- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి!
రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి, గాయాల బారిన పడినవారికి, ప్రసవ సమయంలో స్త్రీలకు, శస్త్ర చికిత్సలు చేసేటప్పుడు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న రోగులకు, క్యాన్సర్, హిమోఫిలియా, మూత్రపిండ వ్యాధులు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి, సికిల్ సెల్, థ్రోంబోసైటోపెనియా, తల్లేమియా వంటి జబ్బులున్నవారికి బయట నుండి రక్తాన్ని మార్పిడి చేయవలసిన అవసరం ఉంటుంది. సికిల్ సెల్ రోగులకు జీవితాంతం తరుచుగా రక్త మార్పిడి అవసరం అవుతుంది. కీమోథెరపీ చేసుకుంటున్న వాళ్లకి కూడా రక్తం ఆవశ్యకం. ప్రతి రోజు సుమారు పన్నెండు వేల మంది నాణ్యమైన రక్తం అందక చనిపోతున్నారు. ప్రతీ రోజు ముప్పై ఎనిమిది వేలకు పైగా వ్యక్తులకు వివిధ సందర్భాలలో రక్తం అవసరం అవుతుంది. ఇటువంటి వారికి రక్తం అందించాలంటే ఎక్కువ సంఖ్యలో ఆరోగ్యకరమైన దాతలు అవసరం. బయట కృత్రిమ పద్ధతులలో రక్తాన్ని తయారు చేయలేము. ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉన్నది.
ఈ రోజు ప్రత్యేకత..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, రక్తమార్పిడి కోసం సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వచ్ఛందంగా చెల్లించని రక్తదాతలకు, ప్రాణాలను కాపాడేందుకు, ఆరోగ్య వ్యవస్థలకు రక్తదానం ఆవశ్యకమో ఈ రోజు తెలియచేస్తుంది. స్వచ్ఛందంగా, చెల్లించని రక్తదాతల నుండి రక్త సేకరణను పెంచడానికి, ఈ రోజును జరుపుకుంటారు. ఇది ‘జాతీయ రక్త మార్పిడి సేవలు, రక్తదాత సంస్థలు, ఇతర ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించవచ్చు. నేడు జరుపుకోనున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవ ప్రచారానికి సంబంధించిన థీమ్ ‘రక్తం ఇవ్వండి, ప్లాస్మా ఇవ్వండి, జీవితాన్ని పంచుకోండి, తరచుగా పంచుకోండి.’ రక్తాన్ని లేదా ప్లాస్మాను దానం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి పోషించగల కీలక పాత్రను నొక్కి చెబుతూ, జీవితకాల రక్తమార్పిడి మద్దతు అవసరమయ్యే వ్యక్తులపై ఈ థీమ్ దృష్టి సారిస్తోంది.
మన దేశంలో సంవత్సరానికీ 15 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 11 మిలియన్ యూనిట్ల మాత్రమే సేకరించడం జరుగుతుంది. ఏ రక్త సమూహం ఉన్న వారికి, ఆ రక్త సమూహం కలిగిన అనుకూలమైన రక్తాన్ని మాత్రమే ఎక్కించాలి. అలా కాకపోతే మార్పిడి చేసుకుంటున్న వారిపై వారి యొక్క రోగ నిరోధక వ్యవస్థ దాడిచేసి మరణించడానికి అవకాశం ఉంటుంది. ఐతే రక్తదానం చేయడంపై కొన్ని అపోహలు ప్రజలలో ఉన్నాయి. కానీ అవేవీ నిజం కాదు.
రక్తదానం వల్ల లాభాలు..
మన శరీర బరువులో రక్తం సుమారు 7 శాతం ఉంటుంది. 350 మిల్లీ లీటర్ల రక్తం మాత్రమే మన శరీరం నుండి సేకరిస్తారు. 18 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆరోగ్యకరమైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. రక్తాన్ని సేకరించడానికి 15 నుండి 20 నిమిషాలు మాత్రమే అవుతుంది. తరువాత ఒక గంటలో వారి సాధారణ పనులను చేసుకోవచ్చు. రక్తదానం చేయడం వలన ఆ వ్యక్తి యొక్క గుండె ఆరోగ్యం పెరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. కొత్త రక్త కణాలు తయారయ్యి మునపటి కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాడు. కాలేయం, ఊపిరితిత్తులు, ప్రేగులకు వచ్చే క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. అంతకుమించి ఎందరో ప్రాణాలు కాపాడే వ్యక్తిగా మానసిక ఆనందాన్ని పొందుతారు. రక్తదానం చెయ్యాలనుకున్న వ్యక్తి దగ్గరలోనే ఉన్న రెడ్ క్రాస్ రక్త నిధికి గానీ, ప్రభుత్వ ఆసుపత్రులకు గానీ స్వచ్ఛందంగా వెళ్ళవచ్చు. అక్కడ తగిన పరీక్షలు చేసి రక్తాన్ని సేకరిస్తారు. దీనికి కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ముందుకు రావాలి. సినిమా నటులు, రాజకీయ నాయకులు వారి పుట్టిన రోజులకు వారి ఫ్యాన్స్‌కి రక్తదానం చెయ్యమని సందేశాలు ఇవ్వాలి. ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి సత్కారాలు చెయ్యాలి. ఇటువంటి వారికి విద్యా ప్రవేశాలలో, ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్ కల్పించాలి. సామాజిక మాధ్యమాలు, చలన చిత్రాలు, టీవీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠ్య పుస్తకాల ద్వారా రక్తదానం వలన కలిగే లాభాలను విద్యార్థులకు తెలియజేసి వారిని భవిష్యత్తులో ఇటువంటి కారక్రమాలలో పాల్గొనేటట్లు చెయ్యాలి.
(నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం)
డిజె మోహన రావు
టీచర్
94404 85824