు
కేయూ, వరంగల్
98854 65877