- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాలు అంత ప్రభావం చూపుతాయా..
సినిమాల చుట్టూ రాజకీయాలు, వివాదాలు, చర్చలు జరగడం ప్రహసనంగా మారింది. ముఖ్యంగా తెలుగు సినిమా విషయానికి వస్తే 1960ల తరువాత ఉద్యమాల ప్రభావంతో వచ్చిన సినిమాల తాకిడి పెరిగిపోయింది. ప్రముఖ దర్శకుడు బీ.నర్సింగరావు తెలంగాణ సాయుథ పోరాట నేపథ్యంలో తీసిన ‘మా భూమి’ సినిమా ట్రెండ్‌ను సృష్టించింది. ఆ తరువాత కాలంలో నాటి భూస్వామ్య వెట్టి చాకిరిని అడపదడపా చాలా సినిమాల్లో చూయించే ప్రయత్నం చేసారు. వామపక్షాల ఉద్యమాల ప్రభావాన్ని తన సినిమాల ద్వారా ప్రముఖ దర్శకుడు మాదాల రంగారావు అనేక సినిమాలు నిర్మించి 80లలో సంచలనం సృష్టించారు. ఎర్ర మల్లెలు, ఎర్రమట్టి, ఎర్రపావురాలు లాంటి అనేక విప్లవ భావజాలం ఉన్న సినిమాలు స్వయంగా నటించి నిర్మించారు. మాదాల రంగారావు సినిమాలు నాటి యువత, సమాజంపై చాలా ప్రభావం చూపాయి.
ఆర్. నారాయణమూర్తి ఒరవడి..
1979, 80 తరువాత నక్సలైట్ ఉద్యమం బలపడటం గ్రామంలో పోలీసుల అలజడి మొదలవ్వడం ఉత్తర తెలంగాణ కల్లోలిత ప్రాంతంగా ప్రకటించడం నాడు తెలంగాణలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఎన్కౌంటర్‌తో పల్లెలు తెల్లవారుతున్న రోజుల నేపధ్యం కథాంశంగా ఆర్. నారాయణ మూర్తి నిర్మాణంలో అర్ధరాత్రి స్వాతంత్ర్యం, ఎర్ర సైన్యం, చీమలదండు, అరణ్యం లాంటి సినిమా విడుదల అయ్యాయి. మెయిన్‌స్ట్రీమ్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా కమర్షియల్‌గా విజయాన్ని నమోదు చేసుకున్నాయి. నారాయణ మూర్తి సినిమాల ప్రభావంతో అగ్రశ్రేణి నిర్మాతలు, దర్శకులు కూడా వామపక్ష భావజాల సినిమాల వైపు మళ్ళాల్సిన పరిస్థితి నెలకొనింది. ఎన్.శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్ సినిమా పెద్ద హిట్ అయ్యింది. తరువాత శ్రీరాములయ్య లాంటి సినిమాలు వచ్చాయి. దాసరి నారాయణ రావు లాంటి కమర్షియల్ దర్శకులు కూడా ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా లాంటి సినిమాలు తీయాల్సిన ట్రెండ్ ఏర్పడ్డది. అనంతరం కుల సమస్య పైన రౌడీ దర్బార్, దేవర కొండ వీరయ్య లాంటి సినిమాలు విడుదల అయ్యాయి. 1997, 2000 సంవత్సరం తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలు అవ్వడంతో బతుకమ్మ, జైబోలో తెలంగాణ, వీర తెలంగాణ లాంటి సినిమాలు వచ్చాయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
లెఫ్ట్ చిత్రాలనుంచి కశ్మీర్ ఫైల్స్ దాకా..
సినిమా రంగంలో మొదటి నుండి వామపక్ష వాదులది పైచేయిగా అనేక సినిమాలు వచ్చి భావజాల రంగంలో గట్టి వాణిని వినిపించాయి. అది ముఖ్యంగా దక్షిణాది సినిమా నుండి మాత్రమే. తాజాగా ఉత్తరాది నుండి జాతీయవాద సినిమా పేరుతో రైట్ వింగ్ సినిమా మొదలైంది. కాశ్మీర్ ఫైల్స్ పేరుతో వచ్చిన సినిమాపై దేశ వ్యాపంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. కాశ్మీర్ ఏర్పాటు వాద మూకలు స్థానిక కాశ్మీర్ పండితులపై జరిపిన దారుణ మారణ కాండను ప్రతిబింబిస్తూ విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ వివాదాలను మోసుకు రావడమే కాకుండా గొప్ప విజయాన్ని అందుకుంది. అదే కోవలో వచ్చిన కేరళ ఫైల్స్ కేరళ లవ్ జిహాద్ కథాంశంగా రూపుదిద్దుకున్న సినిమా.
కాశ్మీర్, కేరళలో జరిగిన దారుణాలకంటే తెలంగాణలో రజాకార్ల అకృత్యాలు వెయ్యి రెట్లు ఎక్కువ. తెలంగాణలో రజాకార్ల అకృత్యాలపై సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో రజాకార్ సినిమా రూపు దిద్దుకొని విడుదలకు సిద్దంగా ఉంది. బహు భాషలో విడుదల కానున్న రజాకార్ సినిమా చుట్టూ అనేక విమర్శలు, వివాదాలు చుట్టి మిట్టాయి. సినిమా ట్రైలర్ తోటే వివాదం మొదలై, యాంకర్ అనసూయ ప్రధాన భూమికగా విడుదలైన బతుకమ్మ పాట సాహిత్యంపై వామపక్షవాదులు పెద్దఎత్తున చర్చ పెడుతున్నారు. వెట్టి అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మతం రంగు పులుముతున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు సినిమాను సినిమాగా చూడాలని జాతీయ వాదులు అంటున్నారు. ఏది ఏమైనా సినిమాల చుట్టూ వివాదం చెలరేగడం భావదారిద్ర్యం.
హాల్‌లో పుట్టి, బయట ముగిసే భావోద్వేగం..
3 గంటల సినిమా ప్రభావం మానవ జీవితం అంతగా ప్రభావం చూపుతుందా? ప్రభావమే నిజమైతే ఎన్నో దేశ భక్తి, భక్తి సినిమాలు వచ్చాయి. మార్పు ఏమైనా ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సినిమాలకు సిద్ధాంతాలు, ఆచారణలు ఆంటగట్టడం ఎంత వరకు సమంజసం? మీడియా రంగంలో సినిమాది ప్రభావవంతమైన పాత్రే కావచ్చు. సమాజం మొత్తాన్ని సినిమానే నడిపిస్తుందా అంటే నేతి బీరకాయలో నెయ్యి వెతకడం లాంటిదే. సినిమా అనేది చిన్న ఎమోషన్. అది సినిమా హాల్‌లో పుట్టి హాల్ బయటికి వచ్చేంత వరకు ఉండే తాత్కాలిక భావోద్వేగం. మనుషులు, రాజకీయాలు, సిద్ధాంతాలు ప్రభావం చూపినంతగా సినిమాలు చూపిస్తాయని ఎక్కడ రుజువు కాలేదు. శ్రీశ్రీ రచించిన మహా ప్రస్థానం, చలం రచనలు, గద్దర్ సాహిత్యం, శివసాగర్ కవిత్వం ప్రభావం కొన్ని దశాబ్దాల కాలం సమాజంపై చెరగని ముద్ర వేసాయి.
ప్రతి సినిమాపై రంధ్రాన్వేషణ ఎలా.?
100 రోజులు హిట్టు కొట్టిన సందేశాత్మక సినిమాలు అరుదు అని చెప్పవచ్చు. విడుదల అయ్యే ప్రతి సినిమాపైనా రంధ్రాన్వేషణ చేస్తూ వివాదాలు సృష్టించడం మనోభావాలు అంటగట్టడం పరిపాటిగా మారింది. సినిమా హిట్టు కొడితే ప్రేక్షకుడికి అహ్లాదం నిర్మాతకి కాసుల పంట, బోల్తా కొడితే ప్రేక్షకుడికి చూసినంత సేపు తలపాటు నిర్మాత జేబుకు చిల్లు. ఇంతకు మించి సంభవించే ఉపద్రవం ఏమి లేదు. తాజాగా రజాకార్ సినిమా పాటలు, ట్రైలర్‌పై వివాదం లేపుతున్న వ్యక్తులు, సమూహాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
దొమ్మాట వెంకటేష్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
98480 57274